నక్కల చెరువు ఒడ్డున దుబ్బకప్ప, బక్క కప్ప మిత్రులుగా ఉండేవి. ఆ రెండింటి ప్రవర్తనలోనూ, గుణగణాలలోనూ చాలా తేడా ఉండేది. దుబ్బకప్ప లావుగా, బలంగా, కానీ బద్ధకంగా ఉండేది. బక్క కప్ప చిన్నదిగా, నాజూకుగా, చురుకుగా, తెలివిగా ఉండేది. కప్పలు రెండూ ప్రతిరోజూ కలసి తమ కప్పల గుంపులో జరిగిన విషయాలనన్నింటిని గురించీ చర్చించుకొనేవి.
ఇలా ఉండగా, ఒక రోజు వర్షం బాగా కురిసింది. కప్ప మిత్రులిద్దరూ తేమలో చలాకీగా గెంతుతూ దగ్గరలోఉన్న ఊర్లోకి పోయాయి. పోతూపోతూ ఒక ఇంట్లోకి దూరాయి. ఇంట్లోకి వెళ్ళిన కప్పలు రెండూ, వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న పాలపాత్రలోకి దూకేశాయి. ఆపాత్రలో సగంవరకూ పాలున్నాయి. పాలలోకి దూకిన కప్పలు బయటికి రావడానికి కొన్ని గంటలపాటు విశ్వప్రయత్నం చేశాయి కానీ పాత్ర నున్నగా ఉండటంచేత బయటకి రాలేకపోయాయి. దుబ్బకప్పేమో ఎగిరీ, ఎగిరీ అలసిపోయి, నిరాశా నిస్పృహలకు లోనై ’ఇక చావే గతి’ అనుకొంది. పైగా "ఒసే బక్కదానా! ఈకష్టం నావల్ల కాదే! ఎంత ఈదినా, ఎంత గెంతినా మనం ఈ పాత్రనుండి బయట పడలేము. ఇక మనకు పరలోకమే గతి. కాబట్టి నువ్వుకూడా ఇక ఈదడం ఆపెయ్యి. ఎలాగూ చావబోతున్నాము. ఇక ఈ చివరి క్షణాలలో ఇంతగా కష్టపడి చచ్చేకంటే, ఊరికే చచ్చేది నయంకదా!" అని అయాసంగా అన్నది, నిట్టూరుస్తూ.
ఆ మాటలు విన్న బక్కకప్ప తన మిత్రుడైన దుబ్బ కప్పతో, "చూడు మిత్రమా! కష్టాలు వచ్చినంతలోనే ఇంతగా నిరుత్సాహపడిపోవడం సమంజసం కాదు. అపాయంనుండి బయటపడే మార్గం మనకు మనమే సృష్టించుకోగలగాలి. అందుకోసం కష్టపడాలి కానీ, పిరికివానిలాగా అధైర్యపడిపోకూడదు. అనుకున్నది సాధించే వరకూ పని చేయాలి. ఇదే నా నిర్ణయం. అని తను పాత్రలోనుండి బయటకుదూకే ప్రయత్నం కొనసాగించింది. చాలాసేపు అలా పాలలో ఈదీఈదీ బక్కకప్పకూడా అలసిపోయింది. కాళ్ళన్నీ నొప్పిపుట్టినా కూడా అది తన ప్రయత్నాన్ని ఆపలేదు. కొంచెం సేదతీరి, అలసట తగ్గగానే మళ్ళీ ఈదటం కొనసాగించింది.
అప్పుడు దుబ్బ కప్ప, "ఏమే బక్కదానా! ఇంకా ఎగరలేదేమిటి? ఎగురూ! ఎగురమ్మా " అని గేలిచేస్తూ, ఎగతాళిగా మాట్లాడింది. బక్కకప్పకు కోపంవచ్చింది. "చచ్చి సాధించేమీ లేదు. బ్రతికున్నంతవరకే ఏదైనా చేయగలము. ప్రయత్నాన్ని విరమించుకొని మధ్యలోనే చావడం పిరికివాని లక్షణం. కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతవరకూ ప్రయత్నాన్ని ఆపకూడదు" అని అన్నది.
అది విన్న దుబ్బకప్ప, ఏదో, బక్కకప్ప కోసం పనిచేస్తున్నట్టుగా చివరి ప్రయత్నాన్ని చేసింది, కానీ మనసులేని చోట శరీరం సహకరించకపోవటం వల్ల, కాసేపటికి అది అలిసిపోయి, గుండె పగిలి చనిపోయింది.
మిత్రుని మరణం ఒకవైపు, విపత్కర పరిస్థితి మరొకవైపు! బాగా అలసిపోయిన బక్కకప్ప ’ఇక తనవంతూ వచ్చేసిందా’ అనుకొంటుండగా, దాని కాళ్ళకింద ఏదో గట్టిగా తగిలినట్లనిపించింది. ఆశ్చర్యం! దానికాళ్లకింద ఒక పెద్ద వెన్నముద్ద వచ్చి దాన్ని పైకి లేపుతోంది. బక్క కప్ప సంతోషానికి అవధులులేవు. తనబలాన్నంతా కూడగట్టుకొని, గట్టిపడిన వెన్నముద్దమీదినుండి బయటికి గెంతి, పాత్రనుండి బయట పడింది. దాని కష్టానికి మంచి ఫలితం లభించింది. అందుకే అన్నారు, "కష్టే ఫలి " అని.
కష్టాలు వచ్చినప్పుడు, కుంగిపోతే లాభం లేదు. మన శక్తి కొద్దీ ప్రయత్నాన్ని నిరంతరంగా కొనసాగించాలి. ప్రయోజనం కలిగినా సరే, కలగకున్నా సరే. ప్రయత్నం ముఖ్యం, ఫలితం కంటే.