అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో పారే ఒక ఏటి గట్టున పాడుబడిన దేవాలయం ఒకటి ఉండేది. ఆ దేవాలయపు శిథిలాలలో ఒక పెద్ద ఎలుకల గుంపు నివసిస్తూ ఉండేది. అడవిలో ఎలుకలకు తినడానికి కావలసిన రకరకాల గింజలు, విత్తనాలు, కాయలు దొరికేవి. వాటిని కడుపారా తింటూ, అడవిలోని చెట్ల నీడలలో తమ పిల్లలతోపాటు ఆడుతూ, పాడుతూ ఆ ఎలుకల గుంపు చాలా సంతోషంగా కాలం గడిపేది.
ఒక ఎండాకాలంపూట, మధ్యాహ్న సమయంలో, దప్పిక గొన్న ఏనుగుల గుంపొకటి, ఎలుకలు నివాసముండే దేవాలయపు శిథిలాలగుండా, ఏటి వైపుకి నడచి వెళ్ళింది. ఏనుగుల గుంపు రాకను గమనించిన ఎలుకలు కొన్ని, ముందుగానే అక్కడి నుండి పారిపోయాయి. పారిపోలేని పిల్ల ఎలుకలు ఏనుగుల కాళ్ల కిందా, ఏనుగులు వెళ్ళిన కారణంగా పడిపోయిన రాళ్ల కిందా పడి, నలిగి చచ్చిపోయాయి. కొన్ని ఎలుకలకేమో తోకలు తెగిపోయాయి. కొన్నింటికి కాళ్లు విరిగాయి. మరి కొన్నింటికి చేతులు పోయాయి. కొన్నింటికి వాంతులు కూడా అయ్యాయి. మొత్తం మీద ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటన ఎలుకల గుంపును కల్లోల పరిచింది.
ఈ విషయమై చర్చించేందుకుగాను ఎలుకల రాజు ఒక సమావేశం ఏర్పాటుచేశాడు. భర్తలను, పిల్లలను పోగొట్టుకున్న ఆడ ఎలుకలు, భార్యలను పోగొట్టుకున్న మగ ఎలుకలు, తల్లిదండ్రులను పోగొట్టుకొన్న పిల్ల ఎలుకలు, గాయాలపాలైపోయిన ఎలుకలు, సమావేశానికి నడవలేక నడుస్తూ ఆలస్యంగా వస్తున్న ఎలుకలు, ఆపదలో ఉన్న తమ మిత్రులకు పరిచర్యలు చేస్తున్న ఎలుకలు, ప్రమాదం నుండి తప్పించుకున్న ఎలుకలు, ఇలా రకరకాల సమస్యలతో ఉన్న ఎలుకల గుంపుతో సమావేశ ప్రాంగణం మొత్తం నిండిపోయింది.
రాళ్ళు మీదపడ్డప్పుడు తన ముందు పళ్ళను పోగొట్టుకున్న ఎలుకల రాజు సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యాడు. మాట్లాడలేని పరిస్థితిలోకూడా ఆ రాజు సమావేశాన్ని తన ఉపన్యాసంతో ప్రారంభించాడు ఇలా:
"మిత్రులారా! ఏనుగుల కారణంగా మనకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే ఇక మనమెవరమూ మిగలమేమో! ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ప్రస్తుత నివాసాన్ని ఖాళీ చేసి అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏనుగులైనా ఇక్కడికి రాకుండా చూసుకోవాలి" అన్నది.
"మనమెందుకు ఖాళీ చెయ్యడం? ఏనుగులే ఇక్కడికి రాకుండా చేస్తే సరిపోతుంది" అని చెప్పిందో చిట్టెలుక, తెగిపోయిన తన తోకను తలచుకుంటూ.
"కానీ ఏనుగుల్ని రాకుండా చేయటం ఎలా?" అని ప్రశ్నించింది మరో పిల్ల ఎలుక.
"వెళ్లి ఏనుగులకు మన కష్టాన్ని చెప్పుకుదాం" అన్నది ఒక ముసలి ఎలుక.
"అమ్మో! ఏనుగుల దగ్గరకి వెళ్ళి మాట్లాడటమా? ఎవరు చేస్తారు, ఆ పనిని?" అన్నదో కుర్ర ఎలుక భయంతో వణుకుతూ.
"ఎవరో ఎందుకు? స్వయంగా మేమే వెళతాం" అని చెప్పింది రాజు ఎలుక.
అంతలోనే నీళ్లు తాగడంకోసం ఏనుగుల గుంపు ఏటిగట్టుకు చేరుకున్నది. ఎలుకలన్నీ భయంతో కకావికలయ్యాయి. కొన్నిమాత్రం అక్కడే పొదల చాటున దాక్కున్నాయి. ఆలోగా ఏనుగుల గుంపు మడుగులోకి దిగి స్నానం చేయడం మొదలెట్టింది. అప్పుడు ఎలుకల రాజు ఏటి గట్టుకు పోయి నిలబడి, ధైర్యంగా ఏనుగుల రాజుతో అన్నది "గజోత్తమా! మీరు దేవాలయ శిథిలాల దారిన వచ్చిన కారణంగా మాకు అపారనష్టం వాటిల్లింది. ఆ దారిన కాకుండా మీరు మరో దారిన ఏటికి రావచ్చుకదా?" అని అడిగింది.
ఒక్క నిమిషం అలోచించిన ఏనుగులరాజు, ఎలుక మాటలకు బదులిస్తూ "మీరు చెప్పింది నిజమే. మేము పాడుబడ్డ శిథిలాల దారిన వచ్చినా ఒకటే; మరో దారిన వచ్చినా ఒకటే. భవిష్యత్తులో మరెప్పుడూ మీకు ఇబ్బంది కలిగించం. నిశ్చింతగా జీవించండి" అని చెప్పింది. అందుకు కృతజ్ఞతలు చెప్పి ఎలుకల రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలుకలన్నీకూడా సంతోషంతో పండగ చేసుకున్నాయి.
కొన్నాళ్ళు గడిచాయి. అడవిలోని ఏనుగులను పట్టుకోవడానికి కొందరు వేటగాళ్లు గోతులు త్రవ్వి, వలలు పన్నారు. చాలా ఏనుగులు వలల్లో చిక్కుకొన్నాయి. దొరికిన ఏనుగులను పెద్ద పెద్ద తాళ్లతో కట్టేశారు వేటగాళ్ళు. అయితే, అప్పటికే చీకటిపడ్డది. చీకటిలో ఏనుగులను కదిలించటం కష్టం. కనుక తెల్లవారాక వద్దామని వాళ్లు బసలకు వెళ్ళిపోయారు. ఏనుగుల అరుపులు విన్న ఎలుక ఒకటి అక్కడికి పోయి చూసింది. పరుగున వెళ్ళి తన మిత్రులందరినీ సాయానికి తోలుకొచ్చింది. ఎలుకలన్నీ కలసి తాళ్లను కొరికి పారేశాయి. ఏనుగులను పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి. ఏనుగులు ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాయి.
చిన్న చిన్న ప్రాణులుకూడా గొప్ప సాయం చేయగలవు.