ఒకనాడు రాజుగారు కొలువుతీరి ఉండగా మంత్రిగారు విషాద భరిత వదనంతో కంగారుగా లోనికి ప్రవేశించారు. ఆయన కళ్ల నిండా కన్నీరు నిండి ఉన్నింది. `ఎందుకలా దు:ఖిస్తున్నారు?’ అని రాజుగారు అడిగిన మీదట, మంత్రిగారు సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పారు ఏడుస్తూనే - "మహారాజా, ప్రభూ! గంధర్వసేన్ మరి లేడు" అని. ఆ మట వినగానే రాజుగారు నిర్ఘాంతపోయారు. కళ్లలో నీరు ఉబికిరాగా గంభీరంగా అరిచారు _ "అయ్యో, భగవంతుడా, గందర్వసేన్ మరణమా!" అని. వెంటనే ఆయన సభను మరునాటికి వాయిదా వేస్తూ, దేశ మంతటా 41 రోజుల సంతాపం ప్రకటించారు.

ఆనాడు రాణివాసానికి వెళ్లే సమయానికి రాజుగారు ఇంకా రోదిస్తూనే ఉన్నారు. రాణులు ఆయన శోకానికి కారణం అడిగితే , గద్గద స్వరంతో ఆయన గందర్వ సేన్ మరణ వార్తను ప్రకటించారు. దాంతో రాణులందరూ బిగ్గరగా రోదించడం మొదలుపెట్టారు. త్వరలోనే రాణివాసమంతా గుండెలు బాదుకుంటూ ఏడిచే మహిళలతో నిండిపోయింది.

పట్టపురాణికి ఒక సేవకురాలు ఉండేది. ఆ పిల్లకు విషయం సరిగా అర్థంకాలేదు. ఆమె మహారాణి వద్దకు పోయి, "మహారాణీ! అందరూ ఎందుకు ఏడుస్తున్నారు?' అని అడిగింది. మహారాణి నిట్టూర్చి, "అయ్యో, ఏం చెప్పను, గంధర్వ సేన్ ఇక లేరట!" అన్నది. "మహారాజు గారికి గంధర్వ సేన్ ఏమవుతారు?" అని అడిగింది ఆ పిల్ల. "అయ్యో, ఆ సంగతి నిజంగా నాకు తెలీదు అని, మహారాణి నేరుగా రాజుగారి దగ్గరికి పోయింది. "మేమందరం సంతాపం ప్రకటిస్తున్న గంధర్వ సేన్ గారు మీకేమవుతారు?" అని అడిగింది.

రాజుగారి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు! అందువలన ఆయన కొంచెం కలవరపడుతూ మంత్రి గారిని పిలిచి గంధర్వసేన్ ఎవరని అడిగారు. "క్షమించాలి, మహారాజా!" అన్నాడు మంత్రిగారు- "ఈ సేవకుడికి గంధర్వ సేన్ ఎవరో నిజంగా తెలీలేదు. అయితే సేనాపతి ఏడుస్తూ గంధర్వ సేనుడు చనిపోయాడనటంతో, బహుశ ఆయన ఎవరో గొప్పవాడే అయి ఉంటాడని, సేనానికి తోడుగా తానూ ఏడ్చాడు!" అని విన్నవించుకున్నాడు భయంగా.

"మూర్ఖుడా, ఫో! పోయి వెంటనే చనిపోయిన గంధర్వసేన్ ఎవరో కనుక్కొనిరా" అని గర్జించాడు మహారాజు చికాకుపడుతూ. బ్రతికిందే చాలుననుకున్న మంత్రిగారు ఆగకుండా పరుగెత్తి సేనానిని నిలదీశారు- "గంధర్వసేన్ ఎవరు?" అని.

సేనాని మంత్రిగారి ముఖంకేసి ఖాళీగా చూస్తూ నిలబడ్డాడు కొంత సేపు. తదుపరి అన్నాడు "అయ్యా, కీర్తిశేషులు గంధర్వసేన్ గారు ఎవరో నాకు తెలీదు. కానీ సైనికాధికారి ఆయన చనిపోయారన్న వార్తను మోసుకొని వచ్చి భోరు భోరున ఏడవటంతో, నేనూ కంట తడి పెట్టాను, వెంటనే మంత్రిగారికి ఆ కబురును అందేటట్లు చేశాను!" అని.

ఇక వెంటనే మంత్రి, సేనాపతి ఇద్దరూ సైనికాధికారి దగ్గరికి పరుగెత్తారు. "ఒరే, నువ్వు ఏడ్చిన గంధర్వసేన్ గారు ఎవరురా?", అంటూ. అయ్యా, గంధర్వ సేన్ ఎవరో, ఏంటో నేను మీకేమీ చెప్పలేను. అయితే నా భార్య ఆయన మృతి కారణంగా ఏడుస్తూంటే, నేను తట్టుకోలేక పోయాను. వెంటనే ఆ సంగతిని మీకు తెలియజేశాను. దు:ఖం, సంతోషం ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. నా భార్య ఏడుస్తూంటే నాకూ ఏడుపు వచ్చింది" అన్నాడు సైనికాధికారి.

వెంటనే ముగ్గరూ కలిసి సైనికాధికారి భార్య దగ్గరికి వెళ్లారు. మృతి చెందిన గంధర్వసేన్ ఎవరో ఖచ్చితంగా ఆమెకూ తెలీదుట. క్రితం రోజున ఆమె చెరువుకు స్నానానికని వెళ్లిందట. అక్కడ చాకలామె నా గంధర్వ సేన్ ఇక లేడు, నేనేం చేసేదిరో!" అని గుండెలవిసేటట్లు ఏడుస్తుంటే చూసి తనకూ కళ్ల నీళ్లు ఆగలేదట.

ఇక అందరూ కలిసి చాకలామె ఇంటికి తరలివెళ్లారు. "ఉదయం అంత బిగ్గరగా ఏడిపించిన గంధర్వసేన్ ఎవరు? నీకేమవుతారు?" అని అడిగారామెను.

"అయ్యో! నా దురదృష్టాన్ని ఏమని చెప్పుకోను?" అని మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది చాకలామె. "నా హృదయం ఇంకా వాడికోసం అల్లాడుతూనే ఉంది. నా కెంతో ఇష్టమైన గాడిద, వాడు. నాకు నా కొడుకెంతో వాడూ అంతే!" అని, ఇంకా ముగించకుండానే బిగ్గరగా ఏడుపులంకించుకున్నది చాకలామె.

ఎంతో మర్యాదగాను, గౌరవంగాను వచ్చిన జనాలంతా సిగ్గుపడి, వీలైనంత నిశ్శబ్దంగా ఎక్కడివాళ్లక్కడికి జారుకున్నారు.

మంత్రిగారు రాజమహలుకు రాగానే రాజుగారి కాళ్లమీద పడ్డాడు. ముందుగా అభయం పుచ్చుకొని, ఆ తర్వాతగానీ రాజుగారికి వాస్తవమేంటో చెప్పలేదు: "సభికులందరినీ అంతగా ఏడిపించిన గంధర్వసేన్ మరెవరో కాదు, ఒక చాకలామె పెంపుడు గాడిద!" అన్న సంగతి తెలుసుకొని అందరూ నాలుకలు వెళ్లబెట్టారు. రాజుగారు మంత్రిని కోప్పడ్డారు, కానీ సహృదయంతో క్షమించారు కూడాను.

సంగతి రాణివాసం చేరేసరికి రాణులంతా కడుపుబ్బ నవ్వారు. రాజుగార్ల గురించీ, రాజోద్యోగుల తెలివితేటల గురించి వెటకారంగా ఎన్నో పాటలు పాడుకొని సంతోషపడ్డారు. నవ్వీనవ్వీ వాళ్ల పక్కటెముకలు నొచ్చాయి!