రెండుసార్లు
శ్రీను: నేను ఇవాళ చనిపోదామనుకున్నానురా...
రవి:ఎలా చనిపోదామనుకున్నావురా శ్రీనూ?
శ్రీను: పది అంతస్థుల మేడ మీదనుండి దూకి చద్దామనుకున్నా!
రవి: అసలు మన ఊళ్లో పది అంతస్థుల మేడ లేదుకదరా?
శ్రీను: ఐదంతస్తులదుంది కదరా! రెండు సార్లు దూకితే పది అంతస్థులు అవుతాయి!

చీమలు పట్టని చోటు
అమ్మ: బాబూ రవీ! ఈ స్వీట్లన్నీ చీమలు రానిచోట పెట్టరా..
(కాసేపటి తరువాత..)
అమ్మ: రవీ! స్వీట్లెక్కడ పెట్టావురా?
రవి: చీమలు పట్టకుండా ఉంటాయని నా కడుపులో దాచేశానమ్మా!

పొయ్యే కాలం
గోపి: ఒరేయ్ హరీ! నువ్వు పొయ్యే కాలం దగ్గరపడిందిరా!
హరి: ఆ!.. ఏంట్రా అలా అంటున్నావు!
గోపి: అవునురా. ఇప్పుడు సమయం ఐదు గంటలవుతోంది. నువ్విక ఇంటికి పోవాలిగా మరి!!

లాస్ట్ సీన్
డైరెక్టర్: ఈ సీన్ లో నువ్వు పది అంతస్థుల బిల్డింగ్ మీద నుండి దూకాలి.
హీరో: వామ్మో! అంత పైనుండీ దూకితే నేనుంటానా?
డైరెక్టర్: ఉండకున్నా ఫరవాలేదు. సినిమాలో ఇదే లాస్ట్ సీన్.

భార్య పెళ్లి
ఉద్యోగి: సార్! పెళ్లికి నాకొక వారం రోజులు సెలవు కావాలి సార్.
ఆఫీసరు: ఇంతకీ పెళ్లెవరిదయ్యా?
ఉద్యోగి: నాకు కాబోయే భార్యది సార్!

ఐదు కౄర జంతువులు
గురువుగారు: ఒరేయ్ రాజూ! ఏవైనా ఐదు కౄరజంతువుల పేర్లు చెప్పరా
రాజు: మూడు పులులు, రెండు సింహాలు సార్!

సొంత కాళ్లు
కుమారి: సోమూ! నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్?
సోము: నేను నా సొంత కాళ్లపై నిలబడగలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను.
కుమారి: మరి నువ్విప్పుడు నీ కాళ్ల మీదే కదా నిలబడి ఉన్నావు!

రగ్గులోని నాన్న
పక్కింటావిడ: ఒరేయ్ అబ్బాయీ! ఏంట్రా మీ ఇంట్లో నుండి అంత పెద్దగా శబ్దం వస్తోంది?
అబ్బాయి: లోపల మా అమ్మ రగ్గును ఉతుకుతోందండీ
పక్కింటావిడ: రగ్గును ఉతికితే అంతగా శబ్దం రాదే!
అబ్బాయి: రగ్గులో మా నాన్న కూడా ఉన్నాడుకదండీ! అందుకే ఆ శబ్దం.

ఉభయచరం
ఉపాధ్యాయుడు: ఒరేయ్ వంశీ! నీళ్లలో ఉండే రెండు జంతువుల పేర్లు చెప్పరా
వంశీ: ఒకటి చేప సార్..రెండు "క" సార్.
ఉపాధ్యాయుడు: "క" ఏమిటిరా?
వంశీ: క అంటే కప్ప సార్. అది ఎప్పుడూ నీళ్ల లోనే ఉండకుండా కొన్నిసార్లు భూమి మీదికి కూడా వస్తుంటుంది కదండీ! అందుకని సగమే చెప్పాను సార్!