ఒక నాటి సాయత్రంపూట, అప్పుడప్పుడే చీకటి పడుతుండగా, ఒక కాజీగారు కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో ఒక పురాతన గ్రంథాన్ని చదువుతున్నారు. అందులో ఒక వాక్యం ఆయన్ని కలచివేసి, ఇక ముందుకు పోనివ్వలేదు: " పొడవాటి గడ్డంఉన్న మనుషులు సాదారణంగా తెలివితక్కువ వాళ్ళే అయి ఉంటారు ".

కాజీగారికి శోభ ఆయనకున్న గడ్డమే. నగరంలో అందరికంటే పొడవాటి గడ్డం ఆయనదే. ’తను విజ్ఞాన ఖని అని, తను చెప్పే న్యాయం తిరుగులేనిదనీ, తను చాలా తెలివైన వాడు’ అనీ అందరూ అనుకోవాలని ఆయన ఆశ. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ కుప్పకూలాయి! అందరూ తన గడ్డాన్ని చూసి, తనెంత తెలివి తక్కువవాడో చెప్పుకుంటారు!" ఈ ఆలోచనే ఆయనకు కంపరం కలిగించింది.

అంతలో ఆయన చూపు పక్కనే ఉన్న నూనె దీపంమీద పడింది. ఇక వేరే ఆలోచనేమీ లేకుండా, ఆయన తన గడ్డాన్నంతా పిడికిట పట్టి, దాని చివరకు నిప్పంటించేసుకున్నాడు. అలాగైనా తన గడ్డం చిన్నదైపోతే అంతే చాలునని.

కాజీగారి గడ్డం పొడవుగా, చిక్కగా, సిల్కు మాదిరి ఉంటుంది. నిప్పంటించగానే అది అంటుకున్నది. ఒక్క సారిగా మంట పెద్దదయింది. కాజీగారి చేతులు కాలాయి. దాంతో ఆయన తన చేతులు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇక మంటకి అడ్డులేదు! అది ఇంకా పైకి ఎగిసింది. గడ్డాన్ని పూర్తిగా కాల్చేసి, మీసాల్ని, కను బొమ్మల్నీ కాల్చేసింది. ఇక ఆపైన తల జుట్టుకూడా అంటుకున్నది!

ఇప్పుడు అర్థమయింది కాజీగారికి - ‘ పొడవాటి గడ్డాలున్న వాళ్ళకి తెలివి తేటలు తక్కువేన’ని!