పాత్రలు:

  1. విద్యార్థి
  2. లక్ష్మీదేవి
  3. మహా విష్ణువు
  4. రంభ
  5. నారదుడు
  6. నలుగురు భక్తులు
  7. సింహం

(ఒక అరణ్యప్రాంతంలో విద్యార్థి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.)

నారదుడు: నారాయణ... నారాయణ. (విద్యార్థిని చూసి) ఎందుకు నాయనా, ఏడుస్తున్నావు?

విద్యార్థి: మహర్షులకు ప్రణామములు. నేను దిక్కుతోచని పరిస్థితిలో పడినాను. నాకు చదువంటే ఎంతో మక్కువ. బాగా చదువుకోవాలని ఉంది. కానీ మా తల్లిదండ్రుల పేదరికం కారణంగా నాకు చదివే యోగం లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో నన్ను ఆదుకునేవారెవరు?

నారదుడు: చింతించకు బాలకా. అన్ని చింతలను దూరం చేసేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. అతనినే ప్రార్థించు. నారాయణ.... నారాయణ (అంటూ అదృశ్యమౌతాడు)

విద్యార్థి: అవును. అన్ని చింతలను రూపుమాపేది ఆ పరమాత్ముడే. అతనినే వేడుకుంటాను. కఠోర తపస్సు చేస్తాను. ఈ క్షణం నుండే మొదలుపెడతాను. ఓం.... ఓం...... ఓం....(ధ్యానిస్తూ ఉంటాడు)

(కొంతమంది భక్తులు అటుగా వెళ్తుంటారు.. నేపధ్యంలో పాట:

ఓం ఓం ఓం అనుడి
ఉల్లములొలరగ అందరునొకపరి |ఓం|
సర్వశాస్త్రముల సామరస్యమది
సర్వవేదముల సారసూచి అది |ఓం|

(వైకుంఠంలో) లక్ష్మీదేవి: స్వామీ, భూలోకంలో ఎవరో భక్తుడు మీ అనుగ్రహం కోరుతూ తపస్సు చేస్తున్నట్లున్నది.

విష్ణువు: దేవీ ఇది మనకు మామూలే కదా? భక్తులు తపస్సు చేయటం, వారి స్తోమతకు మించిన కోరికలు కోరటం? చూద్దాం, అతను ఎంత కఠోర తపస్సు చేయగలుగుతాడో. ఆపైన మనం చెయ్యగలిగిన సాయం మనం చేద్దాం. ముందు అతనిని పరీక్షించాలి

లక్ష్మీదేవి: ఏం చేస్తారు స్వామీ? Do you test him seriously? అతడిని నిజంగా కఠినంగా పరీక్షిస్తారా?

(ఇంతలో విద్యార్థి ఉన్న పరిసరాల్లోకి ఒక సింహం వస్తుంది)

సింహం: ఆకలి.. ఆకలి... అమ్మయ్య! ఇక్కడ ఎవరో మానవుడు కూర్చొని ఉన్నాడు. వాడిని తినేస్తాను. నా ఆకలి చల్లారుతుంది (అని గర్జిస్తూ అక్కడికి పరుగెత్తుతుంది)

(విద్యార్థి ఏమాత్రం పట్టించుకోడు. తన తపస్సు తాను చేస్తూనే ఉంటాడు.)

సింహం: ఏంటీ, వీడు..? అడవికి రాజును నేను వచ్చినా కదలడు మెదలడు? ఇలాంటి గొప్ప భక్తుడిని చంపి తినటం మహాపాపం. I can't eat this child. It is sin. really.. (అంటూ వెళ్ళిపోతుంది)

(ఇంకొంత సమయం తరువాత అక్కడికి రంభ వస్తుంది) రంభ: ఆ అంటే అమలాపురం.. (అనే పాటను పాడుతుంది) (అయినా విద్యార్థి కదలడు, మెదలడు)

రంభ: ముస్తఫా.. ముస్తఫా (అనేపాటను అభినయిస్తుంది)

(అయినా విద్యార్థి పట్టించుకోడు. తపస్సులోనే నిమగ్నమౌతాడు)

రంభ: This boy is very strong. నా అందానికి, నా నాట్యానికి, నా పాటకు చలించనివాడు ఈ మూడు లోకాలలోనూ లేడు..వీడు తప్ప. ఇక waste (అంటూ నిష్క్రమిస్తుంది)

(వైకుంఠంలో..) లక్ష్మి: స్వామీ, మీరు పెట్టిన పరీక్షలన్నింటినీ ఇతడు అధిగమించాడు. ఇప్పుడేం చేస్తారు?

విష్ణువు: ఇంకొంత కాలం వేచిచూద్దాం దేవీ, ఇతడు తనంతట తానే తపస్సును మానుకోవచ్చు.

(అంతలో లక్ష్మీదేవి, మహావిష్ణువు ఉన్న శేష తల్పం కంపిస్తుంది..)

లక్ష్మీదేవి: ఏమిటిస్వామీ, ఈ విపరీత పరిణామం?

మహావిష్ణువు: భూలోకం వెళ్ళవలసిన సమయం ఆసన్నమయింది. బయలుదేరు దేవీ.

(ఇద్దరూ విద్యార్థిముందు ప్రత్యక్షమౌతారు)

విష్ణువు: భక్తా, ఏమిటి, నీ కోరిక? ఏల ఈ కఠోర తపస్సు? ముక్కుపచ్చారని వయస్సులో ఈ కఠిన తపంబేల?

విద్యార్థి: స్వామీ, నేను ఒక ప్రైవేటు బడిలో చదువుతుండేవాడిని- మొన్న మొన్నటివరకూ. My parents are very poor. They could not pay the school fees. అందుకని వాళ్ళు నన్ను చదువు మానుకొమ్మంటున్నారు. Now what shall I do? నాకేమో చదువుకొని గొప్ప వ్యక్తిని కావాలనిఉంది. మీరే శరణు. నేనేం చెయ్యాలి, చెప్పండి.

(శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడతాడు)

లక్ష్మీదేవి: దేవా, ఈ సమస్యకు పరిష్కారం ఉంది. మానవలోకంలో, భారతదేశ ప్రభుత్వం ’అందరూ చదవాలి- అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలపైన చాలా శ్రద్ధ చూపుతున్నది. ఇతడు అలాంటి ప్రభుత్వ బడిలో చేరితే సరి.

మహావిష్ణువు: మరి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, మరి వీరికి దగ్గర్లోని ఏ బడి బాగున్నదో తెలుసుకోవటం ఎలా?

(అంతలో నారాయణ... నారాయణ.. అంటూ నారదుడు వస్తాడు.)

లక్ష్మీదేవి: అదిగో నారదుడు రానే వచ్చాడు. అతనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాడు.

విష్ణువు: నారదా, నువ్వెప్పుడూ భూలోక సంచారం అధికంగా చేస్తావుకదా? వీళ్ళుండే బహదూర్ పురా మండలంలో మంచి ఫలితాలిచ్చే ప్రభుత్వ పాఠశాల ఏదో చెప్పుము.

నారదుడు: అయ్యో స్వామీ! ఇంకా మీకు తెలీలేదా? ముల్లోకాలూ ముక్తకంఠంతో ఒకే ఒక పాఠశాల పేరు చెబుతున్నారు. అదే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శాలిబండ. లాల్ దర్వాజాలో పంచముఖి హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉంది.

మహావిష్ణువు: ఆహా అలాగా, మంచిది. (విద్యార్థి వైపు చూసి) చూడు భక్తా! నారదుడు చెప్పినట్లుగా, ఆ స్కూలుకు వెళ్ళు. అడ్మిషన్ తీసుకో. నీ విద్య కొనసాగించు. తెలుగు మీడియం అని వెనుకాడకు. బాగా చదివితే ఏ మీడియం అయినా ఒకటే. లోకానికి పని చేసేవాళ్ళు కావాలి- అంతేకాని ఒకటి రెండు ఇంగ్లీషు ముక్కలు ముక్కున పెట్టుకొని మాట్లాడేవాళ్ళు కాదు. పని చెయ్యటం వస్తుందా రాదా అనేదే ముఖ్యం. తగిన వివేకం ఉందా, లేదా అనేదే అవసరం

మంచి భారత పౌరునిగా ఎదిగి, ఉన్నత శిఖరాలను అధిగమించు. దీర్ఘాయుష్మాన్ భవ.

(దేవతలు అందరూ అదృశ్యమౌతారు. విద్యార్థి నారాయణ స్మరణ చేస్తూ బడిలో చేరేందుకు బయలుదేరతాడు.)