అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు భూపతి వర్మ. భూపతివర్మకు రవివర్మ, అశోకవర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. భూపతివర్మ తన సువిశాల రాజ్యాన్ని చాలా చక్కగా పాలించేవాడు. తన కుమారులకు అన్ని విద్యలూ నేర్పించాడు. కాలం గడచేకొద్దీ ఆయన ముసలివాడయ్యాడు. ఇక తను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతున్నదని గ్రహించిన భూపతివర్మ, తన కొడుకులను ఇద్దరినీ దగ్గరకు పిలిచి, "రాకుమారులారా! మీరు రాజ్యపాలన చేయాల్సిన సమయం దగ్గరపడుతున్నది. అందుకుగానూ కేవలం విద్యలే కాక, ప్రజల జీవన విధానమూ, వారి ఇష్టాయిష్టాలు, కష్టనష్టాలూ మీరు తెలుసుకోవాలి. అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి. కాబట్టి మీరు ఒక సంవత్సర కాలం పాటు రాజ భవనాన్ని విడిచి దేశసంచారం చేసి రండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అని చెప్పాడు. తండ్రి మాటలకు రాకుమారులిద్దరూ తమ సమ్మతిని తెలిపి, ఒక మంచి రోజున దేశ సంచారం కోసం బయలుదేరి వెళ్ళారు.
పెద్దవాడైన రవివర్మ రాజ్యపు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. చిన్నవాడైన అశోకవర్మ దక్షిణానికి వెళ్ళాడు.
దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళుతూ వెళుతూ ఒక సువిశాలమైన ఎడారిని చేరుకున్నాడు. ఆ ఎడారిలో అతనికి ఒక పెద్ద- రంగురంగుల- అందమైన భవనం కనిపించింది. అశోకవర్మ ఆ భవనంలోకి వెళ్ళాడు. భవనంలో అతను ఒక అందమైన యువతి హంసతూలికపైన పడుకొని ఉండటాన్ని చూశాడు. కానీ ఆమె కదలటంలేదు, మెదలటంలేదు.
ఆ పక్కనే తల తప్ప మిగిలిన మొత్తం శరీరం ఉక్కులా మారిన ఒక మనిషిని చూశాడు అశోకవర్మ. ఆ మనిషి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదేంటో నినాలనుకునేలోగా ఒక కందిరీగ వచ్చి కుట్టింది అశోకవర్మను. అంతే! తల తప్ప, మిగిలిన శరీరం మొత్తం ఉక్కులా మారిపోయి అశోకవర్మ కూడా ఒక శిలలా నిలబడి పోయాడు.
ఒక సంవత్సరం గడిచింది. ఉత్తరానికి వెళ్ళిన రవివర్మ రాజ్యానికి తిరిగివెళ్ళాడు. కానీ అశోకవర్మ మాత్రం తిరిగి రాలేదు. అతడేమైపోయాడోనన్న బెంగ అందరినీ పట్టుకుంది. తమ్ముడిని వెతికి తీసుకరావడంకోసం రవివర్మ బయలుదేరాడు.
అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు రవివర్మ. ఆ అడవిలో ఒక ప్రక్కంతా కార్చిచ్చులో తగలబడిపోతున్నది. పెద్ద బండరాయి ఒకదానికి పెట్టిన తేనెతుట్టె ఒకటి, ఆ మంటలలో చిక్కుకుని ఉండటాన్ని గమనించిన అతను, ఆ రాతిచుట్టూ మంటల్ని ఆర్పివేశాడు. తమనూ, తమ చిన్ని బిడ్డలనూ హుతభుక్ ప్రళయం నుండి కాపాడిన రవివర్మకు ధన్యవాదాలను తెలుపుతూ అందుకు ప్రతిగా ఏమైనా కోరుకోమన్నాయి తేనెటీగలు. తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ తేనెటీగలకు వివరించాడు. సాయంగా తామూ వస్తామని బయలుదేరాయి కొన్ని తేనెటీగలు.
తేనెటీగలు వెంటరాగా ముందుకు సాగిన రవివర్మ, ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు. లోపలికి ప్రవేశించగానే రవివర్మకు శిలారూపంలో ఉన్న తన తమ్ముడు, మరొక మనిషి కనబడ్డారు. వాళ్లిద్దరూ రవివర్మకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నంతలోనే ఏదో శబ్దం వారందరి దృష్టినీ ఆకర్షించింది. రవివర్మను కుట్టడానికి వస్తున్న మాయా కందిరీగను అతని వెంట వచ్చిన తేనెటీగలు ఆసరికే వాసన పట్టి, దాన్ని చుట్టుముట్టాయి. వీరోచితంగా పోరాడి అవి దానిని చంపేశాయి. కందిరీగ బెడద తప్పిన రవివర్మ , తన సోదరుని ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. తేనెటీగల సాయంతో రంగుల భవనంలోఉన్న మాంత్రికుని స్థావరాన్ని చేరుకొన్నాడు రవివర్మ.
మాంత్రికుడు ఆసరికి పూజలో ఉన్నాడు. రవివర్మను చూడగానే వాడు లేచి మాయా యుద్ధం మొదలుపెట్టాడు. అయితే వీరుడైన రవివర్మముందు అతని ఆటలు సాగలేదు. చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలవ్వక తప్పలేదు. మాంత్రికుడు చచ్చిపోగానే వారున్న రంగుల భవనం మాయమయిపోయింది. అశోకవర్మ, మరో రాకుమారునితోబాటు మాంత్రికుడు అపహరించి తెచ్చిన కస్తూరరాజ్యపు రాకుమారికి కూడా ఆ మాయగాని మాయల బంధనం నుండి విముక్తి లభించింది. వారంతా సంతోషంతో తమ తమ రాజ్యాలను చేరుకొని హాయిగా జీవించారు.