ఒక రోజున బుద్ధుడు ఒక అడవిలో ఉన్నాడు. ఆయన శిష్యులు ఒక ముప్ఫై-నలభై మంది ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. బుద్ధుడు వాళ్ళకు జీవితపు ఉద్దేశాల గురించి, జాగరూకంగా ఉండటం గురించి, మనసును పరిశుద్ధం చేసుకోవటం గురించి బోధిస్తున్నాడు. శిష్యులందరూ ఆసక్తిగా వింటున్నారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న రైతు ఒకడు వీళ్లను చూసి, దగ్గరికి వచ్చాడు. అతను ఏదో బాధలో ఉన్నాడని స్పష్టంగా‌ తెలుస్తూ ఉన్నది.

"నా ఆవులు తప్పిపోయాయి. మీ రేమైనా చూశారా? ఇటువైపుగా ఆవుల మంద ఏదైనా వచ్చిందా, మీరు చూస్తుండగా?" అడిగాడు రైతు.

శిష్యులందరూ‌ అడ్డంగా తల ఆడించారు.

"లేదు. మీ ఆవుల మంద మాకెవ్వరికీ కనబడలేదు" అన్నాడు బుద్ధుడు.

రైతు అలసిపోయినట్లు అక్కడే ఓ చెట్టుకు చేరగిలబడి "అబ్బ! చాలా కష్టంగా ఉంది స్వామీ! చాలా బాధగా ఉంది. పన్నెండు ఆవులున్నాయి నాకు. ఇప్పుడు వాటికి ఏమైందో మరి, ఒక్కసారిగా అన్నీ కట్టకట్టుకొని పారిపోయాయి! ఇక నాకున్నదే

నాలుగెకరాల నువ్వుల చేను అంటే, చీడ పట్టి పంట అంతా నాశనం అయిపోయింది- ఒక్క గింజా చేతికందేట్లు లేదు! జీవితం అంతా బరువైపోయింది. ఆత్మహత్య తప్పిస్తే వేరే మార్గం కనబడట్లేదు-" అన్నాడు.

"మిత్రమా! ఎవ్వరి ఆవులూ ఇటువైపుకు రాగా చూడలేదు మేము. వాటి కోసం వేరే దిక్కున వెతికితే ప్రయోజనం ఉండచ్చేమో; చూడు. ఈ దిక్కుకు ఆవులేవీ రావు" అన్నాడు బుద్ధుడు.

రైతు వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకొని వేరే వైపుకు బయలుదేరి పోయాడు.

ఆ తర్వాత బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు: "మిత్రులారా! ఈ ప్రపంచంలో‌ 'అందరికంటే సంతోషంగా ఎవరైనా ఉన్నారు' అంటే అది మీరే. పోగొట్టుకునేందుకు మీకు ఏ ఆవులూ లేవు!

మీకే గనక ఆవులు ఉండి ఉంటే, మీరు కూడా ఈ రైతులాగే, వాటిని నిలుపుకునేందుకు చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు!
అందుకని, 'సంతోషంగా ఉండాలి' అనుకునేవాళ్ళు 'ఆవుల్ని వదిలేసే కళ' ను అభ్యాసం చేయాలి. మీ మీ ఆవుల్ని ఒక్కటొక్కటిగా వదిలేయాలి.

మొదట్లో మీకు అది అంత సులభం కాకపోవచ్చు. 'నా సంతోషానికి ఈ ఆవులు ఉండటమే కారణం!' అని మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ మీకు అలా అనిపించింది కాబట్టే, ఇంకా ఇంకా ఆవుల్ని సంపాధించుకునేందుకు శ్రమించారు. అయితే ఈ సరికి మీకు అర్థం‌ అయిఉండాలి- మీ సంతోషానికి ఆవులు ఉండటం అనేది కారణం కాదు. నిజానికి ఆవులు మీ సంతోషానికి అవరోధాలు!

అందుకని, ఇప్పుడు మీరంతా ఆవుల్ని వదిలేసేందుకు కృత నిశ్చయులు కావాలి!” అని. దాంతో శిష్యులకి కోరికలు ఎలా ఉంటాయో కొద్దిగా అర్థం అయ్యింది.