చాలా కాలం క్రితం బెంగాల్ రాష్ట్రంలోని బర్దవాన్ జిల్లాలో ఓ మంగలి నివసించేవాడు. అతనికి ఏ పనీ సరిగ్గా చేయటం రాదు. ఎప్పుడూ తనపెట్టెలో ఉన్న పగిలిపోయిన అద్దాన్ని చూసుకుంటూ, పళ్లు విరిగిపోయిన పాత దువ్వెనతో దువ్వుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య, ముసలి తల్లి రోజంతా అతన్ని దుయ్యబెట్టేవారు. కాని వారి తిట్లు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. చివరికి ఒకరోజున విసిగి వేసారిన తల్లి అతన్ని చీపురు కట్టెతో జాడించింది. చిన్నబుచ్చుకున్న మంగలి ఇల్లు వదలి బయలుదేరాడు. డబ్బు సంపాదించేంతవరకూ ఇక ఇంటి ముఖం చూడకూడదనుకున్నాడు.
అలా నడచీ నడచీ మంగలి ఒక అడవి చేరుకున్నాడు. అక్కడ "ఏ చెట్టుకిందో కూర్చొని తపస్సు చేద్దాం" అనుకున్నాడు. కానీ అతడు అడవిని చేరుకున్నాడో లేదో, అక్కడ బ్రహ్మరాక్షసుడొకడు ఎదురయ్యాడు. ఆ రాక్షసుడు ఉత్సాహంగా నాట్యం చేస్తున్నాడు! మంగలి పై ప్రాణాలు పైనే పోయాయి. కాళ్లు, చేతులు గజగజ వణికాయి. అయినా ధైర్యం కూడగట్టుకొని, అదే తాళానికి తనూ నాట్యం చేయటం మొదలుపెట్టాడు.
కొంచెంసేపు గడచింది. రాక్షసుడు నాట్యం ఆపేటట్లు లేడు. మంగలికి అలుపు వస్తున్నది. వాడు రాక్షసుడిని అడిగాడు. - " నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు? నీకంత ఆనందం ఎందుకు కలిగింది?" అని.
రాక్షసుడు పెద్దగానవ్వి చెప్పాడు - "నేను ఈ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానురా, మానవా! నాకు తెలుసు, నువ్వు ఒట్టి మూర్ఖుడివి, నీకు కారణం తెలియదని. నీ మెత్తని మాంసం నా నాలుకకు ఎంత విందు చేయనున్నదో తలచుకుంటే నాకు కాళ్ళూ, చేతులూ ఆగనంత ఆనందమయి, నాట్యం చేస్తున్నాను. మరిప్పుడు చెప్పు - నువ్వెందుకు నాట్యం ఆడుతున్నావు?"
"నా నాట్యానికి ఇంకా గొప్ప కారణం ఉన్నది." అన్నాడు మంగలి- మాటకు మాట చెప్పాలని. "మా రాజకుమారునికి ఆరోగ్యం అస్సలు సరిగ్గాలేదు. అతడి ఆరోగ్యం బాగవ్వాలంటే నూటొక్కమంది బ్రహ్మరాక్షసుల గుండె రక్తం కావాలని వైద్యులు సెలవిచ్చారు. అలా నూటొక్క బ్రహ్మరాక్షసుల గుండె రక్తం తెచ్చిఇచ్చిన వారికి అర్ధరాజ్యాన్ని, రాకుమారినీ ఇస్తానని రాజుగారు చాటింపువేశారు. నేను ఇప్పటికి అతి కష్టం మీద నూరుమంది బ్రహ్మరాక్షసులను పట్టుకోగలిగాను. ఇప్పుడు నువ్వు, నూటఒకటోవానివి, దొరికావు. నీతో నాకు కావలసిన నూటఒక్కమందీ పూర్తయ్యారు. నేను ఈ సరికే నీఆత్మను చేజిక్కించుకున్నాను. ఇక నువ్వు నాజేబులోంచి తప్పించుకోలేవు". ఇలా అంటూనే వాడుతన జేబులోంచి అద్దాన్ని తీసి రాక్షసునికి చూపించాడు. భయంతో వణికిపోతున్న ఆ బ్రహ్మరాక్షసునికి తన ప్రతిబింబమే ఆ అద్దంలో కనిపించింది. స్వచ్ఛంగా కాస్తున్న పండు వెన్నెలలో, ఆ అద్దంలో తళతళ మెరుస్తున్న తన ముఖం చూసి రాక్షసుడు తను నిజంగానే పట్టుబడ్డానేమోననుకొన్నాడు. కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ వాడు, తనని వదలిపెట్టమని మంగలి కాళ్ళమీద పడ్డాడు.
మంగలి బెట్టుచేశాడు. ఒప్పుకోలేదు. కానీ బ్రహ్మరాక్షసుడు చివరికి ఏడుగురు రాజులకుండేంత బంగారాన్ని ఇస్తానని ఆశ చూపించాక, అయిష్టంగానే మెత్తబడుతున్నట్లు నటిస్తూ, చివరికి ఒప్పుకున్నాడు. "కానీ నువ్వనే ఈ బంగారం ఎక్కడుంది? దాన్ని ఈ అర్థ రాత్రి పూట మా ఇంటివరకూ ఎవరు మోస్తారు?" అన్నాడు వాడు.
"నీ వెనుక ఉన్న చెట్టు మొదట్లోనే ఉంది బంగారం అంతా." అన్నాడు బ్రహ్మరాక్షసుడు. "నేను దానిని తవ్విపెట్టడమే కాదు, మీ ఇంటిలోనికి స్వయంగా మోసుకొచ్చి చేరుస్తాను ఒక్క క్షణంలో. మా బ్రహ్మరాక్షసులకు ఇలాంటి ప్రత్యేక శక్తులుంటాయి." అని చెప్పి, మాట ప్రకారం వాడు ఆ వృక్షాన్ని పెకిలించి దాని అడుగున ఉన్న బంగారాన్నంతా బయటికి తీశాడు. అంత సంపదను చూసి మంగలి నోరు వెళ్ళబెట్టేవాడే; కానీ తనను తాను సంబాళించుకొని, ధైర్యంగా ఆ సంపదనూ, తననూ, ఇల్లు చేర్చమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మరాక్షసుడు తన శక్తితో మరుక్షణంలో మంగలినీ, సంపదనూ ఇల్లుచేర్చాడు. ఆ తర్వాతనైనా తనని వదిలిపెట్టమని వాడు మంగలిని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. కానీ మంగలి, వాడిని అంత త్వరగా వదిలిపెట్ట దలుచుకోలేదు. తన పొలంలోని వరి పంటనంతా కోసి ఇంటికి తెచ్చి పెట్టమన్నాడు. తనను తాను బందీగా భావించుకొంటున్న బ్రహ్మరాక్షసుడు ఇక కిక్కురుమనకుండా పనిలోకి దిగాడు.
అతను వరిపొలంలోకి దిగి పనితో సతమతమౌతుండగా, మరో బ్రహ్మరాక్షసుడు వాడిని చూసి, గుర్తుపట్టి, పలకరించాడు. " ఏం చేస్తున్నావని " అడిగాడు. మొదటిరాక్షసుడు తనెలా ఈ మోసకారి మనిషి కబంధ హస్తాలలో చిక్కుకున్నదీ, తను పని చెయ్యకపోతే తనకి వాడినుండి విముక్తి ఎలా లభించనిదీ చెప్పుకొని బావురుమన్నాడు. రెండో రాక్షసుడు పరిహాసంగా నవ్వి - "అరే, నీకేమైంది స్నేహితుడా? మనం మనుషులకంటే ఎన్నోరెట్లు అధికులం. ఎన్నో రెట్లు శక్తివంతులం. మనిషికి మనపై అధికారం ఎలా ఉంటుంది? నాకా మనిషి ఇల్లు చూపించు. నేను వాడి పనిపడతాను " అన్నాడు.
" నీకు ఇల్లు చూపించడం వరకూ చేయగలను. కానీ దూరంనుండే. ఈ వరి పొలం పని పూర్తయ్యేంతవరకూ నా మొహం అతనికి చూపించలేను " అంటూ, మంగలి ఇంటికి దారి చూపించాడు మొదటి బ్రహ్మరాక్షసుడు.
ఆలోపల మంగలి ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉన్నది. పండగ వంటకోసం మంగలి ఒక పెద్దచేపను కొనుక్కొచ్చాడు - అయితే దురదృష్టవశాత్తూ, వంటగది వెనక ఉన్న పగిలిన కిటికీలోంచి దూరి వచ్చిన దొంగపిల్లి ఒకటి, ఆ చేపను తినేసింది. మంగలి భార్యకు ఆ పిల్లిపైన చాలా కోపం వచ్చి, దాన్ని పట్టుకునేందుకుగాను దాని వెంటపడింది. కానీ చురుకైన ఆ పిల్లి వచ్చిన దారినే ఉడాయించింది. అది మళ్ళీ అదే దారిన వస్తుందని ఊహించిన మంగలి భార్య, చేపల కత్తిని చేతబూని ఆ కిటికీ పక్కనే బైఠాయించింది.
ఇదేమీ తెలియని రెండో రాక్షసుడు, ఇంటిలోకి వెళ్ళేముందు ఓసారి తన స్నేహితుడిని బందీచేసిన మనిషి ముఖం ఎలా ఉంటుందో చూద్దామనుకొని, మెల్లగా తన బవిరి గడ్డపు ముఖాన్ని కిటికీ లోనికి దోపాడు. దొంగ పిల్లి కోసం కిటికీ పక్కనే కూర్చున్న మంగలి భార్య కసిగా కత్తిని కిందకు దింపటం, ఆ దెబ్బకు బ్రహ్మరాక్షసుడి ముక్కు తెగిపోవడం జరిగేందుకు ఒక్క క్షణంకూడా పట్టలేదు. బాధకొద్దీ, భయంకొద్దీ వాడు ఇక కనబడకుండా పారిపోయాడు. ముక్కులేని తన ముఖాన్ని మిత్రునికి చూపించడానికి వాడికి ఏమాత్రం ఇష్టం లేకపోయింది.
మనిషి పని పడతానని వెళ్ళిన రెండవ బ్రహ్మరాక్షసుడు ఎంతకీ తిరిగిరానిది చూసి, పొలంలో పనిచేస్తున్న రాక్షసుడి గుండె వేగం పెరిగింది. వాడు చకచకా పంటనంతా కోసేసాడు; గింజలు వేరుచేసాడు; ధాన్యాన్నంతా ఎత్తాడు; ఇక మంగలిని కలిసి, వాడు భయం భయంగానే, తనను ఇకనైనా వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు, వేడుకొన్నాడు, బ్రతిమాలుకొన్నాడు.
తెలివైన మంగలి కాస్త జాలిని నటిస్తూ, "సరే నిన్ను విడుదల చేస్తున్నాను. కావాలంటే చూసుకో" అంటూ, ఈసారి అద్దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు. ఆతృతగా అందులోకి చూసిన బ్రహ్మరాక్షసునికి అందులో తన ముఖం కనిపించలేదు. తేలికపడ్డ మనసుతో వాడు మంగలికి కృతజ్ఞతలు చెప్పుకొని, సంతోషంగా తన దారిన తాను పోయాడు. మంగలికూడా తేలిక పడ్డాడు! అటుపైన వాడు పనిని బాగా నేర్చుకొని, తనకింద మరో ముగ్గురు పని వాళ్ళను పెట్టుకొని, తన వృత్తికీ న్యాయం చేశాడు!