అది సాయంకాల సమయం. మణిపురం గ్రామం గుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక స్వామీజీ. దూరంగా ఒంటెద్దు బండి మీద బస్తాలు పెట్టుకొని, బండిని జోరుగా లాగడం లేదని ఎద్దును కొడుతున్నాడు ఒక రైతు. స్వామీజీ పరుగుపరుగున వెళ్ళారక్కడకి- "ఎందుకు నాయనా అట్లా కొడుతున్నావు ఆ మూగజీవిని?" అడిగారు ఆ రైతును.

"ఏం చెప్పను స్వామీ! చీకటి పడకముందే ఊరు చేరుకోవాలి. ఇదేమో బండిని జోరుగా లాగడంలేదు. ఊరెలా చేరుకోగలను?" అన్నాడు ఆ రైతు బాధగా.

"బండిపైన అన్ని బస్తాలు బరువు పెడితే, పాపం ఆ జీవి ఎలా లాగగలదు? కొంచెం బరువు తగ్గించాల్సింది!" అన్నారు ఆయన, ఎద్దువైపు జాలిగా చూస్తూ.

"కొన్ని బస్తాలు తగ్గిస్తే ఎక్కడ పెట్టాలి స్వామీ? ఈ ఊళ్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా ఇన్ని సార్లు తిరగాలంటే కష్టం కదా!" అన్నాడు రైతు, నిస్సహాయంగా.

"సరేలే! మరి నువ్వు బండిని నడుపు; నేను గట్టిగా వెనక నుండి తోస్తుంటాను" అని, ఒంటి పైన కప్పుకున్న గుడ్డను నడుముకు గట్టిగా బిగించి కట్టుకున్నారు స్వామీజీ.

"తప్పు స్వామీ! నేను మీతో పని చేయించు-కుంటానా?" అన్నాడు రైతు, స్వామీజీ కాళ్ళమీద పడుతూ.

"నాయనా! నేను నీకు పనిచేయడంలేదు. ఆ మూగజీవికి తోడ్పడుతున్నాను. నువ్వు ఆలోచించవద్దు- కదులు- సమయం దాటిపోతున్నది" అని వెనకనుండి బండిని బలంగా నెట్టడం ప్రారంభించారు స్వాములవారు.

రెండు గంటల తర్వాత రైతు ఇంటికి చేరుకున్నారు వాళ్ళు.

స్వామీజీని చూసిన రైతు భార్య కంగారు పడింది- "ఏందయ్యా స్వామీజీతో బండి నెట్టించావు. మనకు పాపం చుట్టుకుంటుంది!" అంది భయంగా.

"నేను అదే చెప్పానే! అయినా స్వామీజీ వినలేదు. ఇవాళ్ల స్వాముల వారు మనింట్లోనే ఉంటారు. మంచి భోజనం తయారు చెయ్యి" అంటూ స్వామీజీకి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు రైతు. అతని భార్య నులకమంచంపైన మంచి దుప్పటి వేసి, లోటాతో మంచి నీళ్ళిచ్చింది. "అమ్మా! నాకు భోజనం వద్దు- ఏదైనా పండు ఉంటే ఇవ్వు" అన్నారు స్వామీజీ, ఆమెతో. పండ్లు తిని, ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున మరో ఊరికి ప్రయాణం అయ్యారు.

మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన ఒక ఇంటిముందుకు వచ్చారు. ఆ ఇంటావిడ తన ఏడేళ్ళ కూతురును కొడుతూ కనిపించింది.

"అమ్మా ! పసిబిడ్డను ఎందుకలా కొడుతు-న్నావు?"అంటూ ఆమె చేతిలో నుండి కర్రను తీసుకున్నారు స్వాములవారు.

"స్వామీ ఏం చెప్పను? రోజంతా వళ్ళు విరగ్గొట్టుకుంటే యాభై రూపాయలొస్తాయి. దీన్ని బియ్యం, పప్పు, నూనె తీసుకురమ్మంటే, వస్తూ వస్తూనే నూనె బుడ్డి పడేసింది. నూనె అంతా ఒలికిపోయింది. సాయంత్రానికి కూర ఎలా వండేది? నా దగ్గర డబ్బులు కూడా లేవు!" మళ్ళీ ఓసారి ఆ పాపను కసిరింది, కోపాన్ని అణుచుకోలేక.

"అమ్మా! ఈమెను కొట్టడం వల్ల ఒలికి పోయిన నూనె తిరిగి వస్తుందా?" అడిగారు స్వామీజీ.

"రాదు స్వామీ. కానీ 'కూరెలావండాలి; పిల్లలకు ఏం పెట్టాలి' అన్నదే నా బాధ. ఇది నూనె ఒలికించకుంటే ఈ బాధ ఉండేది కాదు కదా!" అని ఆ పిల్ల జుట్టు పట్టుకొని లాగిందావిడ, పళ్ళు నూరుతూ.

"కోప్పడకు తల్లీ, పసి పిల్ల మీద కోపం మంచిది కాదు" అని చెబుతూ స్వామీజీ ఆ పాప తల నిమిరారు. "పాపా! మనం చేసే పనిమీద దృష్టి పెట్టాలి. అజాగ్రత్త వల్ల నష్టాలు ఎక్కువ. ఇక మీద జాగ్రత్తగా ఉండు" అని చెప్పారు ప్రేమతో.

ఆ రాత్రికి ఆ ఊళ్లో గడిపి, మరునాడు ఇంకో ఊరికి బయలుదేరారు స్వామీజీ.

అలా నడుచుకుంటూ ఊరి చివరనున్న ఓ చెట్టుకింద సేద తీరుదామని ఆగారు. అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు- ఒక తొండ తోకకు దారం కట్టి, అది పారిపోకుండా లాగుతూ, చిన్న చిన్న రాళ్లతో కొడుతున్నారు. అది బాధతో అటూ ఇటూ పరుగెత్తుతూ, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. పిల్లలంతా అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు.

"పిల్లలూ! ఇలారండి" పిలిచారు స్వామీజీ పిల్లలంతా స్వామీజీ దగ్గరకు వచ్చారు.

"చూడండి, ఈ తొండకుప్రాణం ఉన్నదికదా! మీరు దాన్ని కొడుతుంటే దానికి దెబ్బ తగలదా? మిమ్మల్ని ఎవరైనా కొడితే మీకు దెబ్బ తగులుతుంది కదా? అలాగే దానికి కూడానూ. అందుకనీ దాన్ని బాధించకుండా వదిలిపెట్టండి" అన్నారు మృదువుగా వాళ్లకు నచ్చజెబుతూ.

పిల్లలు ఎప్పటినుండి ఆడుతున్నారో- ఆ ఆటమీద విసుగొచ్చి ఉంటుంది; అందుకనే స్వామీజీ చెప్పిన వెంటనే దాన్ని వదిలేశారు. బ్రతుకుజీవుడా అని పారిపోయి చెట్టెక్కేసిందది.

స్వాములవారు మళ్ళీ తన పాదయాత్ర మొదలు పెట్టారు.

ఆ సమయంలో జంబుకవర్ధనుడనే నక్క ఒకటి, స్వాముల వారిని దాటి ముందుకెళ్ళి, ఆయన్ని ఆపింది. అడవిలోని జంతువులన్నీ ఒకదానినొకటి చంపుకు తినడం చూసీ చూసీ - విసుగొచ్చింది దానికి. తన మనసు మార్చుకొని, ఎవరైనా స్వామి దగ్గర శిష్యరికం చేస్తూ సాధుజీవితం గడపాలని తిరుగుతూ, కొన్నాళ్ల క్రితం అది స్వామీజీని చూసింది. అప్పటినుండీ ఆయన్ని వెంబడిస్తూ అది అయన వెనకాలే ఊరూరూ తిరిగింది. ఊళ్లన్నిటిలోనూ స్వామీజీ చేసిన మంచి పనులను చూసిందది. మూగ ప్రాణులకు బాధ కలగకూదదన్న స్వామీజీ సిద్ధాంతాన్ని చూసి అది పులకరించి పోయింది.

స్వామీజీ దగ్గరకెళ్లి, అది "స్వామీ, నా పేరు జంబుకవర్ధనుడు.. నేను మధురాపురం దగ్గరున్న అడవిలో తిరిగేవాణ్ణి. అక్కడి జీవహింస చూసి విసుగెత్తి పోయాను. సాధు జీవితం గడపాలని వస్తుంటే మీరు కనబడ్డారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంబడిస్తూ ఊళ్లన్నీ తిరిగాను. మీ జంతు ప్రేమను చూసి పునీతుడనయ్యాను. దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి" అంటూ స్వామీజీ కాళ్ళ మీద పడ్డది.

"జంబుకవర్థనా! సాధు జీవనం గడపటం ఏమంత సులభం కాదు. నువ్వు మాంసాహారివి. మీ అడవికి వెళ్ళు. వెళ్ళి మంచి జీవితం గడుపు, చాలు" అన్నారు స్వామీజీ.

"లేదు స్వామీ! నేను మీ చెంతనే ఉండి, మీతోనే జీవిస్తాను" అంటూ ప్రాధేయపడ్డది, నక్క. స్వామీజీ మనసులోనే నవ్వుకున్నారు. "సరే! నీ యిష్టం!" అని నక్కను తన శిష్యునిగా స్వీకరించారు.

అలా కొంతకాలం గడిచింది. ఆకులు అలములు తినడం నక్కకు కష్టంగా ఉన్నది. అయినా ఎలాగో ఒకలాగా అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నదది.

ఒకరోజు స్వామీజీ ఒక అడవిగుండా వెళుతున్నారు- నక్క కూడా ఆయనను అనుసరిస్తున్నది- అక్కడ ఒక కొలనులో కొన్ని కొంగలు జపం చేసుకుంటూ, దొరికిన చేపలను ముక్కుతో పట్టుకొని మింగుతూ కనపడ్డాయి. నక్క స్వామీజీ వైపు చూసింది. ఆయన అదేమీ పట్టనట్లు నడుస్తున్నారు.

నక్క ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే కొలను దగ్గరకు వెళ్ళి "కొంగ బావలూ! అలా చేపలను చంపడం పాపం!" అంది. కొంగలు దాన్ని చూసి నవ్వాయి. నక్క మూతి ముడుచుకొని వచ్చేసింది.

ఇంకోరోజున స్వామీజీ ఎదురుగానే ఒక పాము కప్పను మింగడం కనబడింది నక్కకు. అప్పుడు కూడా స్వామీజీ పామును ఏమీ అనలేదు. నక్కకు కోపం వచ్చింది. పాము దగ్గరికి వెళ్ళి- "ఇదిగో! కప్పను మింగి జీవహింస చేయకూడదు!"అంది కోపంగా.

పాము దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. "నువ్వు నక్కవు కదా, జీవహింస చేయవా?" అని నవ్వుకుంటూ తన రంధ్రంలోకి దూరింది.

మరోసారి ఒక గద్ద రయ్యిన వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోవడం చూసి, దాని వెంటే పరుగెత్తుతూ "గద్దా! కోడిపిల్లను వదిలిపెట్టు. పాపం, దానికి బాధ కలుగుతుంది" అని అరిచింది నక్క. గద్ద ఏదో చెప్పాలనుకున్నది- అయినా నోట్లో కోడిపిల్ల ఉంది కనుక మాట్లాడకుండానే ఎగిరిపోయింది. అక్కడే ఉన్న స్వామీజీ మటుకు నక్కను చూసి చిరునవ్వు నవ్వారు.

నక్క ఇంక భరించలేకపోయింది. ఎలాగైనా స్వామీజీని నిలదీయాలనుకొని- "స్వామీ! మీరు ఎంతో మంచివారని నేను మిమ్మల్ని వెంబడించాను. కాని మీ అసలు రూపం నాకిప్పుడు తెలిసింది. మీకు కొందరంటే ఇష్టం, మరి కొందరంటే ఇష్టం లేదు. అందుకే ఎద్దునూ, పిల్లనూ, తొండనూ వాటిని బాధించే వాళ్ళనుండి రక్షించారు.

మరి ఇక్కడ చేపలు, కప్పలు, కోడి పిల్లలంటే మీకు ఇష్టంలేదు. అందుకని, అవి మరణిస్తున్నా కూడా మీరు పట్టించుకోలేదు. మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకోవడం నిజంగా నా తెలివితక్కువతనం" అంటూ చెంపలు వేసుకున్నది నక్క. అయినా స్వామీజీ ఏమీ మాట్లాడలేదు.

చాలాకాలంగా తన కళ్లముందే ఎలుకలూ, పక్షి పిల్లలూ, కోడిపుంజులూ కనబడుతున్నా, వాటిని గబుక్కున మింగెయ్యాలనే కోరికను బలవంతంగా అణచుకుంటూ వస్తున్నది గదా, నక్క?! రోజూ దుంపలూ, ఆకులూ తినాలంటే దానికి బాధగానే ఉంది. చాలా నీరసపడింది కూడా. అప్పుడప్పుడూ నిద్రలో తనకు ఇష్టమైన కోడి పిల్లనో, కుందేలునో తింటున్నట్లు కలలు కూడా రావటం మొదలైంది దానికి. నక్కలో వస్తున్న మార్పును స్వామీజీ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతో కాలం అది దాని సహజ గుణాన్ని దాచుకోలేదనుకున్నారు- అయినా నక్కను ఏమీ‌ అనలేదు ఆయన.

ఒకసారి వాళ్ళిద్దరూ ఒక ఊళ్ళోకి వచ్చారు. ఆ ఊళ్ళో చాలా కోళ్ళ ఫారాలున్నాయి. ఆ ఊరికి వచ్చేసరికి స్వామీజీ ఆరోగ్యం మందగించి, ఆయన అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. కోళ్ళ ఫారాల నిండుగా ఉన్న కోళ్ళను రోజూ చూస్తుండేసరికి నక్క కోరికలు రెక్కలు విప్పాయి. దాని నిగ్రహం పరుగులు పెట్టసాగింది. రెండురోజులు అతి కష్టం మీద గడిచాయి.. మూడో రోజున అది మెల్లగా ఒక కోళ్ళఫారంలోకి దూరి పుంజును పట్టుకొని తిన్నది. నాలుగో రోజున రెండు. ఐదో రోజున మూడు..

అలా కోళ్ళు మాయం అవ్వటం చూసి కోళ్ళఫారం వాళ్ళు కాపు కాశారు. ఆ రాత్రి నక్క నెమ్మదిగా సందు చేసుకొని కోళ్ళఫారంలోకి దూరి ఒక కోడిని పట్టుకోగానే, మాటు వేసి ఉన్న పనివాడు దుడ్డు కర్రతో ఒక్కటి ఇచ్చుకున్నాడు. దెబ్బకు దిమ్మ తిరిగి కిందపడింది నక్క.

స్వామీజీ వెంట వచ్చిందని తెలుసు గనక, దాన్ని స్వామీజీ దగ్గరకు తీసుకెళ్ళారు వాళ్ళు. కొద్దిసేపటికి కళ్ళు తెరచిన నక్క స్వామీజీని చూసి తలదించుకుంది.

"జంబుకవర్థనా! నువ్వు చూస్తూండగా నేను రక్షించిన ఎద్దు, పాప, తొండ అనవసరంగా మానవుల చేత బాధించబడ్డవి. ఇక నువ్వు చూసిన చేపలు, కప్ప, కోడిపిల్ల అవసరం కొద్దీ వేరే జంతువులకు ఆహారమైనవి. ఎద్దులను, పిల్లలను, తొండలను హింసించకుండా మానవులు జీవించగలరు. కానీ మాంసాహారాన్ని వదిలి కొంగలు, పాములు, గ్రద్దలు బ్రతకలేవు. అది వాటికి సహజమూ, సాత్మ్యమూ అయిన ఆహారం. చక్కగా జీవించే క్రమంలో ఏ ప్రాణీ తన సహజత్వాన్ని కోల్పోనవసరం లేదు- నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాను- సహజంగా మాంసాహారివి అయిన నువ్వు ఆకులు, అలములు, దుంపలు తినలేవని. ప్రతి ప్రాణీ తనకు సహజమైన ఆహారాన్నే తినాలి- అది జీవహింసకాదు- అలా తినకపోవటమే అసహజం అవుతుంది. ఇప్పటికైనా నువ్వు నీ అడవికి తిరిగి పో! నీకు నచ్చిన ఆహారం తింటూ సహజంగా జీవించేందుకు ప్రయత్నించు" అని చెప్పారు స్వామీజీ.

జంబుకవర్థనుడికి జ్ఞానోదయమైంది. సిగ్గు పడుతూ తన అడవికి వెళ్ళిపోయింది.