కొత్తపల్లిపత్రికలో ఎలాంటి కథలుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలోనే కీ.శే.ఎ.కె.రామానుజన్ గారు సేకరించిన జానపద కథల సంపుటి ఒకటి గుర్తుకు వచ్చింది. అందులో చాలా రత్నాలున్నాయి- ఒక రత్నం, ఇదిగో ఇదీ-

ఒక రోజున ఒక గురువుగారికి అతీంద్రియ జ్ఞానం కలిగింది. తాను త్వరలో మరణించనున్న విషయం ఆయనకు తెలిసిపోయింది. అంతేకాక, తరువాతి జన్మలో తాను ఎలా పుట్టనున్నది కూడా ఆయనకు తెలిసిపోయింది. అందువలన ఆయన తన ప్రియ శిష్యుడిని పిలిచి గురుదక్షిణగా ఏమిస్తావని అడిగాడు. గురువుగారికి ఏది ఇష్టమైతే అది చేస్తానన్నాడు శిష్యుడు. " తప్పకుండా చేస్తావు కదూ, మాట తప్పవుకదూ?" ‘తప్పన’న్నాడు శిష్యుడు.

ప్రమాణం చేయించుకున్న తర్వాత గురువుగారన్నారు - " అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ మాట తప్పకు. నేను త్వరలో ఈ శరీరాన్ని వదిలివేయబోతున్నాను. ఆ తరువాత నేనొక పందిగా పుట్టవలసి ఉంది. మన పెరట్లో చెత్తనూ, మురికినీ తింటున్న ఆ పెద్ద పందిని చూశావుకదా? దానికి ఈసారి పుట్టబోయే పిల్లల్లో నాలుగోదిగా నేను పునర్జన్మనొందుతాను. నానుదుటిమీద ఒక మచ్చ ఉంటుంది. దాని ఆధారంగా నువ్వు నన్ను గుర్తించగలవు. పెద్ద పంది ఈసారి ఈనినప్పుడు దాని పిల్లల్లో నాలుగోదాన్ని, నుదుటిమీద మచ్చద్వారా గుర్తించు. దాన్ని పట్టుకొని , కత్తితో ఒక్క పోటు పొడిచి చంపెయ్యి. దాంతో నాకు పంది జీవితంనుండి విముక్తి లభిస్తుంది. నువ్వు నాకోసం ఈ పని చేయగలవా?" అన్నాడు.

అదివిన్న శిష్యుడు చాలా బాధపడ్డాడు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి సరేనన్నాడు. ఈ సంభాషణ జరిగిన తర్వాత కొద్దిసేపటికే గురువుగారు మరణించారు. గురువుగారు చెప్పినట్టే, కొద్దిరోజులలో ఆ పెద్దపందికి నాలుగు పిల్లలు పుట్టాయి.

ఒకరోజున శిష్యుడు ఒక కత్తిని తీసుకొని, దానికి బాగా పదును పెట్టి , నాలుగో పిల్లను పట్టుకున్నాడు. దాని నుదుటి మీద మచ్చఉన్నది, గురువుగారు చెప్పినట్టుగానే. శిష్యుడు గుండెను రాయి చేసుకొని ఆ పందిపిల్ల మెడను చీల్చేందుకు కత్తిని దింపబోతూండగానే ఆ పంది పిల్ల " ఆగు! నన్ను చంపకు! " అని గట్టిగా అరిచింది. పందిపిల్ల మాట్లాడటం ఏమిటని శిష్యుడు నిర్ఘాంతపోయాడు. అతడు ఇంకా తేరుకోకముందే పందిపిల్ల అన్నది తన్నుకుంటూ- " నన్ను చంపకు. నేను ఇప్పుడు పందిలాగా జీవితం కొనసాగించాలని అనుకుంటున్నాను. నాకు శీఘ్రంగా విముక్తి కలిగించమని నిన్ను కోరినప్పుడు, నాకు నిజంగా తెలియదు - పంది జీవితం ఎలా ఉంటుందో. నిజానికి ఈ జీవితం చాలా అద్భుతంగా ఉంది. నన్ను వదిలి పెట్టు చాలు. నన్ను బ్రతకనీ" అని.

కథల్లో ఓ అందం ఉంటుంది.

చెప్పాలనుకున్నదాన్ని కథలు సూటిగానూ చెప్పగలవు, వంకరగానూ చెప్పగలవు. కొన్ని కథలు అద్భుతాలు. అవి ఏం చెప్పదలచిందీ ఆలోచిస్తే తప్ప అర్థం కావు. అలాగని మన ఆలోచనకు అర్థమైన సంగతినే అవి చెప్తాయా అని అంటే, అదీ సత్యంకాదు.

కథల్ని కథలుగా చూడగలిగితే బాగుంటుంది. వాటినుండి ఎప్పటి స్ఫూర్తిని అప్పుడు పొందగలిగితే బావుంటుంది. రకరకాల మనుషులకు నచ్చేందుకుకూడా రకరకాల కథలు అవసరం. కొత్తపల్లి పత్రికలోకి రకరకాల కథలు రావాలి. కొన్ని వెంటనే నచ్చితే, కొన్ని కొంతకాలం తరువాత నచ్చచ్చు. కొన్ని కొందరికి నచ్చితే, కొన్ని అందరికీ నచ్చచ్చు. ఏమైనా, రకరకాల కథలు వస్తేనే మంచిది. మీరేమంటారు?

ఇక, ఈ నెల కొత్తపల్లి పత్రిక పాటల్లోకి ఇంకొంత వైవిధ్యత తెచ్చాం. ఇందులోని ఆరు పాటలూ చెక్కభజన పాటలే. మరుగున పడుతున్న జానపద కళారూపాల్లో ఒకటి, చెక్క భజన. వందలాది గేయాలతో బహు జనాదరణకు నోచుకున్న చెక్కభజనలో బావా మరదళ్ల పాటలతోబాటు ఇతర రచనలూ అనేకం చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో అనంతపురం జిల్లాలో పల్లె పిల్లలకు ఇంకా సన్నిహితంగానే ఉన్న చెక్కభజన పాటల్లోని ప్రాచీన సాహిత్యపు రుచుల్ని సంకలితం చేద్దామనుకుంటే, ఆరు పాటలు మాత్రం లభించాయి ఇప్పటికి. ఈ ప్రయత్నాన్ని కొనసాగించి, వీలైనన్ని ఎక్కువ గీతాల్ని, వాటి ట్యూన్లను సేకరించాలని ఉద్దేశం. మొదటి అడుగు పడింది కాబట్టి, ముందడుగులూ వీలౌతాయని ఆశిద్దాం. కొత్తపల్లికి మీ ఆదరాభిమానాలు కొనసాగుతాయని ఆశిస్తూ,

మీ

కొత్తపల్లి బృందం.