కొత్తపల్లి ఆగస్టు సంచికకు స్వాగతం. మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్యం అనగానే, ఎవరో చెప్పిన కథ గుర్తుకు వస్తున్నది ఒకటి:

ఒక ముసలి రాజుగారి దగ్గర ఒక పిట్ట ఉండేదట. అది మనిషిలాగా మాట్లాడేదట. రాజుగారు దానికి ఓ బంగారు పంజరం చేయించి శ్రద్ధగా సాకేవాడు. అది కోరిన కోరికల్లా తీర్చేవాడు. అరవయ్యేళ్ళు అలా కలిసి బతికారు వాళ్లు.

ఓసారి రాజుగారు దూరదేశం వెళ్లాల్సి వచ్చింది. మధ్యదారిలో ఈ పిట్ట పుట్టినిల్లు ఉంది. రాజుగారు వెళ్తూ వెళ్తూ అడిగారు: " పిట్టా, మీ పుట్టినింటి మీదుగా వస్తాను, మీ వాళ్లకు నీ గురించి ఏమైనా చెప్పాలా? " అని. " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది, రావాలంటే వీలు చిక్కటం లేదు " అని చెప్పమంది పిట్ట.

’సరే’నని రాజుగారు ప్రయాణమయ్యారు. వెనక్కి వస్తూ పిట్ట పుట్టినిల్లు ఉండే చెట్టు దగ్గర ఆగి బిగ్గరగా అరిచారు: " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది, రావాలంటే వీలు చిక్కటం లేదు " అని. ఆ మాట వినగానే అక్కడి పక్షులన్నీ నిశ్శబ్దం అయిపోయాయి. ఒక పిట్ట టప్పున క్రిందపడి గిలగిలా తన్నుకొని నిశ్చేష్టం అయిపోయింది.

రాజుగారు నొచ్చుకున్నారు. వెనక్కి వచ్చి తన పిట్టకు ఈ సంగతి చెప్పారు బాధగా. వినగానే ఆ పిట్టకూడా నిశ్శబ్దం అయిపోయింది. టప్పున క్రిందపడింది. ఇక కదలలేదు. రాజుగారికి దు:ఖం వేసింది. పంజరంలోంచి దాన్ని బయటికి తీసి బాధగా కిటికీ దగ్గర పడుకోబెట్టారు.

మరుక్షణంలో అది ఎగిరింది. దూరంగా చెట్టుకొమ్మన వాలింది. బిగ్గరగా ఇలా అన్నది: " రాజా, నేను ఇప్పుడు ఏం చేయాలో మా అక్క నాకు నీ ద్వారానే కబురంపింది. " అని.

రాజుగారు ఇంకా నొచ్చుకున్నారు. " నేను నిన్ను అరవయ్యేళ్ళుగా సాకాను. ఇంకా నువ్వు అసంతృప్తిగానే ఎందుకున్నావు? నువ్వడిగింది నేను ఏది ఇవ్వలేదు? ఇంకా నువ్వు నానుండి దూరంగా పోవాలనే ఎందుకనుకుంటున్నావు? "

" అరవయ్యేళ్ళుగా కోల్పోయిన స్వాతంత్రంలోని ఆనందాన్ని సొంతగా చెట్టుమీద వాలిన ఈ ఒక్క క్షణంలో అనుభవిస్తున్నాను. రాజా, స్వతంత్రప్రేమికి స్వాతంత్ర్యాన్ని మించిన అవసరం వేరే ఏమీ లేదు. ఎన్నేళ్ళైనా సరే, ఆ జీవి స్వాతంత్ర్యంకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది." అని.

నిజమైన స్వాతంత్ర్యంకోసం మనం అందరం ఎదురుచూద్దాం, ఇంకా, ఇంకా.. ఆ పక్షిమాదిరి. మనందరి కలలూ నిజం కాకపోవు, ఏదో ఒకనాటికి.

ఈ ఆగస్టు నెల కొత్తపల్లి పత్రిక మనలో స్వాతంత్ర్యపుటాలోచనల్ని రేకెత్తించాలని ఆశిస్తూ-

మీ-

కొత్తపల్లి బృందం.