ఒక బౌద్ధారామాన్ని చూసేందుకు ఒకసారి ఒక సందర్శకుడు వచ్చాడు. అక్కడి సన్యాసి ఒకాయన అతనికి అక్కడి విశేషాల్ని పరిచయం చేస్తున్నాడు. తిరుగుతూ తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చారు. ఆ విగ్రహం ఎంత పురాతనమైనదో, దాన్ని చెక్కిన శిల్పులు ఎవరో- వివరిస్తున్నాడు సన్యాసి. చూడవచ్చిన సందర్శకుడు ఆగి, అంతా విని, అకస్మాత్తుగా విగ్రహం మీద ఉమ్మివేశాడు!

సన్యాసి అతనిపై కోపగించుకోలేదు సరికదా, కనీసం 'అది తప్పు' అని కూడా అనలేదు. -ఉత్సాహంగా ముందుకు సాగాడు; ఎదురయ్యే విశేషాల్ని ఎప్పటిమాదిరే వివరిస్తూ పోయాడు. అయితే వాళ్లు ముందుకు పోతున్న కొద్దీ సందర్శకునికే అసౌకర్యంగాను, మనసంతా అలజడిగానూ అనిపించసాగింది. సగం దూరం వెళ్లేసరికి అతను ఇక భరించలేకపోయాడు. సన్యాసిని నిలబెట్టి, ’తాను చేసిన దుష్కార్యానికి అతను ఎందుకు స్పందించలేదు?' అని అడిగాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వి, చెప్పాడు: "నేను దేనికి స్పందించాలి? ఈ విగ్రహం దగ్గరికి రాగానే ఇక్కడికి వచ్చే సందర్శకులందరూ బుద్ధుడిని గుర్తిస్తుంటారు. కొందరు పువ్వుల్ని అర్పిస్తారు, కొందరు వంగి నమస్కరిస్తారు; చాలా మంది తీపి వస్తువులిస్తారు. ఆ శుద్ధత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేందుకు కొందరు విగ్రహాన్ని ముట్టి చూస్తుంటారు. దూర దేశాలనుండి వచ్చిన సందర్శకులు కొందరైతే బుద్ధుని పాదాలను ముద్దుపెట్టుకున్నారు. మీరు బుద్ధునిపై ఉమ్మివేశారు... ఇవన్నీ బుద్ధున్ని గుర్తించటంలోని వేరువేరు మార్గాలు. మీరు మీ పద్ధతిలో బుద్ధ భగవానుడిని గుర్తించారు" అన్నాడు.

సందర్శకుడు వెనక్కు పరిగెత్తి విగ్రహం ముందు సాగిలపడ్డాడు. తన దుశ్చర్యను క్షమించమని మనసారా వేడుకున్నాడు.