ఒక ఊరిలో ఒక కమ్మరి ఉండేవాడు. అతను ఒకసారి, ఒకే కొలిమిలో రెండు మంచి నాగళ్లను తయారుచేశాడు.

ఒకనాడు ఒక రైతు, నాగలి కావాలంటూ కమ్మరి దగ్గరికి వచ్చాడు. కమ్మరి తన దగ్గరున్న రెండు నాగళ్ళనూ రైతుకు చూపించాడు. అంతలోనే ఒక నాగలి మాట్లాడింది ఉత్సాహంగా: "నన్ను తీసుకెళ్ళు ఓ రైతూ! నేను నీకు పొలం దున్ని మంచి పంట పండిస్తాను" అని. రెండో నాగలి ఇష్టం లేనట్లు ముఖం పక్కలు తిప్పుకుని పడుకున్నది. సహజంగానే ఆ రైతు మొదటి నాగలిని కొనుక్కున్నాడు. రెండవ నాగలి కమ్మరి దగ్గరే మిగిలిపోయింది.

కొంత కాలం గడిచింది. కమ్మరి నాగలి అక్కడే పడిఉంది. దాన్ని వేరే ఎవ్వరూ తీసుకుపోలేదు. మెల్లగా దానికి తుప్పు పట్టింది.

ఒకసారి రైతు ఏదో పనిపడి, తన నాగలిని తీసుకుని కమ్మరి దగ్గరికి వచ్చాడు. కమ్మరి నాగలి, రైతు నాగలిని చూడగానే గుర్తుపట్టింది- అది ఇంకా కొత్తదానిలాగే మెరిసిపోతున్నది!

"నేను తుప్పు పట్టిపోయాను.నువ్వేమో నిగనిగలాడుతున్నావు. కారణం ఏమిటి?" అడిగింది కమ్మరి నాగలి.

"నేను ఎప్పుడూ పని చేస్తూ ఉంటాను. అందుకనే మెరుస్తున్నాను. నువ్వు ఏ పనీ చెయ్యకుండా పడి ఉన్నావు. అందుకే తుప్పు పట్టి, ఇలా దుమ్ము కొట్టుకుపోయావు" అని చెప్పింది రైతు నాగలి.

రెండవ నాగలికి అప్పుడు అర్థమయ్యింది శ్రమ విలువ, దాని ఫలితమూ!