సూర్యోదయంతో పాటే ఆ అడవి కూడా మేల్కొంది. అడవిలోని అన్ని ప్రాణులు మేతకు బయలుదేరి వెళ్ళాయి. జిరాఫీ కూడా ఆకులు, అలములు తింటూ తిరగసాగింది.
" హేయ్, జిరాఫీ అన్నా, నిన్నే, ఇటురా ” అనే మధురమైన పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. ఒక చెట్టుపైన గూడులోంచి చిన్న పిచ్చుక తనని పిలుస్తోంది. దాన్ని చూస్తే జిరాఫికి చాలా ముద్దొచ్చింది.
వెనక్కి వచ్చి " ఎందుకు పిలిచావు ” అని అడిగింది జిరాఫి.
"మా అమ్మ మేతకు వెళ్ళింది, నాకేమో చాలా బోర్ గా ఉంది. నాకు ఇంకా పూర్తిగా రెక్కలు రాలేదు కదా. అందుకని నన్ను అమ్మ ఎక్కడికి వెళ్ళనివ్వదు. మా ఫ్రెండ్ చింటూ ఈ చెట్టు కిందున్న తొర్రలో ఉంటాడు. వాడితో కాసేపు ఆడుకుంటాను. నన్ను అక్కడికి చేర్చవా” అని పిచ్చుక పిల్ల జిరాఫీని వేడుకుంది.
" మీ అమ్మ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా" అంది జిరాఫీ.
"అమ్మో మా అమ్మకు తెలిస్తే అస్సలు వెళ్లనివ్వదు. ప్లీజ్ జిరాఫీ అన్నా” అంటూ పిచ్చుకపిల్ల ఏడ్చింది. పాపం పిచ్చుకను చూస్తే జాలేసింది జిరాఫీకి. పిచ్చుక పిల్లని దాని స్నేహితుని దగ్గరికి చేర్చి, మళ్ళీ ఆకులు అలములు తినడంలో మునిగిపోయింది జిరాఫీ.
కాసేపయ్యాక " రక్షించండి, రక్షించండి ” అంటూ అరుపులు వినిపించాయి జిరాఫీకి. చెట్టు మొదట్లో నక్క కనిపించింది. గబగబా చెట్టు దగ్గరికి చేరుకొనే లోపే నక్క నోటిలో పిచ్చుక పిల్లను కరచుకుంది. జిరాఫీ వేగంగా కదిలి దాని పొడువాటి కాలుతో నక్కని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు నక్క నోటి నుంచి పిచ్చుక పిల్ల జారి క్రింద పడింది. నక్క పారిపోయింది.
పిచ్చుక పిల్లను తిరిగి జాగ్రత్తగా దాని గూట్లోకి చేరుస్తుండగా తల్లి పిచ్చుక వచ్చింది. వస్తూనే " ఏం జరిగింది.” అని కంగారుగా అడిగింది. జిరాఫీ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లి మాట వినకుండా తను జిరాఫీ సహాయంతో కిందకు వెళ్ళినందుకు పిచ్చుకపిల్ల చాలా సిగ్గుపడింది. తల్లిని క్షమించమని కోరింది.
" నీవు చేసిన మేలు మరచిపోలేను” అంటూ జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నది తల్లిపిచ్చుక, తన పిల్లను ప్రేమగా అదుముకుంటూ.