అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి సమీపంలోనే ఒక అడవి ఉండేది. ఊరికి చివర్లో ఒక చిన్న ఇల్లు ఉండేది. అందులో ఒక ముసలమ్మా, ఆమె ముద్దుల మనవడూ ఉండేవారు.
ముసలమ్మ మనవడు, రోజూ బాగా అల్లరి చేసేవాడు. ఒకనాటి రాత్రి వాడట్లా అల్లరి చేస్తుండగా, కోపమొచ్చిన ముసలమ్మ అన్నది: "ఒరేయ్! మనవడా! నువ్విట్లా అల్లరి చేశావంటే నేను నిన్ను తోడేలుకు ఇచ్చేస్తా" అని. సరిగ్గా అదే సమయానికి ఒక తోడేలు వచ్చి వాళ్ళ చూరు క్రింద నక్కి ఉన్నది. అది ఈ మాటలు విని చాలా సంతోషపడ్డది.
వెంటనే బయటికి వచ్చి "ఓ అవ్వా! నేను తోడేలును, వచ్చాను. నువ్వు నీ మనవడిని నాకివ్వాలనుకుంటున్నావుగా! ఇచ్చెయ్యి తొందరగా." అన్నది.
తోడేలును చూసిన అవ్వ "నీకు నా ముద్దుల మనవడే కావల్సివచ్చిందా? ఆగు నీ పని చెబుతాను" అని కొట్టంలో కట్టేసిన వేటకుక్కను తోడేలు మీదకి వదిలింది. వేటకుక్క వెంటపడటంతో తోకముడిచిన తోడేలు పారిపోతూ అనుకున్నది: "ఈ మనుషుల్ని నమ్మటానికి లేదు. వీళ్లు చెప్పేది ఒకటీ, చేసేది మరొకటీ!" అని.