పావురాయి అనే ఊరిలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. ఆమె ఒట్టి అమాయకురాలు. ఆమె తలివితక్కువతనానికి రామశర్మ బుర్రగోక్కునేవాడు. అయినా తప్పదు కాబట్టి అలాగే నెగ్గుకొస్తున్నాడు. ఒకసారి భిక్షాటనకోసం పొరుగూరు వెళ్తూ " ఏమోయ్, నేను భిక్షకోసం వెళ్తున్నాను. వచ్చేది ఆషాఢ భాద్రపదంగాళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూసుకో" అని హెచ్చరించి పోయాడు.

దీన్ని ఇద్దరు దొంగలు విన్నారు. అమ్మగారి అవివేకం గురించి ముందే విని ఉన్నారు గనుక వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ వర్తకుల వేషం వేసుకొని, రామశర్మ ఇంటి తలుపు తట్టారు. మేం ఆషాఢ భాద్రపదంగాళ్లము. నాపేరు ఆషాఢం, వీడి పేరు భాద్రపదం. మీ ఆయన ఉన్నారా? మాకు ఆయనతో పని ఉన్నది. " అన్నారు.

అందుకు రామశర్మ భార్య ఎంతో సంతోషపడి, మీ గురించి ఆయన చెప్పారు. ఆయన ఊరిలో లేరు. అయినా పర్లేదు, రండి రండి లోపలికి " అని వారిని ఆహ్వానించి సకల రాచమర్యాదలు చేసింది. ఇలా దాదాపు ఒక పక్షమురోజులు వారికి మర్యాదలు చేసింది. ఇక దొంగలు రామశర్మ వచ్చే సమయం దగ్గరకు వచ్చిందని తెలుసుకొని, " ఏమ్మా, బావగారు ఇంకా రాలేదు, మేం మళ్లీ వస్తాం " అని చెప్పి పలాయనం చిత్తగించారు.

అనుకున్నట్లుగానే రామశర్మ ఇంటికి వచ్చి, భిక్షలో వచ్చిన ధాన్యాన్ని గాదెల్లోకి పోశాడు. సగభాగం ఉన్న గాదెలు ఖాళీగా వెక్కిరించాయి. ’ఏమై ఉంటుందా’ అని అడిగిన రామశర్మతో భార్య " మీరేకదా, ఆషాఢ భాద్రపదంగాళ్ళు వస్తారు, జాగ్రత్తగా చూసుకోమని" చెప్పారు? మీరు అటు వెళ్లగానే వాళ్ళిటు వచ్చారు. వారికి ఏలోటూ రాకుండా ఉన్న ధాన్యాన్ని అమ్మి మరీ అన్ని సదుపాయాలూ చేశాను" అని చెప్పింది. ఇదివిన్న రామశర్మ లబోదిబో మంటూ "కొంపముంచావు గదమ్మా, ఆషాఢ భాద్రపదంగాళ్ళంటే మనుషులు కాదు; ఆషాఢమాసం, భాద్రపద మాసం- ఈ రెండు నెలల్లోనూ పెళ్ళిళ్లు, పేరంటాలు ఉండవు. అందువల్ల ఇవి రెండూ మన బ్రాహ్మణ కుటుంబాలకు కరువు నెలలు. ఈ నెలల్లో ఏ పనులూ దొరకవు కాబట్టి మన జీవనం కష్టంగా ఉంటుంది. అందుకే, జాగ్రత్తగా, చూసుకొని సంసారం చేసుకొమ్మని చెప్పాను. అయినా పెద్దదిక్కు లేని సంసారం ఇలాగే ఉంటుంది" అని చీవాట్లు పెట్టి, మళ్ళీ భిక్షాటనకు బయలుదేరాడు.

ఈ సంగతిని విన్న దొంగలు ’ఇదే అదను’ అనుకున్నారు. ఒక పెద్ద, తెల్లటిజుబ్బాను తీసుకుని, దాని పొట్టనిండా వరిగడ్డి కూరారు. తలగా ఒక నల్లని కుండను తగిలించి, మళ్లీ వీధిలోకి ప్రవేశించారు. బ్రాహ్మణుని ఇంటి ముందే నిలిచి " అమ్మకానికి పెద్దదిక్కును తెచ్చాం తల్లీ, కావాలా? " అని అడిగారు.

రామశర్మ తిట్టినప్పటినుండి బాధపడుతున్న భార్య, "అవును, నా భర్త పెద్దదిక్కు లేని సంసారం వృధా అన్నాడు కదా! ఇప్పుడు నేను పెద్దదిక్కును తీసుకుంటే సరి, నా సంసారం బాగు పడుతుంది" అని ఆలోచించి, ఇంటిలోని ధాన్యం మొత్తాన్నీ పోసి పెద్దదిక్కును కొన్నది. దాన్ని ఇంటిలో ఒక మూలన నిలబెట్టింది. ఇంతలో రెండవరోజున రామశర్మ వచ్చాడు. ధాన్యపు గాదెను పరిశీలించి మళ్ళీ లబోదిబోమంటూ భార్యను కేకవేశాడు. భార్య చావుకబురు చల్లగా చెప్పింది. ఇదివిన్న రామశర్మ కోపం పట్టలేకపోయాడు. " వెర్రిదానా, పెద్దదిక్కు- అంటే ఇంటిలో మంచి-చెడు చెప్పే పెద్దవాళ్ళు ఉండాలి అన్నాను కాని ఇలా కాదే! అయినా నిన్ని అని ఏంలాభం, వెళ్ళు! ఈ ఇల్లు ఇక గడవదు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకు’ అని భార్యచేతికి పెద్దదిక్కును ఇచ్చి బయటికి గెంటేశాడు.

అది రాత్రి సమయం, పైగా అమావాస్య చీకటి. పాపం రామశర్మ భార్యకు ఎటు పోవాలో తెలియలేదు. పెద్దదిక్కును ఎత్తుకొని అడవివైపుకు ప్రయాణం సాగించింది. అలా కొంతదూరం పోగానే ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. అలసట తోడై, నడవలేక ఆమె ప్రక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టునెక్కి కూర్చున్నది. పెద్దదిక్కును కొమ్మల సందున ఇరికించి, దాన్ని ఒక చేత్తో పట్టుకొని పడుకున్నది. ఆమెకు కొద్దికొద్దిగా కునుకు పడుతున్న సమయంలోనే, నలుగురు దొంగలు తాము దోచుకొనివచ్చిన నగలు, డబ్బును తీసుకొచ్చి, ఆ చెట్టుక్రిందే భాగాలు పంచుకోసాగారు. ఇంతలో గాలి బలంగా వీచటంతో, పెద్దదిక్కు పట్టుతప్పి దొంగల మధ్యలో దబ్బున పడింది. ఇది చూసిన దొంగలు ఏదో దయ్యం తమమీద దూకిందని భయపడి, డబ్బు దస్కాలను అక్కడే వదిలి, కాలికి తోచినట్లు పరుగు తీశారు.

తెల్లవారగానే గబుక్కున మేలుకున్న రామశర్మభార్య " అయ్యో , నా పెద్దదిక్కు పడిపోయింది. అని చెట్టు దిగి వచ్చి పెద్దదిక్కును చేత తీసుకున్నది. చూస్తే ఏముంది?- పెద్దదిక్కు క్రింద అపారమైన నగలు, డబ్బు కనిపించాయి. వాటిని అన్నింటినీ మూటగట్టుకొని, ఆమె తిరిగి ఇల్లు చేరుకున్నది. అప్పటికే తన తప్పును గ్రహించి కుములుతున్న రామశర్మ ఆమె రాకకు సంతోషించి, ఆమె ఇల్లు చేరిందే చాలుననుకున్నాడు. ఆమె తెచ్చిన సంపదను చూసి అతనికి నోటమాటరాలేదు. అమాయకుల్ని దైవం చల్లగా చూడటం అంటే ఇదే అని అతనికి అర్థమయ్యింది.