శివపురంలో నివసించే రామయ్య వెదురుని వేణువుగా మలచడంలో బహునేర్పరి. తన కుమారులైన వీరయ్య, సోమయ్యలకి కూడా ఆ విద్యను నేర్పించాడు రామయ్య. కొడుకులిద్దరూ విద్య పట్ల చూపించే శ్రద్ధను చూసి అతను ఎంతగానో మురిసిపోయేవాడు.
కానీ రానురానూ పెద్ద కొడుకు వీరయ్యలో వస్తున్న మార్పుని చూసి అతనికి బాధ మొదలైంది. చిన్నప్పుడు మంచిగానే ఉన్న వీరయ్య, సంపద పెరుగుతున్న కొద్దీ డబ్బు మీద ఆశతో స్వార్థజీవిగా, దురాశాపరుడిగా మారసాగాడు. మొదట్లో వేణువుని చూసిన అతను, ఇప్పుడు వేణువు ద్వారా వచ్చే ధనాన్ని చూస్తున్నాడు. తను తయారు చేసిన వేణువు పలికించే సంగీతం మీది కంటే ఆ వస్తువు పలికే ధరమీదే అతని మనసు ఉండేది.
కొడుకులో వస్తున్న మార్పుని గమనించిన రామయ్య 'అతనిలో మార్పు రావాలంటే మంచి సంస్కారం, గుణం ఉన్న ఉత్తమురాలైన అమ్మాయితో వివాహం జరిపించడమే మార్గం' అని తలచి, జానకితో అతని వివాహం జరిపించాడు. జానకి సహనశీలి, గుణవంతురాలే కాదు, మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి. జానకితో వివాహం జరిగాకైనా వీరయ్యలో మార్పువస్తుందనుకున్న రామయ్యకు నిరాశే మిగిలింది.
అయితే చిన్నకొడుకు సోమయ్య మాత్రం తన శ్రమతోటీ,ఇష్టంతోటీ తండ్రి నేర్పిన విద్యకు మరింత మెరుగుదిద్ది, తండ్రిని మించిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'వేణువు చేస్తే సోమయ్యే చెయ్యాలి ' అని ప్రజలందరూ అతన్ని మెచ్చుకునేవారు.
సోమయ్య మాత్రం ఆ పొగడ్తలేవీ పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకునేవాడు. అయితే కేవలం కళ కోసమే వేణువుని మలిచే సోమయ్య, తన కళ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకోలేకపోయాడు. సంపాదించిన కొంత మొత్తాన్నీ తండ్రికో, అన్నకో ఇచ్చేసేవాడు.
వయసు పైబడుతున్న కొద్దీ రామయ్య చింతకు చిన్న కొడుకు గురించిన చింత కూడా తోడైంది. తాను లేకుంటే పెద్దవాడు వీరయ్య అమాయకుడైన చిన్నకొడుకును మోసం చేస్తాడన్న దిగులుతోటే అతను మంచం పట్టాడు. చివరికి అతను ఒక నిర్ణయానికొచ్చి, కొడుకులిద్దరినీ పిలిచాడు:
"నాయనలారా, నాకు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి. వీరయ్యా, ఇదిగో ఈ బంగారం తీసుకో. నువ్వు దీన్ని వృద్ధిచేయగలవని నాకు తెలుసు. ఇక పోతే సోమయ్యా, నేను వేణువులుగా మలుద్దామని తెప్పించిన వెదురు బొంగులివి. నీకు జీవితంలో బ్రతకడానికి ఏ దారీ లేనప్పుడు వీటిని వేణువులుగా మలిచి సంపాదించుకో. ఇక పోతే, ఈ ఇల్లు- దీన్ని రెండు భాగాలుగా చేసి, సమానంగా పంచుకోండి: కానీ విడిపోకండి. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటామని మాట ఇవ్వండి. అమ్మా జానకీ, వీళ్లిద్దరినీ కలిపిఉంచే భాధ్యత నీదే తల్లీ!" అని చెప్పి కన్ను మూశాడు.
తండ్రి తనకు బంగారం ఇచ్చి, తన తమ్ముడికి వెదురు బొంగులను ఇచ్చినందుకు పెద్దవాడు మొదట సంతోషించినా, ఆ తర్వాత అందులో ఏదైనా మతలబు ఉందేమోనన్న అనుమానం మొదలైంది అతనికి. చివరికి ఒకరోజున తమ్ముడు ఊళ్లో లేని సమయం చూసి, అతని గదిలోకి చొరబడి, వాళ్ల నాన్న ఇచ్చిన వెదురుముక్కల పెట్టెను తీశాడు; అందులోఉన్న వెదురు ముక్కలతోపాటు తమ్ముడు దాచుకున్న చిల్లరనాణేలను కూడా దొంగలించాడు. ఆ వెదురు ముక్కలను చీల్చేసరికి ఆరు వజ్రాలు బయటపడ్డాయి!
తండ్రి తనను మోసగించాడని వీరయ్యకు చాలా కోపం వచ్చింది. తమ్ముడికి వజ్రాలిచ్చి, తనకు బంగారం మాత్రమే ఇవ్వటం మోసమే గద! అందుకని 'ఆ వజ్రాలు తనవే' అన్న నిర్ణయానికి వచ్చాడతను.
అయితే వాటిని దాచుకునేదెలాగ? తాను వేణువుగా మలచబోయే వెదురుముక్కలలో ఒక దానిలో ఆ వజ్రాలను దాచేసి, గుర్తుగా ఉండేట్లు దాన్ని ఒక బట్టతో భద్రంగా చుట్టి పెట్టి, గమ్మున ఊరుకున్నాడు వీరయ్య.
పనినుండి ఇంటికొచ్చిన సోమయ్య తన ఇంట్లో నిజంగానే దొంగలు పడ్డారు అనుకుని బాధ పడ్డాడు. వీరయ్య తనకేమీ తెలియనట్లు ఆశ్చర్యాన్నీ బాధనూ నటించి, చివరికి- "బాధపడకు తమ్ముడూ, పోయింది పెద్ద మొత్తమేమీ కాదు కదా, ఇక వెదురు ముక్కలంటావా, నావి నీవి కాదా?" అని సముదాయించాడు మాట వరసకు.
అయితే ఆ మర్నాడు ఆ ఊరి పూజారి సోమయ్య ఇంటికొచ్చి- "సోమయ్యా, మన గ్రామంలో కృష్ణుని దేవాలయం పూర్తి కావొస్తోంది. విగ్రహం తయారీ కూడా దాదాపు పూర్తయింది. ఇక మిగిలింది ఆ వేణువు మాత్రమే- అతి సుందరమైన వేణువుతో ఆ బాల గోపాలుణ్ణి వేణు గోపాలునిగా మార్చే బాధ్యత నీదే. నువ్వు గుడికి వచ్చి, దైవ సన్నిధిలో ఆ పనిని పూర్తి చేస్తే దేవుడితో పాటు, మేం అందరమూ కూడా సంతోషిస్తాము. మరి త్వరగా రా!" అంటూ వెళ్ళిపోయాడు.
అది విని సోమయ్యకు ఏడుపు వచ్చింది- "చూసావా, వదినా?! నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ దేవుడు నన్ను పిలవలేదు. ఈ రోజున నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఎలా తొందర పెడ్తున్నాడో చూడు. నేను ఏం చెయ్యను? నా దగ్గర ఉన్న వెదురు బొంగులన్నీ దొంగలు ఎత్తుకు పోయారు కదా?!" అని వదిన జానకితో చెప్పుకొని బాధపడ్డాడు.
"నాయనా ! నువ్వేమీ బాధపడకు- నిన్న మీ అన్నగారు ఏమన్నారో మరిచిపోయావా? 'నా దగ్గరున్న వెదుర్లు నీవి' అని చెప్పలేదూ?! ఉండు- నేనిప్పుడే నీక్కావలసిన చక్కని వెదురును నీకు తెచ్చి ఇస్తాను" అని పోయి, వీరయ్య సామాన్లలో వెతికింది. వాటిలో ఒకటి భద్రంగా, మంచి బట్టతో చుట్టి- ఉన్నది. "ఇంత జాగ్రత్తగా దాచారంటే- ఇది మంచి వెదురై ఉంటుంది.
ఇలాంటి వెదురుతో వేణువుని చేసి దేవుడికి ఇస్తే పుణ్యం!' అని జానకి సంతోషంగా దాన్ని తెచ్చి సోమయ్యకిచ్చి, ఆశీర్వదించి పంపింది.
సోమయ్య ఆ వెదురు ముక్కను తీసుకొని నేరుగా గుడికెళ్లి, దేవుడి ముందు కూర్చొని వెదురును మలచడం ప్రారంభించాడు. అంతలోనే అందులోంచి తళతళా మెరుస్తూ, వజ్రాలు రాలి పడ్డాయి!
మొదట ఆశ్యర్యపోయిన సోమయ్య, అటుపైన ఆ వజ్రాలను జాగ్రత్తగా తీసి దాచి, తిరిగి వేణువుని చెయ్యడంలో నిమగ్నమయ్యాడు. తాను పూర్తి చేసిన చక్కని వేణువును పూజారిగారి చేతిలో పెట్టాడు. పూజారి అతని పనితనాన్నీ, కళపై అతనికున్న ప్రేమనూ మెచ్చుకుని, అతనికి కొన్ని వెండి నాణేలను కానుకగా ఇచ్చి పంపాడు.
ఆలోగా పక్కగ్రామానికి పనిపడి వెళ్లిన వీరయ్య ఇంటికి తిరిగొచ్చి భార్య మీద అంతెత్తున ఎగిరాడు- "అందులో ఏమున్నాయో తెలుసా?" అని అరుస్తూ.
అంతలోనే అక్కడికి చేరుకున్న సోమయ్య, తన అంగీలోంచి వజ్రాలను తీసి అన్నకిస్తూ "అన్నా, ఇవిగో నీ వజ్రాలు. నువ్వు వీటిని ఆ వెదురులో దాచావని తెలియక, వదినమ్మ దాన్ని నాకు ఇచ్చింది- ఇవిగో, ఇవేమో పూజారిగారు ఇచ్చిన వెండి నాణేలు!" అంటూ వజ్రాలతోపాటు, వెండినాణేలను కూడా వీరయ్యచేతిలో పెట్టాడు అమాయకంగా.
తమ్ముడి నిజాయితీనీ, మంచితనాన్నీ, అమాయకత్వాన్నీ చూసిన వీరయ్యలో పశ్చాత్తాపం కలిగింది. తమ్ముడిని మోసం చేసినందుకు బాధ మొదలయింది. భార్య చూపించినంత వాత్సల్యాన్ని కూడా తాను తన తమ్ముడిపై చూపించలేకపోయినందుకు సిగ్గుపడ్డాడతను. వెంటనే ఆ వజ్రాలనూ, వెండి నాణేలనూ తమ్ముడి చేతిలో పెట్టి- "తమ్ముడూ, నన్ను క్షమించు. ఇవన్నీ నీవే" అన్నాడు ప్రేమగా.
భర్త ఏం చేశాడో చూసిన జానకి, అతనిలో వచ్చిన మార్పుకు సంతోషించింది. అటుపైన అన్నా తమ్ముళ్లిద్దరూ కలసి మెలసి సంతోషంగా జీవించారు.