1. గురు నానక్

సిక్ఖుల ప్రధమ గురువు, పదిహేనో శతాబ్దపు అద్భుత ప్రవక్త గురునానక్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్ఖులు కార్తీక పౌర్ణమినాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

"ఈ ప్రపంచంలోని ప్రాణులన్నింటిలో ఒకే పరమాత్మగా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఆ భగవంతుడే సత్యం. సమానత్వం, సంఘీభావం, మంచితనం, నీతివంతమైన జీవితం అనేవి మానవ జీవితానికి నాలుగు మూలస్తంభాలు" అని బోధించారు గురునానక్.

గురునానక్ అనంతరం సిక్ఖు పరంపరకు తొమ్మిది మంది గురువులు ప్రాతినిధ్యం వహించారు. సిక్ఖుల పవిత్ర గ్రంధం 'గురు గ్రంథ సాహిబ్' లో గురునానక్ జీవితంలోని అనేక విశేషాలు లిఖించబడ్డాయి.



2. విశ్వనాథన్ ఆనంద్

1969లో తమిళనాడు రాష్ట్రంలో పుట్టిన విశ్వనాథన్ ఆనంద్ భారతదేశం వెలువరించిన తొలి ప్రపంచ చదరంగ ఛాంపియన్. 2000 సంవత్సరం నుండి 2012వరకు ఐదుసార్లు ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్ 2013లో తొలిసారి, ఈ మధ్యే 2014లో మలిసారి అమెరికా క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
చిన్నతనంనుండే చదరంగంలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన విశ్వనాధన్ ఆనంద్ 2010లో ఒకేసారి 20,486 మందితో చదరంగం ఆడి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2007లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.



3. అంతర్జాతీయ యోగా దినం

భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప విద్యల్లో యోగశాస్త్రం ఒకటి. శతాబ్దాల క్రితం పతంజలి మహర్షి వెలువరించిన యోగ సూత్రాల ఆధారంగా శ్వాసను, శరీరాన్ని, మనసును శుభ్రపరచుకుంటూ ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపే యోగవిద్యకు ఈమధ్యే అంతర్జాతీయంగా గౌరవం లభించింది. 193 దేశాలతో కూడిన ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ జూన్ 21 వ తేదీని 'అంతర్జాతీయ యోగా దినం'గా ప్రకటించింది.

భూమి అక్షం వంగి ఉండటం కారణంగా మనకు అన్ని రోజుల్లోను పగటి కాలం, రాత్రి కాలం ఒకేలాగా ఉండవు. మార్చి 21, సెప్టెంబరు 23 తేదీలలో పగటి కాలం, రాత్రి కాలం ఒకేలాగా ఉంటాయి- ఈ దినాలను 'విషువత్తులు' అని పిలుస్తారు. వీటికి భిన్నంగా, జూన్ 21 వ తేదీన ఉత్తరార్థగోళంలో అతి ఎక్కువ పగటి సమయం ఉంటుంది. ఈ రోజును అంతర్జాతీయ యోగా దినంగా గుర్తించటం ద్వారా యోగ శాస్త్రంతోబాటు మన ప్రాచీన ఖగోళ విజ్ఞానాన్నీ ప్రపంచం గౌరవించినట్లు అవుతున్నది.