ఒక పేద తల్లికి ఒక్కడే కొడుకు ఉండేవాడు. ఆమె ఇంటింటా పాచిపని చేసుకుంటూ, ధాన్యం విసురుతూ కాలం నెట్టుకొచ్చేది. ఆ కుటుంబాల వాళ్ళు ఆమె పనికిగాను ఎంతో కొంత ధాన్యం ఇస్తే, దాంతో ఆమె ఇల్లు గడిచేది. అంతే తప్ప, ఆమె ఏనాడూ కొడుక్కు ఒక్క బొమ్మగానీ, బట్టగానీ కొనిపెట్టింది లేదు.
ఒకసారి ఆమె ధాన్యం అమ్మేందుకు సంతకుపోతూ "నీకేం తేవాలి కొడుకా?" అని అడిగింది ఊరికే.
"నాకో ఢోలక్ (డప్పు) కావాలమ్మా, ఢోలక్ కొనుక్కురా" అన్నాడు కొడుకు.
తల్లికి తెలుసు - కొడుక్కు ఢోలక్ కొనిపెట్టేంత డబ్బు తనకు ఏనాడూ రాదని. ఆమె సంతకు పోయి ధాన్యం అమ్మింది; ఇంటి కోసం కొంచెం రొట్టెలపిండీ, ఉప్పూ, కారం కొన్నది. డబ్బులు అక్కడికక్కడ సరిపోయాయి. వట్టి చేతులతో ఇంటికి వస్తున్నందుకు ఆ తల్లి మనసు ఎంతో క్షోభపడ్డది. అందువల్ల, సంతనుండి వెనక్కి వస్తూండగా రోడ్డుమీద ఒక చక్కని చెక్కముక్క కనబడితే, ఆమె దాన్ని తీసుకుని, భద్రంగా తెచ్చి కొడుక్కి ఇచ్చింది. కొడుక్కి ఆ చెక్కముక్కతో ఏం చేయాలో తెలియలేదు. అయినా వాడు దాన్ని తీసుకొని, ఆడుకొనేందుకు పోయాడు.
అక్కడో ముసలమ్మ పిడకలతో పొయ్యి వెలిగించేందుకు ప్రయత్నిస్తున్నది. మంట రాజుకోవడంలేదు; అన్ని దిక్కులా పొగ కమ్మింది. ముసలమ్మ దగ్గుతోంది. కళ్లనుండి నీరు కారుతోంది. పిల్లవాడు ఆగి "ఎందుకేడుస్తున్నావవ్వా? అని అడిగాడు. " పొయ్యి వెలగట్లేదు నాయనా" అంది అవ్వ. "నా దగ్గరో చక్కని చెక్కముక్క ఉన్నది. దీంతో నీ పొయ్యి చక్కగా వెలుగుతుంది చూడు" అని పిల్లవాడు చెక్కముక్కని అవ్వకిచ్చాడు. అవ్వ ప్రయత్నిస్తే, చెక్క వెంటనే మండింది. అవ్వ సంతోషపడి, రొట్టెలు కాల్చి, ఓ రొట్టెను పిల్లవాని చేతిలో పెట్టింది.
పిల్లవాడు ఆ రొట్టెను పట్టుకొని పోతూంటే కుమ్మరి వాని భార్య ఎదురైంది, చంకలో బిడ్డనెత్తుకొని. బిడ్డ ఏడ్చి గగ్గోలు పెడుతున్నది. పిల్లవాడు ఆగి "బిడ్డ ఎందుకు ఏడుస్తోంది?" అని అడిగాడు. "బిడ్డకు ఆకలేస్తోంది, తినటానికి ఇద్దామంటే ఇంట్లో ఏమీ లేవు" అన్నదా తల్లి. పిల్లవాడు తన చేతిలోని రొట్టెను ఆ చిన్న బిడ్డకి ఇచ్చేశాడు. వెంటనే వాడు ఏడుపు ఆపి, తినటం మొదలెట్టాడు. కుమ్మరివాని భార్య సంతోషపడి, కృతజ్ఞతతో పిల్లవాడికో కుండనిచ్చింది.
పిల్లవాడు ఆ బాన పట్టుకుపోతూంటే , దోవలో నది పక్కన ఒక చాకలివాడూ, అతని భార్యా పోట్లాడుకుంటూ కనబడ్డారు. చాకలివాడు భార్యను బిగ్గరగా తిడుతున్నాడు; భార్య ఏడుస్తోంది. వాళ్ల దగ్గరున్న ఒకే ఒక బానను ఆమె పగలగొట్టిందట. ‘బట్టలు ఉడకబెట్టేందుకు బానలేదే’ అని అతని బాధ.
"ఇదిగో, పోట్లాడుకోకండి, ఈ బాన తీసుకొని పని నడిపించుకోండి" అని పిల్లవాడు వాళ్లకు కుండనిచ్చాడు, పెద్ద మనసుతో. కష్ట సమయంలో అనుకోకుండా మంచి బాన నడచి వచ్చిందని చాకలాయనకు సంతోషం వేసింది. ఆయన సంతోషం పట్టలేక కుర్రవానికో కోటునిచ్చాడు.
కుర్రవాడు కోటువేసుకుని నడిచి పోతూంటే, చలికి వణికిపోతూన్న మనిషి ఒకడు తగిలాడు. అంత చలిలోనూ అతనికి కనీసం చొక్కా కూడా లేదు. విషయమేమిటని కనుక్కుంటే ’అతనొక గుర్రాల వ్యాపారి’ అనీ, నగరానికి పోతూంటే మధ్య దారిలో దొంగలు సర్వమూ దోచుకున్నారనీ, అతి కష్టం మీద తన గుర్రాల్లో రెండింటిని మాత్రం తిరిగి పట్టుకోగలిగాడనీ తెలిసింది. "బాధ పడకండి. ఈ కోటు తీసుకోండి" అని పిల్లవాడు కోటును అతనికి ఇచ్చేశాడు. "నువ్వు చాలా దయగల పిల్లవాడివి. నీకో గుర్రం ఇవ్వబుద్ధౌతున్నది తీసుకో. రెండు గుర్రాలు ప్రస్తుతం నాకూ బరువే కదా!" అని అతను పిల్లవాడికి ఒక గుర్రాన్ని బహూకరించాడు.
పిల్లవాడు గుర్రాన్ని తీసుకొని ఇంటికి పోతూంటే మధ్యలో ఒక పెండ్లి ఊరేగింపు తగిలింది. మేళగాళ్ళూ, పెండ్లికొడుకూ, బంధువులూ - అందరూ ఉన్నారు; కానీ ఎవ్వరి ముఖంలోనూ కళాకాంతులు లేవు. ఏమంటే, "పెండ్లి కొడుకొను ఎక్కించుకొని పోయేందుకు రావలసిన గుర్రం జాడలేదు. ముహూర్తానికి సమయం మించిపోతూన్నది. పెళ్ళికొడుకు కాలినడకన పోరాదు." ఏం చేయాలో తోచట్లేదు ఎవరికీ.
"దానిదేముంది, నా గుర్రాన్ని తీసుకోండి" అన్నాడు పిల్లవాడు. అందరికీ ప్రాణం లేచివచ్చినట్లైంది. బదులుగా ఏదైనా తీసుకొని తీరాలని పెళ్లికొడుకు బలవంతం చేస్తే, మీ మేళగాని దగ్గరున్న ఢోలక్ ఇప్పించండి వీలైతే" అన్నాడు పిల్లవాడు. పెళ్ళికొడుకు ఇస్తానన్న ధనానికి రెండు ఢోలక్ లు కొనుక్కోవచ్చు! అందువల్ల మేళగాడు సంతోషంగా ఢోలక్ ను ఇచ్చేశాడు.
పిల్లవాడు దాన్ని ఢుమ ఢుమ లాడించుకుంటూ సంతోషంగా ఇంటికెళ్ళాడు. చెక్కముక్క నుండి తను కోరిన ఢోలక్ ఎలా వచ్చిందో తల్లికి వివరించాడు గంతులేసుకుంటూ. ఆ తల్లికి పిల్లవాడి సంతోషం అర్థమైంది తప్పిస్తే, మరేమీ అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా.