రామయ్యకు సంపద ఏమంత లేకపోయినా, మంచితనం మాత్రం చాలానే ఉంది. అతనికి ఒక్కడే కొడుకు- పేరు రాము. రాము చాలా మంచివాడు, తెలివైన వాడు కూడా.
అదే ఊళ్లో ఉండే విశ్వ ధనవంతుడు; కానీ అతను బలే పిరికివాడు, స్వార్థపరుడున్నూ. విశ్వా కొడుకు అజయ్‌కి అదృష్టవశాత్తు తండ్రి పోలికలు రాలేదు. అజయ్ కూడా రాము వాళ్ళ స్కూల్ లోనే చదువుకుంటున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు; ఇద్దరూ ఇతరులకు సహాయపడేవాళ్ళు.
ఒకరోజున విశ్వ, అజయ్ ఇద్దరూ కాలినడకన పొరుగూరుకు బయలుదేరారు. ఆ సరికి సాయంత్రం కావస్తున్నది. ఊరి చివర్లో ఉన్న తాటి చెట్ల దగ్గరికి రాగానే అకస్మాత్తుగా ఓ పెద్ద ఆకారం వాళ్ళ ముందుకు దూకింది: "ఏయ్! ఎవర్రా అది?! మర్యాదగా మీ పేరు చెప్పండి! లేదా ఇవాల్టితో మీ పని సరి" అన్నది. చూసేందుకది మనిషి లాగా లేదు; అలాగని మనకు తెలిసిన జంతువు లాగానూ లేదు. ఎక్కడినుండి దూకిందో మరి, తెలియలేదు. దాని గొంతు మటుకు బరకగా, మగ మనిషి గొంతులాగా ఉంది. "న్.న్.న్.నాపేరు విశ్వ. వీడు నా కొడుకు అజయ్" వణికిపోతూ చెప్పాడు విశ్వ.
"ఉంఁ.. ఒక్కడు దొరికాడన్నమాట. ఇదిగో ఒరే పిల్లాడా! మీ నాన్నని చూస్తే కరకరా నమిలి తినబుద్ధవుతున్నది, కేవలం నిన్ను చూసి ఆగుతున్నాను గానీ. ముందు నువ్వు ఒక పని చెయ్యాలి. మీ నాన్నని నాకిచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటిదారి పట్టు. నీకు ఎవరైనా మంచి స్నేహితులున్నారా?" అని అడిగింది ఆకారం. "ఉన్నాడు..రాము!" అన్నాడు అజయ్.
"ఊఁ.. దొరికాడు రెండోవాడు కూడా. సరే, నువ్వెళ్ళి వాడిని వెంటబెట్టుకు రా, త్వరగా! అంతవరకూ మీనాన్న ఇక్కడ కూర్చొని నాకు కథలు చెబుతుంటాడు" అన్నాడు ఆకారం వాడు.
"వాడిని పట్టుకొస్తే మమ్మల్ని వదిలేస్తావా? ఒరే, పోయి ఆ రాముగాడిని పిల్చుకొచ్చెయ్యిరా. ఈ రాక్షసుడికి వాడిని ఇచ్చేసామంటే మన దారిన మనం పోవచ్చు-" అన్నాడు విశ్వ, కొడుకును ఊరి వైపుకు నెడుతూ.
"ఉహుఁ. అట్లా కుదరదు. నీకు కావాలంటే మా నాన్నను ఉంచేసుకో. నేను మాత్రం రామును నీకు అప్పగించేది లేదు!" అన్నాడు అజయ్ మొండిగా.
"మీ నాన్నలాంటి వాడితో నాకూ పని లేదు. అందుకని నువ్వు నాతో ఉండిపో. మీ నాన్నని ఊళ్ళోకి పంపిస్తా" అని ఆ ఆకారం వాడు అజయ్‌ని పట్టుకొని, విశ్వని వదిలేశాడు.
విశ్వ "ఓ..రాక్షసుడు!" అని మొత్తుకుంటూ ఊళ్ళోకి పరుగు పెట్టాడు. ఊళ్ళో అందరూ అతన్ని "ఏమైంది?" అని అడిగేవాళ్ళే తప్ప, ఒక్కళ్ళూ ముందుపడి 'నేను నీకు సాయం చేస్తాను' అనలేదు.
అంతలో విశ్వకు రామయ్య ఎదురయ్యాడు. విశ్వ కొడుకును రాక్షసుడు పట్టేసుకున్నాడని వినగానే రామయ్య విశ్వతో "పద, నేనూ వస్తాను నీతో. ఇద్దరం కలిసి వాడి పని పడదాం!" అన్నాడు.
"కాదట! వాడికి నీ కొడుకు కావాలట!వాడినీ రమ్మను!" అన్నాడు విశ్వ. అంతలోనే అక్కడికి చేరుకున్న రాము "పద నాన్నా! అసలు మనిద్దరం చాల్లే. ఈయనెందుకు? నువ్వు ఇంటికి పో, విశ్వ మామా! నేను-నాన్న వెళ్ళి అజయ్‌ని ఏదో ఒకరకంగా విడిపించుకు వస్తాంలే!" అన్నాడు.
"అవునవును. అదే మంచిది. ఇంట్లోవాళ్ళు నీకోసం కలవర పడుతున్నారేమో పోయి చూడు-!" అన్నాడు రామయ్య వెటకారంగా.
పిరికి విశ్వ చటుక్కున కొడుకు సంగతి వదిలేసి, "సరే, మీరు ఎలాగంటే అలాగ- కానివ్వండి!" అంటూ ఇంటిదారి పట్టాడు! అట్లా విశ్వ ఇంటికి వెళ్ళగా రామయ్య, రాము ఇద్దరూ తాటి చెట్ల దగ్గరికి చేరుకున్నారు.
ఆ సరికి రాక్షసుడు, రాజేష్ ఇద్దరూ ఎంచక్కా ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు! రాజేష్ ముఖం ప్రసన్నంగా ఉంది! రాక్షసుడు మటుకు భోరు భోరుమని ఏడుస్తున్నాడు. కళ్ళలోంచి కారిన నీళ్ళు వాడి ముఖం మీద చారికలు కట్టి ఉన్నాయి!
"ఏయ్ఁ! మర్యాదగా మా పిల్లాడిని వదిలిపెడతావా, లేక నిన్ను ఇప్పటికిప్పుడు భూస్థాపితం చేయమంటావా?" దూరం నుండే హుంకరించాడు రామయ్య, క్రిందికి వంగి ఓ గులకరాయిని చేతిలోకి తీసుకుంటూ.
"అయ్యో! పాపం అతన్ని ఏమీ అనకండి మామా! కొడుక్కి బాగాలేదని ఇప్పటికే అతను బాధలో ఉన్నాడు" అడ్డం వచ్చాడు రాజేష్.
రామయ్య రాజేష్‌కేసి వింతగా చూశాడు.
"అవును మామా! ఇతను మంచివాడే- తన పేరు 'హు హు'- వింధ్యపర్వతాల నడుమన ఉన్న అడవిలో వీళ్ళ జాతివాళ్ళు ఏ కొద్దిమందో మాత్రం ఉన్నారట. రాక్షసుల్లాగా పెద్ద పెద్ద శరీరాలుంటాయి వీళ్లకి- అయినా వీళ్లు మాంసం తినరు- మనలాంటి మనుషులే కద, వీళ్ళూనూ!
అయితే పాపం, ఇతని కొడుక్కి ఏదో పెద్ద జబ్బు చేసిందట. ఉత్తరం వైపున ఉన్న పర్వతాలలో దానికి కావలసిన మందుమొక్క ఉందని, ఇతను ఇలా మన ఊరివైపుకు వచ్చాడు. అయితే ఆ మందుమొక్కను ఎవరైనా మంచి స్నేహితులు ఇద్దరు వెళ్ళి కోసుకొస్తే తప్ప, అది పనిచెయ్యదట- అట్లా అని వాళ్ళ నమ్మకం! అందుకని ఇతను ఎవరైనా ఇద్దరు పిల్లలు దొరుకుతారేమోనని వెతికాడు- అంతే తప్ప, పిల్లల్ని ఎత్తుకెళ్దామని కాదు" వివరించాడు రాజేష్.
ఆ పెద్ద ఆకారంవాడు రామయ్యకు నమస్కారం పెట్టాడు. రామయ్య ప్రాణం కుదుటపడ్డది- "సరేలే. మరి నేను వీడితోబాటు ఇక్కడ కూర్చుంటాను; మీరు వెళ్ళి వాడికి కావలసిన మూలిక ఏదో తెచ్చి ఇచ్చెయ్యండి" అన్నాడతను పిల్లలతో.
రాక్షసుడి చేత గుర్తులు చెప్పించుకొని రాజేష్, రాము ఇద్దరూ ధైర్యంగా అడవిలోకి బయలుదేరి పోయారు.
కొద్ది సేపట్లోనే వాళ్లకు కావలసిన మూలిక దొరికింది. దాన్ని తెచ్చి ఇచ్చేసరికి అతనికి ఎక్కడలేని అనందం కలిగింది.
వీళ్ళిద్దరినీ భుజాలమీద ఎక్కించుకొని నాట్యం చేసినంతపని చేశాడతను! అటుపైన రామయ్యకు వంగి వంగి నమస్కారాలు పెట్టి, అతను మూలిక తీసుకొని తన తావుకు తను పోయాడు.
"ఇంతమాత్రానికి ఎందుకురా, మీ నాన్న అంత గందరగోళపడ్డాడు?" అడిగాడు రామయ్య, రాజేష్‌ను. "పిరికితనం మామా!" నవ్వాడు రాజేష్.