అనంతపురం జిల్లాలో ఎన్నో దశాబ్దాలుగా వర్షాలు సమయానికి పడలేదు. ఇక సేద్యం చేయడం లాభం లేదని ఎంతో మంది రైతులు సేద్యం మానేశారు. అయితే గత రెండు సంవత్సరాలుగా పరిస్థితి కొంచెం మేలయింది. మొత్తం పడే వర్షంలో పెరుగుదల ఏం లేదు కానీ, పడే ఆనాలుగైదు వర్షాలు చెనిక్కాయల పంటకు కొంచెం అనుకూలంగా ఉండటమే ఆ వర్షంలో వచ్చిన మంచి మార్పు. వర్షం పరిస్థితి మారినా మా చుట్టు పక్కన పల్లెల్లో ఇంకా చాలా మంది రైతులు చెనిక్కాయలు వేసేకి ముందుకు రావటం లేదు. పంట బాగొస్తే రావచ్చు, కానీ పందుల దాడిని ఎలా తట్టుకుంటామని భయపడుతున్నారు. "పంట కాలమంతా రాత్రిళ్లు కాపలాకాయడం మా వల్ల కాదు. కొంచెం ఏమరుపాటు పడ్డామా, అంతే! పంటంతా పందులు దోచుకు పోతాయి." ఇలా అనుకుంటూ చాలా మంది చెనిక్కాయలకు మంచి వర్షం వస్తున్నా సేద్యం చేయడానికి ముందుకు రావడం లేదు.

మా బడిలో పిల్లలకు సేద్యమంటే ప్రాణం. చదువుల్లో భాగంగా సేద్యమనే పేరుతో పిల్లలు చిన్న చిన్న తోటలు చేస్తూ ఉన్నారు. ఆ తోటల్లో నుండి పెద్దగా పంటలేమీ రావు. అయితే పిల్లలు, టీచర్లు మాత్రం సేద్యం గురించి చాలా నేర్చుకుంటుంటారు. ఒక్కొక్క కయ్యలో నుండి కాలు కిలో, అర్ధ కిలో, కిలో కూరగాయలు పండిస్తుంటారు. పిల్లల తోటల్లో అలాంటి దిగుబడి చూసి పెద్దవాళ్లు చాలా మురిసిపోయి "వెరీ గుడ్" అని పొగుడుతుంటారు. కానీ పిల్లలు మాత్రం తాము ఇంత చిన్న పంటలు తీయడం చాలా చిన్నతనంగా భావిస్తుంటారు. కిందటి సంవత్సరం జూన్ నెలలో ఒక రోజు మధ్యాహ్నం తోట పని సమయంలో ఒక పిల్లాడికి ఒక వింత ఆలోచన వచ్చింది. "రే! మనకు గానీ నాలుగైదు ఎకరాల పొలముంటే భలే బాగుంటుందిరా! చేస్తే పెద్ద సేద్యం చేయాలి. ఛ! ఇదేంటి ఇంత చిన్న కయ్యల్లో తోటలు పెంచడం నాకేం బాగలేదు," అని అతనంటే అతని తోటపని గ్రూపు పిల్లలందరూ అతనితో వంత పాడారు. ఈ మాటలు నిదానంగా మిగిలిన తోట పని గ్రూపులకు చేరాయి. స్నానాల సమయంలో అన్ని బాత్రూముల్లోనూ ఇవే మాటలు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఆడ పిల్లలు, మగ పిల్లలు అందరూ ఇవే మాటలు. "చేస్తే, మనం పెద్ద సేద్యమే చేయాలి," అని "కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలి" అన్నట్లుగా.

రెండ్రోజుల్లో ఈ ఆలోచన స్కూలు అసెంబ్లీలోకి వచ్చింది. మేం అసెంబ్లీలో చాలా విషయాలు చర్చించుకుంటాము. ఆ రోజు కొందరు పిల్లలు తమ కొత్త ఆలోచనను అసెంబ్లీలో హెడ్మాస్టరన్నకు చెబుదామనుకున్నారు. మా బడిలో పిల్లలు పెద్దల్ని సార్, మేడం అని కాకుండా అన్నా, అక్కా అని సంబోధిస్తారు. "అన్నా! మనం ఈసారి నాలుగైదు ఎకరాల్లో చెనిక్కాయలు పండిద్దాం. మన బడికి భూమి లేదు కాబట్టి మన బడికి దగ్గర్లో సేద్యం చేయని ఎవరినైనా కౌలుకు భూమినడుగుదాం," అని ఒక పిల్లవాడు హెడ్మాస్టరన్నతో చెప్పాడు. అవును, మనం తప్పక సేద్యం చేయాలన్నాట్లు మిగిలిన వాళ్లూ వంత పలికారు.

మా బడి హెడ్మాస్టరుక్కూడా సేద్యం అంటే చాలా ఇష్టం. చదువుల్లో భాగంగా సేద్యం చేయాలని, సేద్యంలో భాగంగా చదువులు నడవ్వచ్చని అతనికి బోలెడు ఆలోచనలు. నిజమైన చదువంటే ఏమిటో, పిల్లలు బాల్యాన్ని కోల్పోకుండా ఎలా చదువులు నేర్చుకోవచ్చునో - ఇలా చాలా కలలు కంటుంటాడు. ఇప్పుడు పిల్లల నుండి ఇంత పెద్ద ఆలోచన సేద్యం గురించి వచ్చేసరికి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే కొంత సేపు అతనికి ఏమి చెప్పాలో తోచలేదు.
మిగిలిన టీచర్లకు పిల్లల ఐడియా పెద్దగా నచ్చినట్లు లేదు. అందరూ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా సాధ్యం కాని పని, ఇప్పుడున్న పనులు చాలవా? మళ్లా కొత్త పని ఎందుకు? ఇలాంటివన్నీ చేస్తే పిల్లలకు చదువుకునేందుకు టైమెక్కడుంటుంది? అయినా పిల్లలేం సేద్యం చేయగలరు? చేన్లో పందుల కాపలా ఎవరుంటారు? పందుల నుండి పంట దక్కించుకొనేకి మన వల్ల వీలవుతుందా? - ఇలా టీచర్లు చాలా రకాలుగా ఆలోచించు కుంటున్నారనుకుంటాను. కొంచెం సేపటికి ఒక టీచరు అడవి పందుల సమస్య గురించి పిల్లలకు వివరంగా చెప్పాడు. "తరతరాలుగా సేద్యం చేసే వాళ్ల్లే ఈ పందుల సమస్యను తట్టుకోలేక పోతున్నారు. చదువుకునే మనలాంటి వాళ్ల వలన అయ్యే పని కాదిది," అని చెప్పేసాడు.

"అన్నా! మాకు నాలుగెకరాలు బడికి దగ్గర్లో కౌలుకు ఇప్పించండి. మేం సేద్యం చేసి చూపిస్తాం. ఈసారి వర్షం బాగా వచ్చేటట్లుంది. మేం వంతులేసుకొని రోజూ రాత్రిళ్లు చేన్లో కాపలాకెళతాం. పందుల సమస్య నుండి మా చేను కాపాడుకోవడానికి మా వల్లవుతుంది. దీనికి మా దగ్గరొక సీక్రెట్ కూడ ఉంది!" అని వీరు అనే ఒక పిల్లాడు గట్టిగా చెప్పాడు. ఇంతసేపూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్న హెడ్మాస్టరన్న "సరే చూద్దాంలే! దీని గురించి రేపు మాట్లాడుకుందాం" అని ఆరోజు అసెంబ్లీని ముగించాడు.

ఆ హెడ్మాస్టర్ తీరిక దొరికినప్పుడల్లా పిల్లల ఆలోచన గురించి టీచర్లతో చర్చించాడు. వారంతా బడి తరపున సేద్యం చేయటంలోని సాధ్యాసాధ్యాలను గురించి మాట్లాడుకున్నారు. హెడ్మాస్టర్ తన కలల్ని, తన ఆలోచనల్ని, తన నమ్మకాన్ని మిగిలిన టీచర్ల మీద తెలిసీ తెలియనట్లు రుద్దాడు. అందరి చేత "సరే, చేసి చూద్దాం" అనిపించాడు. అయినా ’హెడ్మాస్టర్’ అనే అధికార ముద్ర కూడా వారి మీద ప్రభావం చూపించి ఉంటుంది. అయితే ఒక సారి నిర్ణయం తీసుకొన్న తర్వాత అందరిలో ఉత్సాహం పెరిగింది. ఒక్కొక్క టీచరు ఒక్కో బాధ్యత తీసుకున్నారు.

ఆరోజు సాయంత్రమే ఒక టీచరు రంగారెడ్డి అనే ఒక రైతును కలిసాడు. అతనికి బడికి దగ్గర్లో కొండ కింద నాలుగెకరాల చేను ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ చేను బీడుగా ఉంది. ఆ చేనును తమకు ఈ పంట కాలానికి కౌలుకిస్తారా అని అడిగాడు. రంగారెడ్డి చాలా సంతోషంగా "సార్! మీరు మా చేను చేసుకుంటామంటే మాకు చాలా సంతోషం. దీనికి మాకు ఒక్క పైసా కూడా మీరివ్వక్కర్లేదు. దేవుని దయ వల్ల చెనిక్కాయలు బాగా పండితే మీకు తోచింది ఇవ్వండి చాలు" అన్నాడు. "అయినా మీరు అడవి పందుల నుండి పంటను ఎలా కాపాడుకుంటారో నాకర్థం కావడం లేదు," అని కూడా రంగారెడ్డి టీచర్ని భయపెట్టాడు.

మరుసటి రోజు ఉదయం కౌలుకు చేను దొరికిందని పిల్లలకు తెలస్తానే వాళ్లలో పట్టలేని సంతోషం కనిపించింది. అసెంబ్లీలో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆచేనులో ఏమేమి పనులు చేయాల్సి ఉందో పిల్లలు ఠక ఠకా చెప్పేసారు. దున్నించేదెట్లా, దుక్కి తీసేదెట్లా, ఎరువు సంగతేంటి, విత్తనాల సంగతేంటి... ఇలా అన్నింటి గురించి పిల్లలు తల పండిన రైతుల్లా మాట్లాడేరు. పెద్దవాళ్లకే ఆశ్చర్యమేసింది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ట్రాక్టరు పెట్టించి భూమి రెడీ చేద్దామన్నారు. మన బడిలో ఎంత ఎరువు ఉంటే అదంతా చేన్లోకి తోలదామన్నారు. తాము ఇన్నాళ్లు పోగు చేసి దాచి పెట్టిన ఎరువంతా ఇస్తామని అన్ని తోటపని గ్రూపుల వాళ్లు పలికారు. మరి విత్తనాల సంగతేంటి? ఈరోజుల్లో రైతులెవరూ విత్తనాలు దాచుకోవడం లేదు కదా! పంట సమయానికి గవర్నమెంటు వాళ్లు ఇచ్చే విత్తనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం రైతులం కాదు, మనకి పాస్ బుక్కులు లేవు. కాబట్టి మనకెట్లా విత్తనాలు దొరుకుతాయి? "దానికేం దిగులు పడాల్సింది లేదన్నా! వాళ్నడిగీ, వీళ్నడిగీ ఎట్లాగైనా విత్తనాలు తెచ్చుకోవచ్చులేన్నా!" అని కొందరు పిల్లలు బాగా అనుభవమున్నట్లు చెప్పారు.

పనులన్నీఠక ఠక జరిగి పోయాయి. బళ్ళో పెద్దలందరు తలా ఒకపని చేశారు. వంటపనివాళ్ళు, రోజూ ఏదో ఒక పనికి కూలికి వచ్చేవాళ్లు, టీచర్లు, ఆఫీసు అసిస్టెంట్లు - అందరూ ఎవరూ చెప్పక పోయినా రకరకాల పనులు చేశారు. కొన్నిపనులకు కూలీలను పెట్టారు. పిల్లలు చేయలేని పనులను వారు చేసారు. ప్రతిపనీ ఒక పండగలాగ జరిగి పోయింది. అయితే ఈ పనులేమీ చదువులకు అడ్డంకాలేదు. పిల్లలందరు కలసి పనిచేసిన రోజున బడికి సెలవిచ్చేవారు. ఆ క్లాసులు మరుసటి ఆదివారము పెట్టుకున్నారు. చేన్లో సంగటి ముద్ద, చట్నీ చేసుకొని తిన్నారు. సమయానికి వర్షాలొచ్చాయి. చాలమందిని మస్కాకొట్టి మా వాళ్లు సమయానికి విత్తనాలు సంపాదించారు. ఈపనులన్నీ సజవుగా జరగడానికి మాబడిమిత్రుడొకడు అప్పిచ్చాడు. "లాభమొస్తే మీది, నష్టమొస్తే నాది," అని భరోసా కూడ ఇచ్చాడు. ఇతని భరోసా లేక పోతే మేమెవరమూ ఈపనిలో దిగే వాళ్ళం కాదు. ఈ పనులన్నీబడి తరపున జరుగుతున్నట్లు చేసాము. కాని ఒక్క సందేహం మాత్రము నాకిప్పటికీ తీరలేదు. పిల్లలు పెద్దలచేతపనిచేయించారా? లేక పెద్దలు పిల్లచేతపనిచేయించారా? అని. సమగ్రంగా విశ్లేషించడం కష్టంగా వున్నా, మా బళ్ళో మేమందరము కలసి సేద్యం చేశాం అని అందరు అనిపించారు.

విత్తనాలు నాటిన రోజు నుండి పిల్లల పని మొదలయింది. పిల్లలు విత్తనాలు నాటుతూ వుంటే దారిన పోయేవారు "ఈరాత్రికే పందులు మీ విత్తనాలన్నీ తినేసిపోతాయిలెండి. రంగారెడ్డికి సేద్యం చేతకాకనా మానేశాడు. అడవి పందుల దాడిని ఈ పిల్లకాయలు ఎలా తట్టుకుంటారో చూద్దాం," అని అంటుంటే పిల్లలకు భలే రోషమొచ్చింది ముఖ్యంగా ’వీరు’ గ్యాంగు కు చాలా ఎక్కువ రోషమొచ్చింది.

’వీరు గ్రూపు’ మాబడిలో డప్పు గ్రూపు. అందులో ఆరుగురున్నారు. డప్పు భలే వాయిస్తారు. అలుపనేది తెలియకుండా రోజంతా వాయించగలరు. వాళ్ళు డప్పువాయిస్తే లయబద్ధంగా కాళ్లూపనివారు ఎవరూ ఉండరు. పని మొదలుపెట్టినప్పటి నుండి, "పందులనుండి చేనునుకాపాడే బాధ్యత మాదే," అంటూ చెబుతున్నారు. విత్తనాలు నాటే రోజు కొరకు వీళ్లు ఎదురుచూస్తున్నారు. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకే వాళ్ళు భోజనం చేసారు. మంచి టార్చిలైటు ఒకటి తీసుకొన్నారు. ఒంటి మీద దుప్పట్లుకప్పుకొన్నారు. వానోస్తే తడవకుండా సంచిపట్టలు తీసుకొన్నారు. "భలే స్టైళ్లే అప్పా!" అంటూ వారిని చూసి కొందరు పిల్లలు గొనిగారు. డప్పు వాయించుకొంటూ చేను చేరుకొన్నారు. రాత్రంతా డప్పు వాయిస్తూ వున్నారు. రాత్రంతా డఫ్పు కొట్టే అవకాశం వచ్చినందుకు చాలాసంతోషంగా ఎగిరెగిరి డప్పుకొట్టారు. వాళ్ళకునిద్రే రాలేదు. వాళ్ల డప్పు శబ్దాలకు పక్కచేన్లలోని వాళ్లు తమకు తెలియకుండానే చీకట్లో లయబద్ధంగా అడుగులేసుకుంటూ తిరిగారు. అయితే వాళ్ళకు చాలా ఆశ్చర్యమేసింది. ఎంత సేపటికీ వాళ్లకి ఒక్కపంది కూడ కనిపించలేదు. పొద్దున ఆరు వరకు చేనంతా తిరిగినా, ఒక్కపందినైనా చూడలేక పోయామని నిరాశతో బడికి చేరుకొన్నారు.

ఆరోజు ఉదయం పది గంటలకు బడిపక్కన గల కొండల్లో గొర్రెల కాపర్లకు పది పందులు చచ్చి పడివుండటం కనిపించింది. చాలా సంతోషంగా వాళ్లు ఆపందుల్ని మోసుకొని బడి కాడి కొచ్చారు. "ఇంత మాంసం ఊరంతా తిన్నా మిగులుతుంది సార్ ! మీ పిల్లలకు కావలసినంత మాంసం ఇస్తాం, తీసుకుంటారా?" అని అడిగారు. అన్నిపందులు ఒక్కసారిగా చనిపోయివుండటం హెడ్మాష్టర్ కు ఆశ్చర్యం వేసింది. "వాటిని ఎవరైనా వేటాడినట్టుగాని లేక వేరే జంతువులు చంపినట్లుగాని గుర్తులు కనిపించలేదు ఫారెస్ట్ వాళ్లు గాని, ఇంకెవరైనా గాని వాటికి ఏదైనామందుపెట్టి ఉంటారు. ఇలా చనిపోయిన జంతువుల మాంసం తినకూడదు," అని హెడ్మాష్టర్ అన్నారు. "ఏం, కాదులేండి సార్!" అంటూ పది పందులను వాళ్ళు ఊర్లోకి తీసుకెళ్లారు. ఊరంతా పండుగ చేసుకుంది. "నిన్న రాత్రి పందులుమనచేనులోకి రాకపోవడానికి కారణం మనోళ్లు డప్పుకొట్టినందుకు కాదు. ఈపందులను ఎవరో మందు పెట్టి చంపారు," అని ’వీరు’ అంటే కొంచెం పడని వాళ్లు సంతోషపడ్డారు.

ఆరోజు సాయంత్రం కూడ ’వీరు’ గ్రూపు పిల్లలు డప్పువాయిస్తూ చేనంతా తిరిగారు. ఈరోజుకూడ వారికి ఉత్సాహం ఏమీ తగ్గలేదు. అయితే ఈరోజు ఒక జాగ్రత్త తీసుకొన్నారు. ఆరోజు ఉదయం క్లాసులో వీళ్లు తూగుతూ ఉంటే టీచర్లు తిట్టారు. "మేం చేనుకు కాపలాపోయినాము, గీపలా పోయినాము అంటే కుదరదు. అందరిలాగే మీరు కూడ హోంవర్క్ చేసుకొని రావల్సిందే! అందరిలాగే క్లాసులోపూర్తి మనసు పెట్టాల్సిందే! అలాఅయితే ఆ పని చేయండి లేక పోతే మానేయండి!" అన్నారు. ఇందు వల్ల పౌరుషం గల పిల్లలు టార్చిలైటు తో పాటు ఒకలాంతరు, కావలసిన పుస్తకాలు తెచ్చుకున్నారు. వంతుల ప్రకారము చేను మధ్య బండ మీద కూర్చోని హోం వర్క్ చేసుకొన్నారు. కొంతనిద్ర కూడా పోయారు. రాత్రంతా నలుగురు డప్పు కొట్టుకొంటూ చేనంతా తిరిగారు. మధ్య మధ్య ఒకరు టార్చిలైటు వేస్తున్నారు. పందుల కోసం చూస్తున్నారు. రెండో రోజు వీళ్ళ డప్పుల శబ్ధాలకు పక్క చేన్లోని జనాలు లయబద్ధంగా ఈలలు వేస్తున్నారు. దానికి చాలా సంతోషపడి మన డప్పుపిల్లలు డప్పు ఇంకా బ్రహ్మాండంగా కొట్టారు. అయితే తెల్లారే దాక ఒక్క పందిని కూడ చూడక పోయేసరికి కొంచెం నిరుత్సాహ పడ్డారు. అయితే డప్పు శబ్దానికి భయపడి పందులు చేన్లోకి రాలేదు అనుకొని తమను తాము ఓదార్చుకొంటూ బడిచేరుకొన్నారు.

ఆ రోజు కూడా గొర్ర్రెలోళ్లు 10-12 పందులు అడవిలో చనిపోయి ఉండటం చూసారు. అబ్బా, మళ్లీ ఎంత మాంసం, ఎంత మాంసం అనుకుంటూ ఊర్లోకి పందుల్నిమోసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న బడి పిల్లలు, "పందుల్ని ఎవరో మందు పెట్టి చంపివుంటారు, అందుకే మన చేన్లో వీరు గ్రూపు వాళ్లకి పని సులభమయింది," అని అనుకున్నారు. రెండవ రోజు కూడా ఊరంతా పండగే! అయితే ఈ విషయం పారెస్టు డిపార్ట్ మెంట్ కు తెలిసింది. గార్డులు విషయాలను ఆరా తీసారు. ’పందుల్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపి ఉంటార’నేది వారికి అంతు చిక్కలేదు.

ఇలా ఒక్కరోజు కాదు, పంట కాలం నాలుగునెలలూ ఇలాగే జరిగింది. మొదట్లో రోజుకు పది దాకా పందులు చని పోయి ఉండేవి, నిదానంగా ఆ సంఖ్య ఒకటి రెండుకు తగ్గింది. పందుల చావుకు కారణాలు ఎవరికీ అర్థం కావడంలేదు. ఫారెస్టు డాక్టర్లు , జూ డాక్టర్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి కారణాలు అన్వేషిస్తున్నారు. సాంపిల్స్ తీసుకొని ల్యాబుల్లో పరిక్షించారు. అందరూ పందుల చావుల్ని సహజ మరణాలని ధృవీకరించారు. ’ఇదేమైనా మాస్ స్యూసైడా? అడవుల్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల కారణంగా వాటికి మానసిక ఒత్తిడి గానీ చాలా ఎక్కువైందా?’ ఈ కోణాల్లో కూడా కొందరు పరిశోధించటం మొదలు పెట్టారు.

’వీరు గ్రూపు’ వాళ్లు మాత్రం రోజూ డప్పు కొడుతూ చేనుకు కాపలా కాయడానికి అలవాటు పడ్డారు. "అసలు ఒక్కరోజు కూడా పందులు చేన్లో పడలేదు కదా, ఇక మీరు కాపలాకు పోవడం మానేయవచ్చు," అనిహెడ్మాస్టరు అంటే, "లేదన్నా , ఏం చెప్పగలం? ఈ రోజు మేం కాపలాకు పోలేదని అవి చేన్లో పడితే ఎట్లా? మనకు చాలా నష్టం వస్తుంది కదా ? ఒక్క కాయకూడా మేం పందులకి వదలకూడదనుకున్నాం," అని బదులిచ్చారు. ప్రస్తుతం వాళ్లకు బళ్ళో పిల్లల గదుల్లో పడుకోవటం కంటే చేన్లోనే కొంతసేపు పడుకొని, కొంతసేపు డప్పు కొట్టుకుంటూ మేలుకోవడం బాగుంది.
ఇప్పుడు ఫారెస్టు వాళ్లు మా బడి పక్కన కొండల్లోకి ఎవరినీ రానీయటం లేదు. రోజూ బెంగుళూరు, హైదరాబాదుల నుండి చాలా మంది శాస్త్రవేత్తలు ,పరిశోధకులు వచ్చి ఏవేవో పరిశీలించి వెళుతున్నారు. మొదట్లో ఊళ్లో వాళ్లందరూ చాలా ఆసక్తిగా వచ్చి ఆ తంతు చూసెళ్ళేవారు. పత్రికల్లో ప్రముఖంగా వార్తలొచ్చేవి. నిదానంగా ఇది సాధారణ విషయమయి పోయింది. రోజు ఎవరో ఒకరు వస్తున్నారు. ఏవేవో చేస్తున్నారు. చచ్చిపోయిన పందుల్ని తీసుకెళ్తున్నారు.

ఈ పంట కాలానికి దేవుడు కరుణించినట్లుంది. కావలసిన సమయంలో కావలసినంత వర్షం పడుతోంది. ఎర్రగొంగళి పురుగు సమస్య అసలు కనిపించలేదు. వేరు పురుగు, గీరు పురుగు సమస్యలు కూడ అతి తక్కువ. అయితే మిగిలిన చోటుండే ఒక సమస్య మాత్రం మాకు లేక పోయింది. ఒక్క పందికూడ మా చేన్లల్లో పడలేదు. ఇప్పుడు చెనిక్కాయలు బాగా ఊరాయి. తొందర్లో పీకేయడానికి రెడీగా ఉన్నాయి. పందుల సమస్య లేదంటున్నా వినకుండా డప్పు గ్యాంగు రోజూ చేన్లో డప్పు వాయిస్తోంది. పంట బాగా వస్తున్నదన్న సంతోషంతో వాళ్ల హుషారు ఇంకా పెరిగింది.

శాస్త్రవేత్తలు, వాళ్లూ-వీళ్లూ, ఇంకెవరూ పందుల చావుకు కారణం కనుక్కోలేకపోతున్నారు. మనమంతా కనుక్కోవడానికి ప్రయత్నిద్దామని కొందరు రైతులు నడుంకట్టారు. ఓ రోజు సాయంత్రం కొండల్లో పందులు చనిపోయే ప్రాంతాలకు ఒక్కొక్క చోట నలుగురైదుగురు చేరుకొన్నారు. ఎందుకైనా మంచిదని చెట్లమీదకెక్కి కూర్చొన్నారు. భయం భయంగా ఏం జరుగుతుందోనని నలువైపులా చూస్తున్నారు.

సాయంత్రం చీకటి పడుతుండగా దూరంగా మాచేనులోనుంచి పిల్లల డఫ్ఫు శబ్దం వినిపించడం మొదలయింది. చాలా జోరుగా, హుషారుగా, లయబద్ధంగా వినిపిస్తోంది. చెట్లమీద మనుషులు కూడ లయబద్ధంగా కాళ్లూపుతున్నారు. ఆశ్చర్యం! దూరం నుండి పందులు కొన్ని ఆ డప్పులకు అడుగులు వేసుకొంటూ రావడం గమనించారు. వాటికి డప్పు శబ్దం బాగా వినపడే సరికి వాటి అడుగులలో ఊపెక్కువైంది. డప్పులో ఊపెక్కేసరికి ఇంకా జోరుగా డాన్స్ చేస్తున్నాయి. రాత్రంతా డాన్స్ చేస్తున్నాయి. చెట్ల మీద మనుషులు వాటి డాన్స్ ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ’పందులేంటి, ఇంత చక్కగా డాన్సు చేయటం! ఆగకుండా ఎంత సేపు చేస్తున్నాయి! ఎంత ఎత్తు ఎగురుతున్నాయి! వీటికి అలుపే రావడం లేదేంటి?’ చివరికి డాన్స్ చేసి చేసి, ఉదయం ఐదు గంటల కల్లా కళ్లు తిరిగి పడిపోయినట్లు పడిపోయాయి. ఒక పది నిముషాలు చెట్లమీద మనుషులు షాక్ తిన్నట్లు అట్లే కదలకుండా ఉండిపోయారు. కొంచెంసేపటికి తేరుకొని చెట్లు దిగి పందులను దగ్గరగా చూస్తే, అవి చనిపోయాయని అర్థమైపోయింది. అప్పటికి వాళ్లకి పందుల చావుకి కారణం అర్థమైంది.

చనిపోయిన ఐదుపందులను పొద్దున అరుగంటలకే ఊరికి చేర్చారు. వాటిమాంసం అందరికీ పంచారు. రహస్యం అందరికీ తెలిసిపోయింది. మా డప్పు గ్యాంగుని ఆ రోజంతా ఎడ్ల బండ్ల మీద ఊరేగించారు. పూలమాలలువేసి జేజేలు పలికారు.

మాబడి పిల్లలు తలపెట్టిన సేద్యం మంచి ఫలితాల నిచ్చింది. ఊహించనంత ఎక్కువ కాయలు వచ్చాయి. పశువులకు మంచి మేత దొరికింది. మాడప్పు గ్రూపు పుణ్యమా అని, చాలా మంది బండ్ల నిండా పంటని తమ ఇళ్లకు చేర్చుకొన్నారు.