అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా బద్ధకం. తన ఆహారం కూడా తను సంపాదించుకునేది కాదు. ఆ బద్ధకం వల్లనే జిత్తులమారి తనం, దొంగతనం చేయడం, తనది కాని దాని కోసం ఆశ పడటం లాంటి చెడ్డ గుణాలన్నీ వచ్చాయి దానికి.
చెట్టుమీద కూర్చొని కాకి రొట్టె తింటుంటే, ఇది వెళ్ళి కాకిని పాట పాడమని అడిగేది. అమాయకపు కాకి పాట పాడగానే రొట్టె దాని నోట్లో నుండి జారి పడేది; ఇది వెటకారంగా నవ్వుతూ పోయి ఆ రొట్టెను తినేసేది.
అట్లానే ఇది పక్షుల గూళ్ళల్లోని గుడ్లను దొంగతనంగా కాజేసేది; పులికీ, సింహానికీ చెడ్డ మాటలు చెప్తూ అవి తిని వదిలేసిన మాంసం తినేది; ఇట్లా అది మోసంతో రోజులు గడుపుతుండేది.
ఒక రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఎన్ని జిత్తులు వేసినా లాభం లేకపోయింది. దొంగతనం చేయడం కుదరలేదు; కౄర జంతువుల దగ్గర మాంసం దొరకలేదు. దాంతో పాపం, ఆరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలితో కడుపు నకనకలాడ సాగింది దానికి. 'ఏం చేద్దామా' అని ఆలోచిస్తూ అది అడవి అంతా తిరుగుతుండగా దగ్గర్లోనే ఓ పెద్ద చెట్టుకు అల్లుకొని ఉన్న ద్రాక్ష తీగ ఒకటి కనిపించింది దానికి.
ఆ చెట్టు కొమ్మలు కొంచెం క్రిందికి వంగి ఉన్నాయి. కొమ్మల చివరన ద్రాక్షపళ్ల గుత్తులు వ్రేలాడుతున్నాయి. ఆకలితో ఉన్న నక్కకు ద్రాక్షపళ్లను చూడగానే నోరూరింది. అది ఎగిరి పళ్ళను అందుకునేందుకు ప్రయత్నించింది; కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి- దానికి అందలేదు.
తనకు దొరికినదాన్ని దేన్నీ సామాన్యంగా పోనివ్వదు నక్క. అందులోనూ ఇప్పుడు ఆకలిగా కూడా ఉందాయె. అందుకని అది కొంచెంసేపు ఆలోచించి, అటూ ఇటూ చూసింది. ఆ చెట్టుకి అవతలే, కొంచెం దూరంలో ఓ పెద్ద రాళ్ళ గుట్ట కనిపించింది. వెంటనే దానికో ఉపాయం తోచింది.
చాలా శ్రమించి, ఒక్కో రాయినీ తీసుకొచ్చి కొమ్మ క్రింద ఆ రాళ్ళను గుట్టగా పోసింది. అంత పెద్ద రాళ్ళగుట్ట మొత్తాన్నీ మోసుకొచ్చి పోసే సరికి అది బాగా అలిసిపోయింది. దాంతో దానికి మరింత ఆకలి కూడా వేసింది.
అప్పుడింక అది జాగ్రత్తగా రాళ్లగుట్టను ఎక్కి, ద్రాక్ష పళ్ళను అందుకున్నది! దానికి ఎంత సంతోషం వేసిందో చెప్పలేము. అట్లా తన చేతికందిన పళ్లన్నిటినీ గబగబా కోసుకొని, క్రిందకు దిగి, చేతులు కడుక్కొని, ఆ పళ్ళని తిని చూసింది కదా, అవి ఎంత బాగున్నాయో! 'అబ్బ! ఎంత తియ్యగా ఉన్నాయో!' అనిపించింది. అట్లా అది మళ్ళీ మళ్ళీ రాళ్ళగుట్టను ఎక్కింది. మరిన్ని పళ్ళు కోసుకుని తినటం మొదలుపెట్టింది.
అంతలో అక్కడికొక కుందేలు వచ్చింది. "ఏంటి నక్క బావా తింటున్నావు?" అంది, నక్క చేతిలో ఉన్న ద్రాక్ష పళ్ళ వైపు ఆశగా చూస్తూ. 'ద్రాక్షపళ్ళు! ఎంత బాగున్నాయో చూడు! ఆశ్చర్యపోతావు!' అంటూ నక్క కుందేలుకు కొన్ని ద్రాక్ష పళ్ళను పెట్టింది.
వాటిని నోట్లో వేసుకున్న కుందేలు - "అబ్బ, ఛీ! ఎంత పుల్లగా ఉన్నాయో! యాక్..!" అంది వెంటనే వాటిని ఉమ్మేస్తూ.
నక్క ఆశ్చర్యపోయింది. 'నాకు ఇంత తియ్యగా ఉన్న పళ్ళు కుందేలుకి పుల్లగా ఎందుకున్నాయి? ' అని అనుకుంటుండగానే దానికి అర్థం అయింది- 'కష్టపడి పనిచేసి సంపాదించుకున్నది ఏదైనా తియ్యగా, అపురూపంగా ఉంటుంది' అని.
ఇక ఆ రోజు నుండీ అది కష్టపడి పని చేసుకుని, తన ఆహారాన్ని తను సంపాదించుకోవటం మొదలుపెట్టింది. త్వరలోనే దానికున్న చెడ్డ అలవాట్లు మొత్తం మాయమయ్యాయి!