సామాన్యుడు ఒకడు ఓ నది ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడట. ఆ సమయంలో మధ్య వయస్సులో ఉన్న ఒక సాధువు నది అవతలి ఒడ్డుకు వచ్చాడు. అతను అలానే నీళ్లపైన నడుచుకుంటూ వచ్చి సామాన్యుడిని చేరుకున్నాడు!
సామాన్యుడు మాత్రం ఉన్న చోటే కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నాడు.
సాధువు అతన్ని సమీపించి అడిగాడు: " నేను ఇప్పుడు ఏం చేశానో చూశావా?" అని.
"ఓ! చూశాను. తమరు ఇప్పుడు నదిని దాటుకొని వచ్చారు కదూ, నీళ్లమీద నడుచుకుంటూ? ఎక్కడ నేర్చుకున్నారు మీరు, ఆ విద్యను?!" అన్నాడు పామరుడు ఉత్సాహంగా.
నేను హిమాలయ పర్వత సానువుల్లోని గుహల్లో పన్నెండు సంవత్సరాలపాటు యోగాభ్యాసం చేసి , వారానికి ఆరు రోజుల పాటు ఉపవాసం ఉంటూ, ఒంటికాలిపై నిలబడి తపస్సుచేస్తూ కఠోరంగా శ్రమించాను. తత్ఫలితంగా ఈ శక్తిని ఆర్జించాను." అన్నాడు సాధువు గర్వంగా.
"నిజమా?!" అన్నాడు సామాన్యుడు ఆశ్చ్యర్యపోతూ. ఇంతమాత్రం దానికి తమరు అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? " రెండు పైసలిస్తే చాలు, మీరెప్పుడుకావాలంటే అప్పుడు ఇక్కడి పడవ సరంగు మిమ్మల్ని నది దాటిస్తాడుగద!" అని అడిగాడు అమాయకంగా.
సాధువు గర్వం అణిగిపోయింది. జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి.
మనం శ్రమించేటప్పుడు ‘ఎందుకు శ్రమిస్తున్నాం’ అనేది గుర్తుచేసుకుంటూ ఉంటే మంచిది. అలా కాని పక్షంలో మనం ఎంతో కష్టపడినా కూడా ఫలితాలు నిరాశనే మిగిల్చే ప్రమాదం ఉంది. కొన్నికొన్నిసార్లు మనం వివేకశూన్యమైన పనుల్నీ తలకెత్తుకుంటాం. ‘మనం చేస్తున్న పని సరైనదేనా’ , ‘పని వెనక ఉన్న ఉద్దేశం సమంజసమైనదేనా’ అని ఆలోచించుకుంటుంటే, మన పనుల్లోని మూర్ఖత్వం మనకు తెలిసే వీలుంటుంది. మనం చాలా గొప్పవిగా భావించే పనుల్లో కూడా ఒక్కోసారి అసలు పస ఉండకపోవచ్చు. అయినా మనం అహంకారం కొద్దీ అతిశయం పాలౌతుంటాం. అలా కాకూడదంటే చేస్తున్న పనిని గురించి పక్షపాతరహితమైన మనసుతో పునర్విమర్శ జరుపుకుంటూ ఉండటం మినహా వేరే మార్గం లేదు. అలా విమర్శించుకుంటున్నా ప్రయోజనం లేదంటే, కనీసం మనకు నచ్చిన పనిని మనం, శక్తివంచనలేకుండా చేశామన్న సంతృప్తి లభిస్తుంది.
ఏమంటారు?
ఈ సంచికలో చిత్రాల్ని అడవిరాముడితో పాటు జె.యన్.టి.యు. హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సాయి, ఖాసిం, యాదగిరిలు చిత్రించారు. వారందరికీ కొత్తపల్లి బృందం తరపున ధన్యవాదాలు. పతాక చిత్రాన్ని (అమరజీవి పొట్టి శ్రీరాములుగారు-ఉగాది-ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావుగారు) అడవిరాముడు అందించాడు. ఈ వర్ధమాన చిత్రకారులందరూ బొమ్మల్ని మరింత బాగా వేయగలగాలని ఆశిద్దాం.
మీ
కొత్తపల్లి బృందం