అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు రఘూత్తముడు. ఆయన మంచి రాజు. అయినా ఆయనకు తృప్తి లేదు. “ఈ లోకం ఎందుకు ఇలా చప్పగా ఉంది? నా చేతిలో ఏదైనా మ్యాజిక్ ఉంటే ఎంత బాగుంటుంది?!” అనుకుంటూ ఉండేవాడు ఆయన.
ఒక రోజు గంగా నదిలో స్నానం చేస్తుంటే ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"ఒక కోరికను కోరుకో" అని అడిగాడు రాజును. రాజు కొంచెం ఆలోచింది, "నేను తాకిందంతా మాయం అవ్వాలి" అని కోరాడు. దేవుడు "సరిగ్గా ఆలోచించుకున్నావా? అని అడిగాడు. “ఓఁ చాలా బాగా ఆలోచించుకున్నాను" అన్నాడు రాజు. "అయతే సరే, తథాస్తు" అని మాయం అయిపోయాడు దేవుడు.
రాజు అప్పుడు ఇంక రాజ్యంలోకి వెళ్ళాడు. అంతలో రాజుగారి ప్రాణ స్నేహితుడు ఒకతను వచ్చాడు. అతని పేరు శివయ్య. రాజుగారు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే- రాజుగారి స్నేహితుడు కాస్తా మాయం అయిపోయాడు! రాజుగారు చాలా బాధపడ్డారు. ఆయన అట్లా బాధగా కూర్చొని ఉండగా ఆయన సైనికుడు ఒకడు వచ్చి కొన్ని లడ్డూలు ఇచ్చి తినమన్నాడు. రాజుగారికి వాటిని చూడగానే నోరు ఊరింది. అయితే ఆయన లడ్డూలను తాకాడో లేదో- అవి మాయమయ్యాయి!
రాజుగారు మళ్ళీ బాధగా కూర్చున్నారు. తన చేతితో ఒక బంగారు కుండను తాకారు. తక్షణం అది కాస్తా మాయమయిపోయింది!
అంతలోనే రాజుగారు కూర్చున్న బంగారు కుర్చీ కూడా మాయమయిపోయింది.
రాజుగారి బాధకు అంతులేదు. మొదట తన ప్రాణ స్నేహితుడు, తర్వాత తన లడ్డూలు, బంగారు కుండ, బంగారు కుర్చీ- అన్నీ మాయమయిపోయాయి. ఇప్పుడు రాజుగారికి ఎక్కడ లేని ఆకలి! ఎక్కడా లేని దప్పిక! ఆకలి దప్పులంటే ఏమిటో తెలిసివచ్చాయాయనకు!
ఇట్లా కొద్ది రోజులు గడిచాయి. ఏం అనుకొని రాజు ఈ కోరికను కోరాడో గాని, ఇప్పుడు మటుకు ఆయనకు అదే శాపంగా తోచసాగింది.
ఇప్పుడాయన బక్కచిక్కిపోయాడు. కొంచెం సేపు కూడా ఎక్కడ మనసు నిలవకుండా అయ్యింది. ఎక్కడా కూడా కొంచెం సేపు ఉండలేడు! దేన్నీ ముట్టుకోలేడు!
చివరికి వేసారిపోయారు రాజుగారు. మళ్ళీ ఓసారి భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థించారు. దేవుడికి రాజుగారి మీద దయ కలిగింది. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు- "ఏమైంది?! అంతా బాగుందా? నువ్వు తాకినవన్నీ మాయం అవుతున్నాయా?" అని అడిగాడు చిరునవ్వుతో. జరిగినదంతా చెప్పారు రాజుగారు.
దేవుడికి అర్థం అయ్యింది- రాజుగారి మనసు నిజంగానే మారింది. అందుకని ఆయన తన వరాన్ని తానే వెనక్కి తీసుకున్నాడు. మరుక్షణం రాజు గారి ప్రాణ స్నాహితుడు, లడ్డూలు, కుండ, బంగారు కుర్చీ, అన్నం, నీళ్ళు అన్నీ తిరిగి వచ్చాయి. రాజుగారు అంతులేని ఆనందంతో స్నేహితుడ్ని కౌగిలించుకున్నారు; లడ్డూలు తిన్నారు;, బంగారు కుర్చీ మీద మహారాజులాగా ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు రాజు చాలా ఆనందంగాఉన్నాడు! ఆయనకు లోకం చాలా బాగా కనిపిస్తోంది. మ్యాజిక్ మీద మోజు పోయింది.
ఆ రోజంతా రాజుగారు పేదలకు దానం చేస్తూనే ఉన్నారు. ఆ పైన ఏనాడూ గొంతెమ్మ కోరికలు కోరలేదు- తనకు ఉన్న వాటితో చాలా ఆనందంగా గడిపారు.