ఒకసారి ఒక ముల్లాగారిని శ్రద్ధేయులైన దంపతులు ఒకరు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ముల్లాగారు వాళ్ల దగ్గర తన గొప్పను ప్రదర్శింపదలచారు. వాళ్ల ఇంటి గడపనెక్కారో లేదో, ముల్లాగారు నాటకీయంగా అకస్మాత్తుగా ఆగిపోయారు. కళ్లుమూసుకొని, తలపైకెత్తి, కొంచెంసేపు నిలబడిపోయి, ''ఛ,ఛ,షూ,ఫో! అని అరిచారు ఏదో జంతువును తరుముతున్నట్లు.

ఆపైన కళ్లు తెరచి మామూలుగా లోనికి వచ్చిన ముల్లాగారిని, ఆయన ఆశించినట్లుగానే, యజమాని, "మీరెందుకు అలా అరిచారు?" అని అడిగాడు.

ముల్లాగారు చెప్పారు, "ఇప్పుడే ఓ కుక్క మక్కాలోని పవిత్ర కాబాలోకి దూరబోతుండటం చూశాను నేను. అందుకని నేను ఆగి వెంటనే దాన్ని తరిమివేయవలసి వచ్చింది," అని.

వేలకొలది మైళ్లదూరంలో ఉన్న మక్కాలో ఏం జరుగుతోందో చూడగల అధ్బుత మహిమాన్వితుడైన ముల్లాగారు తమ ఇంటిని పావనం చేసినందుకు యజమాని చాలా సంతోషపడ్డాడు.

కానీ ఇంటి యజమానురాలికి మాత్రం ముల్లాగారి మాటలు మింగుడుపడలేదు. అందుకని ఆవిడ ముల్లాగారికి వడ్డించేటప్పుడు, ప్లేటులో ముందుగా కూరవేసి, దానిపైన, పూర్తిగా కప్పిపెడుతూ, అన్నం పెట్టుకొని తీసుకువచ్చింది. మిగిలిన వాళ్లందరి ప్లేట్లలోనూ కూర ఉంది - తన కంచంలో తప్ప!

దిక్కులు చూస్తున్న ముల్లాగారిని గడుసు యజమానురాలు అడిగింది - `మీకేమన్నాకావాలా, ముల్లాగారూ?' అని.

"నా కంచంలో కూరే లేదు" అన్నాడు ముల్లాగారు.

"మీరు మక్కా వరకు చూడగలరటనే?! మరి మీ ముందున్న కంచంలోనే- అన్నం క్రింద ఏముందో- ఆమాత్రం కనుక్కోలేరా? అన్నది యజమానమ్మ!