విజయవాడకి సమీపాన రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో సీతయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనికి చాలా రోజులుగా తిరుపతికి వెళ్ళి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని కోరిక. అయితే ఆ రోజుల్లో ఒక్కళ్ళే ప్రయాణం చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల సీతయ్య తన కుటుంబంతో పాటు ఓ నాలుగు కుటుంబాలని వెంటబెట్టుకుని వెళ్ళాలనుకున్నాడు.

అనుకున్నట్లుగానే ఓ ఐదు కుటుంబాల వాళ్ళు కలిసి ఐదు ఎద్దుల బండ్లలో తిరుపతికి బయలుదేరారు. ప్రయాణం చాలావరకు సాఫీగానే సాగింది- కానీ ప్రయాణం మొత్తానికి సరిపడా తెచ్చుకున్న తిండి పదార్థాలు మధ్యదారిలోనే అయిపోయినై. వేరే పనులేమీ లేక, కేవలం తినడమే పనిగా పెట్టుకోవడం వల్ల- అట్లా జరిగిందన్న మాట. మరి ఇప్పుడేం చెయ్యాలి?!

'సాయంత్రానికి గుడికి చేరతాం కదా, అక్కడేదైనా కొనుక్కుందాం!' అనుకున్నారు అందరూ. అయితే అంతసేపు ఆగితే గద!? మధ్యాహ్నానికే ఆకలితో నకనకలాడిపోయారు అందరూ!

ఆ సమయంలో వాళ్ళు ఒక పల్లెగుండా ప్రయాణిస్తున్నారు- 'సరే ఏదయితే అదవుతుంది' అనుకున్న సీతయ్య, బాగా ధనికుల ఇల్లుగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో బండ్లు ఆపించాడు. ఇంటి ముందు పడక్కుర్చీలో తీరుబడిగా కూర్చుని ఉన్న ఇంటి యజమాని వైపు చూసి నవ్వుతూ "ఏం బావగారూ, బాగున్నారా?!” అని పలకరించి, "పదండి పదండి లోపలకి, అక్కయ్య లోపలున్నట్లుంది" అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్ళాడు.

గుంపు గుంపంతా కిక్కురుమనకుండా లోపలికి చేరింది.

ఇక ఇంటి లోపల యజమాని భార్య 'వీళ్ళెవరో మా ఆయన వైపు బంధువులనుకున్నది. ఎంత ప్రేమగా పలకరిస్తున్నారో చూడు' అనుకొని, అందరికీ మర్యాదలు చేసింది.

"ఏముంది చెల్లెమ్మా! అందరం కులాసా. మీరంతా బాగున్నారా? ఆ వెంకన్న రమ్మని పిలిచాడు, మేమంతా ఆగలేక బయలుదేరాం. ఇవాళ్ల సాయంత్రమే దర్శనం. దార్లోనే కదా, కొంచెం మిమ్మల్నీ పలకరించినట్లు ఉంటుందని ఇటొచ్చాం!" కలుపుగోలుగా ముచ్చటించాడు సీతయ్య.

"అవునా, అన్నయ్య గారూ! రాక రాక వచ్చారు- భోజనం చేసిగానీ వెళ్లటానికి వీల్లేదు. సాయంత్రానికి చేరుకున్నా రాత్రికి దర్శనం అవుతుంది లెండి- దానిదేముంది?! వెంటనే భోజనాలు సిద్ధం చేస్తాను- వెళ్దురు" అని ఆవిడ భోజనాల తయారీ మొదలు పెట్టుకున్నది. వచ్చిన బంధువులంతా ఆమెకు సాయం చేయటంలో పడ్డారు.

వంటపని హడావుడిలో ఉన్న భార్యతో కలిసి మాట్లాడనీయకుండా ఇంటి యజమాని పక్కపక్కనే తిరుగుతూ కబుర్లు చెప్పాడు సీతయ్య.

అలా అలా సంతోషంగా మధ్యాహ్నం భోజనాలయ్యాయి. బంధువులంతా తిరుపతికి బయలుదేరారు.

“వెళ్ళొస్తాం బావగారూ! ఇప్పటికే ఆలశ్యమైంది" అని, “ఇదిగో చెల్లెమ్మా, ఈ డబ్బుతో చీర కొనుక్కో, హడావుడిలో ఒట్టి చేతులతో వచ్చాం- ఏమీ అనుకోవాకు!" అంటూ ఆమె వద్దంటున్నా వినకుండా చేతిలో కాస్త డబ్బు పెట్టాడు సీతయ్య. ఆవిడ కూడా మర్యాదగా వంగి నమస్కారం పెట్టుకున్నది సీతయ్యకు.

అందరూ లేచి బండ్లు ఎక్కడానికి బయటకెళ్ళారు. అంతవరకూ ఉగ్గబట్టుకుని ఉన్న భార్య "వాళ్ళెవరండీ అసలు?! మీకెలా చుట్టాలు?! ఎప్పుడూ రాలేదే?!” అని అడిగింది. “నాకేం తెలుసూ?! నేనింకా మీ తరపు చుట్టాలనుకున్నా! మరి అంత గౌరవంగా పలకరించావే?! ఆగు- కనుక్కుంటా!" అంటూ బండ్ల దగ్గరకి పరిగెత్తాడు ఇంటి యజమాని. అతని వెనకే భార్య కూడా వచ్చింది.

“బావగారూ....ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి- అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది- మీకూ మాకూ అసలు బంధుత్వం ఎలాగ..? అడిగేశాడు సీతయ్యని.

సీతయ్యకేం చెప్పాలో తెలియలేదు. ఇంటి వాళ్ళు తేరుకునేలోగా తాము తిరుపతి వెళ్ళిపోతామనుకున్నాడు- ఇప్పుడు ఇక లాభం లేదు-

చుట్టూ చూశాడు సీతయ్య. ఇంటి ఆవరణలో ఒక రేగుచెట్టు కనిపించింది.

“అదిగో మీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా?” అన్నాడు సీతయ్య.

"అవును, ఉంది..!?" అన్నాడు యజమాని- 'తను అడిగిన ప్రశ్నకీ, రేగుచెట్టుకీ సంబంధం ఏమిటా?!' అనుకుంటూ. “ఇదిగో-

"అస్మాకం బదరీవృక్షః

యుష్మాకం బదరీఫలమ్‌,

బాదరాయణ సంబంధాత్

యూయం యూయం వయం వయమ్‌"- ("మా ఇంట్లో బదరీ(రేగు)వృక్షం ఉంది. మీ ఇంట్లో బదరీ(రేగు) పండు ఉంది. కనుక ఈ రేగు చెట్టు-పండు లాగా మనం ఇద్దరం సన్నిహిత సంబంధం కలవాళ్లం!” )

మరి మా బండి చక్రం కూడా రేగు చెట్టు చెక్కతో చేసిందే! అట్లా మన సంబంధం మరింత గట్టి పడుతున్నది! మనది బాదరాయణ సంబంధం! అర్థమైందిగా?!" అని వివరించి, ఇంకా తేరుకోని ఇంటి యజమాని వీపును ఆప్యాయంగా చరిచి, కౌగలించుకొని నిమిరి, ఇంటావిడతో "వెళ్ళొస్తాను చెల్లెమ్మా, మా ఊరు తప్పకుండా రావాలి. వచ్చి ఓ వారం ఉండి వెళ్ళాలి

మరి!" అని మళ్ళీ ఓసారి చెప్పి, ఎగిరి బండిలో కూర్చున్నాడు సీతయ్య. భార్యాభర్తలిద్దరూ నోళ్ళు వెళ్లబెట్టి చూస్తుండగానే బండ్లు సాగిపోయాయి!