రామాపురం చుట్టుప్రక్కల దట్టమైన అడవులున్నాయి. వర్షాలు బాగా కురుస్తాయి. అందుకని ఆ ప్రాంతంలో గొడుగుల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆ సంగతి తెలిసిన రంగనాధం అనే వ్యాపారి పట్టణం వదిలి రామాపురం చేరాడు.






రంగనాధం తెలివిగలవాడు, చురుకైనవాడు, కష్టజీవి, నిజాయితీపరుడు. రకరకాల కొలతలతో, పలు రంగులతో, వివిధ ఆకారాలతో తయారు చేయించే రంగనాధం గొడుగులకు, ఆ గ్రామంలోనేకాదు- చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా, మంచి పేరొచ్చింది. శనివారం సంతలో రంగనాధం గొడుగులు విపరీతంగా అమ్ముడయ్యేవి.





రంగనాధాన్ని చూసి ఆశకొద్దీ అదే వ్యాపారంలోకి దిగాడు సోమశేఖరుడు. తను కూడా గొడుగుల అమ్మకమైతే మొదలు పెట్టాడు గానీ, చౌకరకం గొడుగులు తయారు చేయించేవాడు; తక్కువ ధరకు అమ్మేవాడు. 'ధర తక్కువ కదా' అని ఎవరైనా వాటిని కొన్నారంటే మోసమే- ఆ గొడుగులు నాలుగైదుసార్లు కంటే పని చేసేవి కావు! కొన్ని గొడుగుల గుడ్డ చిరిగిపోయేది; కొన్ని గొడుగులు తెరుచుకొనేవి కాదు!




గొడుగులు కొన్నవాళ్ళు సంతలో అతన్ని నిలదీసేవాళ్ళు. పదిమంది ముందు వాళ్ళు తనని అలా చిన్నబుచ్చటం సోమశేఖరానికి అవమానంగా తోచేది. దాంతో‌ రంగనాధం మీద కోపం పెరిగేది. చివరికి ఎలాగైనా సరే, రంగనాధాన్ని ఊళ్లోంచి తరిమేయాలనుకున్నాడు సోమశేఖరుడు.

ఒక రోజు రంగనాధం పని పడి, పట్టణానికి వెళ్ళాడు. ఆ సంగతి తెలిసిన సోమశేఖరుడు 'ఇదే అదను' అనుకున్నాడు. రాత్రికి రాత్రి రంగనాధం ఇంట్లో జొరబడ్డాడు. అక్కడ మొత్తం వందగొడుగులున్నాయి. ఆ గొడుగులన్నిటికీ కత్తెరతో పెద్ద పెద్ద రంధ్రాలు చేశాడు సోమశేఖరుడు.





తర్వాతి సంతకు ఎప్పటిలాగానే తన గొడుగులు తీసుకువెళ్ళాడు రంగనాధం. గొడుగులు విప్పి చూసిన జనం ఆశ్చర్యపోయారు- అంతా రంధ్రాలే! రామనాధం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయితే చాటుగా నిలబడి చూస్తున్న సోమశేఖరుడు సంతోషం పట్టలేక ఒక్కసారి నవ్వాడు. అది చూడగానే రామనాధానికి అనుమానం వచ్చింది- ఇది అతని పనే అని. వెంటనే గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశాడు.






పంచాయితీలో సోమశేఖరుడిని నిలదీసి అడిగాడు గ్రామ పెద్ద. "నాకేమీ తెలియదు స్వామీ; నా మీద కక్షతో ఈ రంగనాధం అభాండాలు వేస్తున్నాడు స్వామీ" అని మొసలి కన్నీళ్ళు కార్చాడు సోమశేఖరుడు.





"సరే- రంగనాధం! మీ ఇంట్లో ఎన్ని గొడుగులున్నాయి?" అడిగాడు గ్రామపెద్ద. "అయ్యా! అమ్మకానికి నూటయాభై గొడుగులు తయారు చేయించి పెట్టానండయ్యా!" అన్నాడు రంగనాధం సవినయంగా. "కాదు కాదు! ఎన్ని అబద్ధాలు ఆడతాడో చూడండి- ఇతను చేయించింది నూరు గొడుగులే!" అని అరిచి, చటుక్కున తలదించుకున్నాడు సోమశేఖరుడు. పంచా-యతీ పెద్దలంతా నవ్వారు. "గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట- దొరికాడు దొంగ!" అన్నారు.
తప్పు చేసిన సోమశేఖరుడిని మందలిస్తూ, "గొడుగుల మొత్తం వెలను రంగనాధానికి చెల్లించు. బహిరంగంగా క్షమాపణ కోరు!" అని ఆదేశించారు గ్రామ పెద్దలు.