హిమాలయాల క్రింది భాగంలోనే, అడవికి దగ్గర్లో చిన్న ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంట్లో నివసించే సుమిత్ర, మోహన్ ఇద్దరూ చాలా మంచివాళ్ళు. ఇద్దరూ ముసలివాళ్లయితే అయ్యారుగానీ, పిల్లలు లేకపోవటంతో, 'రంగ రంగా' అని, ఇంట్లో వాళ్ళిద్దరే ఉండేవాళ్లు. వాళ్లను చూసినవాళ్ళంతా తప్పక గుర్తించే సంగతి ఒకటుంది- సుమిత్ర చాలా- చాలా- చాలా లావుగా ఉండేది; మోహన్ చాలా- చాలా- చాలా బక్కగా ఉండేవాడు. ఏమంటే సుమిత్ర మామూలుకంటే మూడింతల ఆహారం తినేది. మోహన్‌కు మామూలు ఆహారంలో మూడోవంతే దొరికేది. "ఎందుకోనండీ! చిన్నప్పటినుండీ నాకు మూడింతల ఆకలి!" అనేది సుమిత్ర, మరో రొట్టెకు దట్టంగా వెన్నె రాసుకుంటూ. మోహన్ మాత్రం ఏమీ బదులిచ్చేవాడు కాదు- ఎప్పుడూ "నాకు ఇంకా ఇంత ఆహారం ఎట్లా దొరుకుతుందా" అని వెతుక్కోవటంలోనే అతని బతుకు తెల్లారుతుండేది మరి.

అట్లా అర్థాకలితో ఉండీ ఉం డీ చివరికి మోహన్‌కి ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. ఆ రోజు అడవిలోంచి వస్తూ వస్తూ ఒక రంగురంగుల పిట్టను పట్టుకొచ్చాడు ఇంటికి- "సుమిత్రా! సుమిత్రా! చూడు, నేనేం తీసుకొచ్చానో !" అరిచాడు బయటినుండే. ఉత్సాహంగా పరుగెత్తుకొచ్చిన సుమిత్ర మోహన్ చేతిలో ఉన్న పిట్టను చూడగానే నిరాశగా మొహం పెట్టింది.

"ఇంత చిన్న పిట్టకే అంతలేసి అరుపా? దీన్ని వండితే మనిద్దరికీ ఓ పంటికిందికి కూడా రాదు! హు" అని మొహం మిటకరించుకుంటూ వెనుదిరిగిందిఆమె!

"హేయ్! ఓయ్! దగ్గరగా చూడు సుమిత్రా! నీకు అర్థం కాలేదల్లే ఉంది- ఇది ఓ అద్భుతమైన పక్షి- బంగారు గుడ్లు పెడుతుంది! త్వరలో మనం ధనవంతులం కాబోతున్నాం!" ఉత్సాహంగా ఆమెను పట్టుకుని గిరగిరా తిప్పాడు మోహన్.

"బంగారు గుడ్లా!?" ఆశ్యర్యంతో సుమిత్ర కళ్లు పెద్దవయ్యాయి.

"అవునోయ్! నిజం బంగారు గుడ్లు! ఏమంటే ముందుగా మనం దీనికి చాలా గొప్ప ఆహారం పెట్టాల్సి ఉంటూంది. అంత మంచి ఆహారం పెట్టలేని పక్షంలో అసలిప్పుడే దీన్ని అమ్మేస్తే మేలు!" అన్నాడు మోహన్ పక్షిని ప్రేమగా నిమురుతూ.

"లేదులే, అట్లా ఎందుకు అనుకోవాలి?! దీన్ని మనమే పెంచుదాం! మంచి మంచి ఆహారం మనం మాత్రం ఎందుకు పెట్టలేం దానికి?" అన్నది సుమిత్ర, దాన్ని నిమిరేందుకు తనూ చెయ్యి చాపుతూ.

"మనం దీన్ని అమ్మకూడదు. మన అదృష్టమే ఈ రూపంలో మనింటికి వచ్చింది- దాన్ని మనం కాలదన్నుకునేది ఎందుకు? ఆగండి- నేను క్షణాల్లో వంట చేసి తెస్తాను. వేడి వేడిగా పూరీలూ, పాలూ, రొట్టెలూ, పాయసం... ఎంతసేపు పని?!" అంటూ గబగబా వంట మొదలు పెట్టేందుకు వంట ఇంట్లోకి పరుగు పెట్టింది సుమిత్ర.

"పక్షిని ఇంట్లో పెట్టుకోకూడదు" అంటూ ఇంటికి ఎదురుగా ఉన్న రావిచెట్టువైపుకు దారి తీశాడు మోహన్. ఆ రావిచెట్టుకో పెద్ద తొర్ర ఉన్నది. అందులో ఉంచితే పిట్ట భద్రంగా ఉంటుంది. "ఈ పిట్టలు గుడ్లు పెట్టే ముందు కనీసం రెండు నెలలైనా నర పురుగు కంట పడకూడదు. మనమూ నర పురుగుల-మేగా?!" అంటూ పిట్టను ఆ గూట్లో పెట్టాడు. "నువ్వు రోజూ దీనికి ఏం పెడతావో నీ ఇష్టం- రెండు నెలలపాటు ఈ పక్షి ఎవరి కంటా పడకుండా చూసుకునే బాధ్యత నీదే! కొన్నాళ్ళ తర్వాత ఈ పక్షి బంగారు గుడ్లు పెడుతుంది. అప్పటివరకూ మనం ఆ తొర్రలోకి తొంగి కూడా చూసేందుకు వీలవ్వదు-" అని చెప్పాడు మోహన్.

ఆనాటినుండీ సుమిత్ర రోజూ రకరకాల రుచికరమైన పిండి వంటలు చెయ్యడం మొదలుపెట్టింది. పూరీలూ, పాయసం, పెరుగూ, పళ్లు- అన్నింటినీ వేటికవి వేరు వేరుగా ఓ బుట్టలో సర్ది, దాన్ని చెట్టు తొర్రలో వదిలి వస్తోంది. ఓ గంట తర్వాత వెళ్ళి చూస్తే ఖాళీ తట్ట ఉండేది అక్కడ. ఏ రోజైనా, పక్షి ఎంత ఎక్కువ అహారం తింటే సుమిత్రకు అంత ఎక్కువ సంతోషం కలిగేది- ఆ పిట్ట ఎన్నెన్ని బంగారుగుడ్లు పెట్టనున్నదో తలచుకొని తలచుకొని మురిసిపోయేదామె.

కాలం గడిచేకొద్దీ మోహన్ లావెక్కడం మొదలుపెట్టాడు. అయితే సుమిత్ర పక్షి కోసం రోజూ ఎంతెంత ఆహారాన్ని పొదుపు చేస్తోందంటే, ఆమె ఇప్పుడు బాగా చిక్కిపోయింది. ఒకటి- రెండు నెలలు గడిచేసరికి ఆమె తన భర్త లావెక్కటాన్ని గమనించింది; కొంచెం కొంచెంగా అనుమానించటం మొదలెట్టింది-

చివరికి ఇక తట్టుకోలేక, ఒక రోజున పక్షికోసం బుట్టనిండుగా అహారాన్ని తెచ్చి ఇచ్చాక, తొర్ర బయట దగ్గర్లోని ఓ పెద్ద బండరాయి వెనుక నక్కి కూర్చున్నది ఆమె. పది నిముషాల సమయం గడిచిందో లేదో- మోహన్ తొర్ర దగ్గర ప్రత్యక్షం అయ్యాడు- తొర్రలోంచి బుట్టను బయటికి తీసి, అందులోని ఆహారాన్ని ఆచిగా మెక్కటం మొదలుపెట్టాడు!

సుమిత్ర నిర్ఘాంత పోయింది! తన కళ్ళని తానే నమ్మలేకపోయింది! తను మోసపోయిన సంగతి ఆమెకు ఆ క్షణంలోనే అర్థమైపోయింది. బంగారు గుడ్లు అంటూ లేవు- అవి తనకు ఏనాడూ దొరకవు! మర్నాటినుండీ సుమిత్ర తొర్ర దగ్గర ఆహారం పెట్టడం మానేసింది. విచిత్రం, మోహన్ కూడా ఆమెను ఏమీ అడగలేదు- ఎందుకంటే ఆనాటినుండే భోజనాలప్పుడు ఇద్దరికీ సమాన వాటాలు దొరుకుతున్నాయి మరి! చూస్తూండగానే ఇద్దరూ సమానంగా లావెక్కారు. 'చూడముచ్చటైన బొద్దు జంట" అని పేరుతెచ్చుకున్నారు!