ఒక ఊళ్ళో ఇసుక తప్పిడి, పేడ తప్పిడి అనే ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా ఉన్న ఇళ్ళల్లో ఉంటూ, కలసి వ్యాపారం చేసేవారు. ఇసుక తప్పిడేమో తెలివిలేని వాడు పాపం. పేడతప్పిడేమో తెలివైనవాడు. తెలివిలేని ఇసుకతప్పిడితో పనిచేయిస్తూ, వచ్చే ఆదాయంలో మాత్రం సరైన వాటాను ఇచ్చేవాడుకాదు పేడతప్పిడి. కొన్నాళ్ళకు వారిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తెలివిలేని ఇసుక తప్పిడికేమో మహా ఘటికురాలైన బార్య దొరికింది. తెలివిగల పేడతప్పిడికేమో గయ్యాళి భార్య దొరికింది.
భర్త అమాయకత్వాన్ని ఓర్చుకోలేని ఇసుకతప్పిడి భార్య అతన్ని రోజూ తిడుతూండేది. ఒకనాడు ఏదో పొరపాటు చేశాడని, భర్తను ఇంట్లోనుండి బయటికి గెంటేసింది ఇసుకతప్పిడి భార్య. భార్య చేత గెంటివేయబడిన ఇసుకతప్పిడి ఊరి బయట ఉండే ఒక పెద్ద చెట్టుకిందికి పోయి, ఆ రాత్రికి దాని మొదట్లో పడుకున్నాడు. అంతలోనే నలుగురు దొంగలు వాళ్ళు దోచుకొన్న పెద్ద ధనరాశితోపాటు అదే చెట్టు కిందికి పోయారు, భాగాలు పెట్టుకోవడానికని. వాళ్లు భాగాలు పంచుకొంటుంటే, రాశిలోని బంగారునాణెం ఒకటి, దగ్గరలోని పొదలోకి దొర్లిపోయింది. దాన్ని వెదకడానికని దొంగలు నలుగురూ ఆ చీకట్లో పొదలలోకి వెళ్ళారు. అంతా చూస్తున్న ఇసుకతప్పిడి అదే అదనుగా భావించి, అక్కడున్న మొత్తం బంగారాన్ని తన పంచెలో మూటగట్టుకొని పారిపోయాడు.
బంగారంతో ఇంటికొచ్చిన భర్తను సంతోషంగా లోపలికి రానిచ్చింది భార్య. "తూకమేసి దాస్తే గుర్తుగా ఉంటుంది" అనుకొని, పేడతప్పిడి వాళ్ళ ఇంటికి వెళ్ళి తక్కెడ తెమ్మంది, భర్తను. తక్కెడ కోసం పోయిన ఇసుక తప్పిడి, మొత్తం విషయాన్ని పేడ తప్పిడి భార్యకు చెప్పేసి మరీ వచ్చాడు.
పేడ తప్పిడి భార్య ఆశపోతు. "మా ఆయన్నూ పంపితే సరి- బంగారం దొరుకుతుంద"నుకున్నది. పేడతప్పిడిని పోరుపెట్టి ఊరిబయటి చెట్టు కిందికి పంపింది ఆ రాత్రికి. "మేమే దొంగలమైతే, మానుండే బంగారాన్ని దోచుకు పోయిన పెద్దదొంగ తిరిగి రాకపోతాడా, మేం వాడి పని పట్టకుండా ఊరుకుంటామా?" అని అప్పటికే చెట్టుకింద మాటు వేసి ఉన్నారు దొంగలు. పేడతప్పిడి అక్కడికి వెళ్లగానే వాళ్ళు అతన్ని పట్టుకొని, కొట్టినచోట కొట్టకుండా కొట్టేశారు. ఒళ్లు హూనంకాగా, ప్రాణం కడబెట్టగా అక్కడి నుండి ఇంటికి పారిపోయాడు పేడతప్పిడి.
అయినా పేడతప్పిడికి, అతని భార్యకు బుద్ధిరాలేదు. ఒకసారి ప్రమాద వశాత్తు ఇసుక తప్పిడి వాళ్ల ఇల్లు కాలిపోయింది. "పోతేపోయింది. దేవుడు మనకు ఈ బూడిదనే ఇచ్చామనుకుందాం. వెళ్ళి ఈ బూడిదనే అమ్ముకుని రండి" అని ఒక బండినిండా బూడిదనెక్కించి పంపింది ఇసుక తప్పిడి భార్య. ఇసుకతప్పిడి దాన్ని "దేవుడిచ్చిన బూడిద! దేవుడిచ్చిన బూడిద!" అని అమ్మబోతే అందరూ ఎగబడి కొన్నారు. వాళ్లకు అలా దండి డబ్బులు సమకూరాయి.
పేడతప్పిడి బార్యకు ఈ విషయం తెలిసింది. డబ్బులొస్తాయని ఆశపడింది. సమయం చూసుకొని తన ఇంటికి తానే నిప్పు పెట్టుకున్నది. పేడతప్పిడి సంపాదించింది మొత్తం ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది . "పోతే పోయింది కానీ, ఇల్లు కాలిన బూడిదను అమ్ముకురా, పో! ఇసుక తప్పిడికిమల్లే మనకూ దండిగా డబ్బులు వస్తాయిలే" అన్నది పేడతప్పిడి భార్య. "ఇల్లు కాలిన బూడిద! ఇల్లు కాలిన బూడిద! కొనండి బాబూ! కొనండి!!" అని అరుస్తూ పోయిన పేడతప్పిడిని సంతలో జనం పిచ్చోడంటూ వాయించారు. పాపం!
దురాశ ఎంతపని చేస్తుంది!