అన్నా ఏడవ్వకురా లవ్వన్నా ఏడవ్వకురా
ఏడిస్తే నీ కనుల నీలాలు కారునురా
||అన్నాఏడవ్వకురా||
జో జో లాలీ.. లాలీ జో లాలీ
ఒక రాత్రీ ఒక పగలు పున్నమాను చెట్టుకింద
ఒంటొంటి బతుకాయే ఓ చందమామయ్యా
||జో జో లాలీ||
పినతండ్రి లక్ష్మణుడు ప్రతిదినమూ మిము దలచే
మీ తండ్రి రామునికి మీరుండేదే తెలియదురా
||జో జో లాలీ||
నెత్తిన కిరీటం నెలవంక నామమురా
పున్నమినాటి చంద్రుడా నా తండ్రీ ఏడవ్వకురా
||జో జో లాలీ||
పండ మంచము లేదు ఊపను ఉయ్యాల లేదు
జోలలు పాడుటకు దాదులు లేరయ్యా
||జో జో లాలీ||
ఉండేదీ కారడవి నే పండేదీ చిట్టడవి
అడవుల పాలవుతే మా అన్నాఏడవ్వకురా
||జో జో లాలీ||