నీడను ఇచ్చే తరులూ-నింగిని తాకే గిరులూ జల జల పారే ఝరులూ-తళ తళ విరిసే విరులు అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం వెలుగును ఇచ్చే సూర్యుడు-వెన్నెలనిచ్చే చంద్రుడు తలతల మెరిసే తారలూ-చల్లని మబ్బుల బారులూ అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం ధాన్యమునిచ్చే పొలాలు-దాహము తీర్చే జలాలు పొలాలు దున్నే హలాలు-పలు రకంబుల ఫలాలు అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం అడవిన తిరిగే మృగాలు -అంతట ఎగిరే ఖగాలు చోద్యమైన కీటకాలు-చూడ చూడ పలు రకాలు ఎన్నో ఉన్న ఈ లోకం-ఎన్నదగిన ఒక నాకం దేవుని కోసం గుళ్లూ-దూరము పోవగ బళ్లూ అందాలొలికే ఇళ్లూ-అన్నీ చూడగ కళ్లూ అమరిఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం అన్నీ ఉన్న ఈ లోకం-అందమైన ఒక నాకం అందమైన ఒక నాకం