"ఏడుపు పాటల్ని అంగీకరించం" అని ఓ నియమం పెట్టుకున్నాం మేం. ఈ పాటకోసం ఆ నియమాన్ని కొంచెం సడలించాల్సి వచ్చింది. దీన్ని ఇంకా అద్భుతంగా పాడే పెద్దలు మాకు తెలుసు. మీరూ పాడుకొని చూడండి- సామాజిక అసమానతలకు, బాల్యపు హింసకు మధ్య ఉండే సంబందాలు కొంతవరకు అర్థం అవుతాయి:
గానం: బి. కుమారి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సెంటర్, చెన్నేకొత్తపల్లి.
జోలాలి పాడాలి
ఈ జోల పాటతో పాపాయి
ఆపాలి నీ గోల పాపాయి
పొలం నుంచి రమ్మని
పాలిచ్చి పొమ్మని
అమ్మనీ రమ్మని
కాకితో కబురంపాను
నే కాకితో కబురంపాను
ఈ కాకి చేరలేదు
ఆ కబురు అందలేదు
కామందు పంపలేదు
మన అమ్మ రానేలేదు
నువు ఆకలేసి గుక్క పడితే ఏం చేయాలి?
నేనేం చేయాలి?
|జోలాలీ|
అమ్మ రాలేదనీ
ఆటలాగ లేదనీ
బొమ్మ తెచ్చి ఇవ్వనా
నిను బొమ్మతో ఆడించనా
మరి బొమ్మ లేనే లేదు
మన అమ్మ పేదరాలు
మన అయ్య బీదవాడు
చిన గిలక్కాయ లేదు
ఇక బొమ్మనేమి కొంటారు
మరి బొమ్మలేక అమ్మ రాక ఏం చేయాలి?
నేనేం చేయాలి?
|జోలాలీ|
బూచోడొస్తాడనీ
నిను పట్టుకపోతాడనీ
నిను ఎత్తుకు పోతాడనీ
బుజ్జిని నేను బెదిరించాను
చిన్న బుజ్జిని నేను బెదిరించాను
బూచోడు రానే లేదు
మా బుజ్జి బెదరలేదు
ఆ కుక్క భయం లేదు
ఈ పిల్లి భయం లేదు
చెల్లాటలాపలేదు
మరి అదరలేదు బెదరలేదు ఏం చేయాలి?
నేనేం చేయాలి?
|జోలాలీ|
ఎంత ఆడించినా
ఏ జోల పాట పాడినా
ఏడుపాగలేదనీ
పాపను నేను బాదేశాను
చిన్న పాపను నేను బాదేశాను
మా చెల్లి ముఖం చూసి
నా కళ్ల నీళ్లు తిరిగె
ఈ తల్లి రాకపోయె
నాకేమీ తోచదయ్యో!
ఏం చేయాలి?
నేనేం చేయాలి?
|జోలాలీ|