టిల్లు అనే ఒక ఎలుక అందరితోటీ స్నేహ పూర్వకంగా మెలిగేది. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడడం, వాటి అవసరాలు తీర్చడం- లాంటివి చేసేది. దీంతో టిల్లు ఎలుకను అందరూ మెచ్చుకునేవాళ్ళు.
అయితే తోటి ఎలుకలకు ఇది నచ్చేది కాదు. రాను రాను వాటి అయిష్టత ద్వేషంగా మారింది. టిల్లును ఏదైనా ప్రమాదంలో ఇరికించాలనుకున్నాయి. అన్నీ కలిసి ఒక పన్నాగం పన్నాయి..
ఒక రోజున ఒక ఎలుక వచ్చింది టిల్లు దగ్గరికి-"టిల్లూ! నీకు తెలుసా?" అంటూ. "మన జంబుగాడు పిల్లిని చూసి జడుసుకున్నాడట. నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇట్లాగే మరో రెండు రోజులు గడిచాయంటే వాడింక బతకడని వైద్యులు చెప్పారు" అంది పథకంలో భాగంగా.
"అయ్యో! అలాగా!నాకు తెలీనే లేదే! ఇప్పుడెలాగట?! సానుభూతిగా అడిగింది టిల్లు.
"వాడి జ్వరం తగ్గాలంటే ఒక పిల్లి గోరును తెచ్చి వాడి మెడలో కట్టాలట. అంత సాహసం ఎవరు చేస్తారు చెప్పు? పాపం జంబుగాడు- ఇంక బతకడు! వాళ్ల అమ్మా వాళ్ళంతా వాడిమీద ఆశ వదిలేసుకున్నారు" అని దొంగ కన్నీరు కారుస్తూ వెళ్ళిపోయింది ఆ ఎలుక.
టిల్లూ మనసు కొంతసేపు నిశ్చేష్టం అయిపోయింది. తర్వాత తేరుకొని, "నేను చచ్చిపోయినా పర్లేదు- జంబూను మాత్రం బ్రతికించాలి" అనుకున్నది. అనుకొని, పిల్లి గోరు సంపాదించడానికి బయలుదేరింది.
కలుగు బయటనే కనబడింది పిల్లి. పడుకొని నిద్రపోతున్నది గుర్రు గుర్రుమంటూ.
నెమ్మదిగా దాని దగ్గరికి పోయింది టిల్లు. ముందు మెల్లగా దాన్ని నిమిరి చూసింది. పిల్లి కదల్లేదు. టిల్లుకు కొంచెం ధైర్యం వచ్చింది.
నేరుగా పిల్లి పంజా ముందే నిలబడింది. చప్పుడు కాకుండా పిల్లి గోరును కొరకటం మొదలెట్టింది.
నిద్రలో ఉన్న పిల్లికి ఎలుక వాసన వచ్చింది. నోట్లో నీళ్ళూరాయి. పంజా కొంచెం కొంచెం కదిలింది. మెలకువ వచ్చింది-
చటుక్కున కదిలి అదే పంజాతో టిల్లును పట్టేసుకున్నది- "ఎంత సాహసం! ఎంత పొగరు! నేరుగా నా దగ్గరికే వస్తావా? నా పంజానే కొరుకుతావా?" కోపంగా అరిచింది. "నా స్నేహితుడిని బ్రతికించుకోవాలి. అందుకు నీ గోరు కావాలట. అందుకే వచ్చాను నేను. నీ చేతికి దొరికాను కాబట్టి నువ్విప్పుడు నన్ను చంపు- పరవాలేదు- కానీ, నీ గోరును మటుకు నేను చెప్పిన చోట ఉంచు. మా మిత్రుడి ప్రాణాలు కాపాడు" అంటూ ప్రాధేయపడింది టిల్లు.
పిల్లికి ఆశ్చర్యం వేసింది. "ఏంటి కధ?" అని అడిగి తెలుసుకున్నది. అంతా విన్నాక ఆ ఎలుక మంచితనం ఏమిటో అర్థమైంది దానికి. తన గోరుని తనే కొంచెం కొరికి ఇచ్చింది- "ఇది తీసుకొని వెళ్ళిపో! మళ్లీ నా కంట పడకు!" అని హెచ్చరించి వదిలేసింది టిల్లును.
అతి సాహసం చేసి ప్రాణం పోగొట్టుకొని ఉంటుందనుకున్న తోటి ఎలుకలన్నీ పిల్లి గోరుతో తిరిగి వచ్చిన టిల్లును చూసి నోళ్ళు వెళ్ళబెట్టాయి. స్నేహం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే టిల్లును అంతకాలం ఏడ్పించినందుకు సిగ్గుపడ్డాయి.