ప్రొఫెసర్ రవితేజకు, వాళ్ళ అన్న కృష్ణతేజకు కలిపి ఈమధ్యే రసాయన శాస్త్రంలో గోబెల్ ప్రైజు వచ్చింది. కృష్ణతేజ ఎవరికీ అందుబాటులో లేరుగానీ, రవితేజ మటుకు మీడియాకు దొరికారు. "మీకు రసాయన శాస్త్రం అంటే ఇష్టం ఎలా మొదలయింది?" అని ఓ విలేఖరి అడిగితే, ఆయన కళ్ళు అరమూసి, చిరునవ్వు మోముతో, అలనల్లన కదిలే వెంట్రుకలతో, మెలమెల్లని స్వరంతో ఇలా చెప్పారు:
నేను ఇంకా చాలా చిన్న పిల్లవాడిగా ఉన్న రోజులవి. మా అన్న నాకంటే ఐదేళ్ళు పెద్ద. ఒకరోజున నేను, మా అన్నయ్య ఇద్దరం సైన్సు అకాడమీకి వెళ్ళాము. అక్కడ సీసాలనిండా రకరకాల రసాయన పదార్ధాలు పెట్టి ఉన్నాయి. ఆ అకాడమీ ప్రత్యేకత ఏంటంటే, దాన్ని చూసేందుకు వచ్చిన పిల్లలు ఎవరైనా సరే, అక్కడున్న రసాయనాలతో చేతనైన ప్రయోగాలు చేసుకోవచ్చు.
అప్పుడు నేను మా అన్నయ్యకు చెప్పాను- "ఒరే అన్నయ్యా! మనం ఇద్దరం కలిసి ఒక చిన్న రాకెట్టు తయారుచేద్దాంరా" అని. మా అన్నయ్య సరేనని, చుట్టూ వెతికాడు. అక్కడ చెత్త ఎత్తేసేందుకు ఒక అట్టముక్క కనిపించింది; చెత్త బుట్టలో దాదాపు ఐపోయిన ఒక తుమ్మబంక ట్యూబు, ఓ గట్టి పుల్ల, బ్లేడు ముక్క- ఇవన్నీ దొరికాయి. నేను ఎట్లా చేయాలో చెబుతూ ఉంటే, మా అన్న పాపం, శ్రమపడి ఒక రాకెట్టు తయారు చేసాడు.
సరే, ఇక అందులో కూరేందుకు పొడి కావాలి కదా. నేను చుట్టూ చూశాను- హెచ్ సి యల్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, పెట్రోల్, డీజిల్, మాంగనీసు డై ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడు, అమ్మోనియా- ఇట్లా ఏవేవో రసాయనాలున్నాయి. నేను, మా అన్న ఇద్దరం ఒక బీకరు తీసుకొని, అన్ని రసాయనాలనూ ఒక్కో చెంచా మందం అందులో వేసుకుంటూ పోయాం. అన్నీ ఐపోయే సరికి నాకు జోరుగా మూత్రం వచ్చింది- యూరినల్లో ఉండగా మరో ఐడియా కూడా వచ్చింది- ఒక చెంచాడు మూత్రం కూడా తెచ్చి బీకర్లో కలిపాను! ఇట్లా మేం ఇద్దరం మా తెలివితేటల్ని కలుపుకుంటూ పోయాం, చివరికి బీకర్లో నల్లటి బంకలాంటి పదార్థం తయారైంది. దాన్ని రాకెట్టులో నింపితే అందులో కేవలం ఒక్క చెంచాడు మాత్రమే పట్టింది!
అయ్యో, మిగిలిందంతా వృధా అవుతున్నదే అని బాధ పడ్డాడు మా అన్నయ్య. నేను అన్నాను "బాధ పడద్దురా, అన్నయ్యా! మనం కనుక్కున్న ఈ పదార్థం మరెవ్వరూ ఇంతవరకూ కనుక్కోనిది. ఈ రాకెట్టు ఎగిరిందంటే, ఇంకా చాలా రాకెట్లు తయారు చేయాల్సి ఉంటుంది మనం. దానికి ఇది అవసరమేలే" అని ఓదార్చి, రాకెట్టుకు ఒత్తిగా ఓ కాగితం ముక్కను పెట్టి, అంటించాను.
ఇంకేముంది? ఆ రాకెట్టు పేలింది! అక్కడున్న రసాయనాలన్నీ అంటుకున్నై. ఎక్కడెక్కడో ఉన్న సైరన్లన్నీ మోగినై. పోలీసులు, అగ్నిమాపక దళం వాళ్ళూ అందరూ పరుగు పరుగున వచ్చేసి, నేలమీద పడి వణుకుతున్న నన్నూ, మా అన్ననూ ఇద్దర్నీ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు.
ఎవరెవరో శాస్త్రవేత్తలట, నాయకులట- వచ్చి, "ఓరి పిల్లలూ, మీరు పిల్లలు కాదురా! అపర మేధావులు! ఎంతో అద్భుతమైన అణుబాంబును అంత తక్కువ ఖర్చుతో కనిపెట్టారు. మీ కృషివల్ల ఇంక వేరే ఎవ్వరికీ రసాయన శాస్త్రంలో కృషే చెయ్యాల్సిన అవసరం లేకుండా పోయింది. సైన్సు సెంటర్లో రసాయన శాస్త్ర పరిశోధనశాలనే ఎత్తేశారు- నిజానికి మీ కృషి ఎంత గొప్పదంటే, మీరు రాకెట్టు పేల్చాక ఇక ఆ ప్రాంతంలో ఎత్తేసేందుకు వీలుగా ఉండేదంటూ ఏదీ మిగలనే లేదు!" అని మెచ్చుకున్నారు.
మాలాంటి పిల్లల మేధస్సుకి ఆనాడు పెద్దవాళ్ళు ఎంత అసూయ పడ్డారంటే, ప్రపంచంలోని అన్ని ప్రయోగశాలల్లోనూ రసాయనాలను ఇక మళ్ళీ పిల్లలెవ్వరికీ అందనంత ఎత్తులో- తాళాలు వేసిన అలమారల్లో తప్ప పెట్టుకోలేదు!
అట్లా మొదలైంది, రసాయనశాస్త్రంలో మా కృషి. తర్వాత మేం ఇద్దరం బాగా చదువుకొని, శాస్త్రవేత్తలుగా ఉద్యోగాలు సంపాదించుకొని, ప్రయోగశాలలు సొంతంగా ప్రారంభించి, ఆ మందుగుండు మిశ్రమాన్ని మళ్ళీ తయారు చేసేందుకు నడుం బిగించాం. ఇది నలభై సంవత్సరాల నాటి మాట. అయితే ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ మిశ్రమం మటుకు తయారే అవ్వలేదు! పెద్దయ్యాక మేం చేసిన ఏ మిశ్రమమూ అసలు పేలనే లేదు! ఏం చెయ్యాలి చెప్పండి?-
చివరికి ఇన్నేళ్ళ తర్వాత, మా మిశ్రమాల్లో ఒకటి- పందుల్లో పాల ఉత్పత్తిని విపరీతంగా పెంచుతున్నట్లు కనుగొన్నాక, మాకిద్దరికీ గోబెల్ ప్రైజు ఇచ్చారు. వింత ఏంటంటే, ఆ మిశ్రమం మరే ఇతర జంతువులమీదా కొంచెం కూడా ప్రభావం చూపట్లేదు!
కాబట్టి, నేను చెప్పేదేంటంటే, తప్పులు జరగడం సహజమే. అందుకని అందరం తప్పులు చేస్తూ ఉండాలి. తప్పుని పెద్ద తప్పుగా భావించి ఇంకా తప్పులు చేయకుండా ఉండటం తప్పు. మనం చేయాల్సిందల్లా ప్రతి తప్పు వల్లా కలిగే నష్టాలను అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ పోవటం! ఆ నష్టాల్లోనే మన లాభాలూ దాగి ఉండొచ్చు మరి!
అర్థమైందా? కనుక మీరందరూ పెద్ద పెద్ద తప్పులు చేసి ఒక్కొక్కరూ ఒక్కో గోబెల్ ప్రైజు సంపాదిస్తారని ఆశిస్తూ, సెలవు.