ఓ చెరువులోని తాబేలు, దాని పక్కనేగల బొరియలో నివసించే నక్క మంచి స్నేహితులు.
ఓసారి అవి రెండూ చెరువుగట్టున కూర్చొని అవీ ఇవీ ముచ్చటించుకుంటున్నాయి. అంతలో అకస్మాత్తుగా అక్కడో చిరుతపులి ప్రత్యక్షమయింది.
నక్క మెరుపులాగా మాయమయింది. కానీ పాపం తాబేలుకు దాక్కునేందుకుగానీ, తప్పించుకునేందుకుగానీ సమయం చాలలేదు.
ఒక్క ఉదుటున దానిమీదకు దూకిన చిరుతపులి దాన్ని నోట్లో ఇరికించుకొని ఓ చెట్టుకిందికి పరిగెత్తింది. అక్కడ కూర్చొని మెల్లిగా తాబేలును తినవచ్చుననుకొన్నది. కానీ దాని పండ్లు కానీ, వాడియైన దాని పంజాగోర్లు కానీ తాబేలు పైపెంకుకు కనీసం గాటు కూడా పెట్టలేకపోయాయి.
తన బొరియలోంచి చిరుతపులి పడుతున్న కష్టాల్ని గమనించింది నక్క. తన మిత్రుడైన ఆ తాబేలును కాపాడుకొనేందుకు దానికో ఉపాయం తట్టింది. అది మెల్లగా బయటకు వచ్చి, లేని గౌరవాన్ని నటిస్తూ, చిరుతపులి ముందు అమాయకంగా నిలబడింది. "దీని పెంకును మెత్త బరిచే మార్గం ఒకటి నాకు తెలుసు. దీన్ని కొంతసేపు నీళ్ళలో పడేసి నాననియ్యి. ఆ తరువాత దీన్ని సులభంగా తీసేయవచ్చు" అన్నది.
వెర్రి చిరుతపులికి ఈ ఆలోచన నచ్చింది. అది అన్నది: " భలే ఆలోచన! నాకింతవరకూ తట్టనేలేదు!" అని అది తాబేలును చెరువులోకి జారవిడచింది. తాబేలుకు ఇంకేమికావాలి? అది మరుక్షణంలో మాయమై తప్పించుకున్నది.
చిరుతపులి తిరిగి చూసేసరికి నక్క కూడా మాయం!