కృష్ణాపురంలో ఉండే మంగయ్య భలే మాటకారి. తన మాటలతో ఎదుటివాళ్లను తికమక పెట్టి, వాళ్ళు బిత్తరపోతే ఆనందించటం అతనికి ఇష్టం. అతని సంగతి తెలిసిన వాళ్ళు వీలైనంత వరకూ అతని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు.

అయితే కొత్తగా ఊరికి వచ్చిన శేషయ్యకు ఈ సంగతి తెలీదు. మంగయ్య తనను రోజూ పలకరిస్తుంటే తనూ పలకరింపుగా నవ్వేవాడు. ఒకసారి శేషయ్యకు కొంత డబ్బు అవసరం పడి, మంగయ్యను అప్పడిగాడు: "మంగయ్యగారు, చాలా అవసరంలో ఉన్నాను. డబ్బు అప్పుగా ఇస్తే నెలరోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను" అని.

"నా దగ్గర డబ్బు లేదు. వేరే ఎవరినైనా అడుగు" అన్నాడు మంగయ్య క్లుప్తంగా.

శేషయ్య సరేనని వెళ్లిపోతుండగా మంగయ్య అతన్ని వెనక్కి పిలిచాడు: "నీకు బొత్తిగా కృతజ్ఞత లేదు శేషయ్యా!" అంటూ.

"అదేంటయ్యా! తమరు నాకు డబ్బు అప్పుగా ఇవ్వనే లేదు కదా, మరి కృతజ్ఞత ఎందుకు?" అని అడిగాడు శేషయ్య ఆశ్చర్యపోతూ.

"ఓరి వెర్రివాడా! నేను నీకు చేసిన మేలు గుర్తించనే లేదు కదా! నేను నిన్ను 'రేపు రా-మాపు రా' అని నా చుట్టూ రోజూ త్రిప్పుకొని ఉండవచ్చు. ఒకవేళ నువ్వు నీ ఆత్రం కొద్దీ వచ్చావే అనుకో, 'వారం తర్వాత రా- పదిరోజుల తర్వాత రా' అని మళ్ళీ మళ్ళీ రమ్మని ఉండచ్చు. నేను అట్లా చేసి ఉంటే నీ సమయం ఎంత వృధా అయ్యేదో ఆలోచించావా? నీ కెంత బాధ కలిగేదో, ఎంత కోపం వచ్చేదో ఆలోచించావా? అట్లా రోజూ నా చుట్టూ తిరిగి తిరిగి ఇక నీకు వేరే వాళ్లను అప్పు అడిగే అవకాశం కూడా ఉండేది కాదు! అటు నీకు అప్పూ దొరికేది కాదు; ఇటు సమయమూ పోయేది! ఇప్పటికైనా అర్థమైందా, నీకు ఎంత మేలు చేశానో?! మరి నాకు కృతజ్ఞతలు చెప్పవా?" అన్నాడు మంగయ్య చిరునవ్వుతో.

శేషయ్య బిత్తరపోయి సణుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇల్లు చేరినా అతని వాలకం మారలేదు- అంత గందరగోళ-పడిపోయాడన్నమాట.

శేషయ్య కొడుకు ఫణి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. ఫణి యువకుడూ, ఉత్సాహవంతుడున్నూ. 'ఓహో! మంగయ్య పని ఇలా ఉందా! ఇప్పుడు అతనే బిత్తరపోయేట్లు చేయటం నా పని!" అనుకున్నాడు.

ఒక మూడు-నాలుగు రోజుల తర్వాత ఫణి మంగయ్య ఇంటి ముందుగా వెళ్ళాడు. మంగయ్య అతడిని పట్టించుకోలేదు. మంగయ్యని దాటి ముందుకెళ్ళిన ఫణి వెనక్కి తిరిగొచ్చి, మంగయ్యతో "మరి నాకు కృతజ్ఞతలు చెప్పరా, మంగయ్య గారూ?!" అని అడిగాడు వెటకారంగా.

మంగయ్య బిత్తరపోయి 'ఎందుకు చెప్పాలి?' అన్నాడు.

అందుకు ఫణి- "నేను మిమ్మల్ని అప్పు అడగకుండా వెళ్ళిపోతున్నందుకు! ఒకవేళ నేను మిమ్మల్ని అప్పు అడిగానే అనుకోండి, మీరు అప్పుడు నాకు అప్పు ఇవ్వకుండా లేదని చెప్పేవాళ్ళు. అట్లా నాకు ఎంతో మేలు చేసేవాళ్ళు! అట్లా నాకు ఒక గంట సేపు మేలు చేసీ చేసీ, మీరు మాత్రం అలసిపోయేవాళ్ళు! మీ గొంతు నొప్పి పుట్టేది; మళ్ళీ ఆసుపత్రి ఖర్చులు, మందులు- ఎంత సమయం వృధా, ఎంత డబ్బు వృధా అయ్యేది?! ఇప్పుడు నేను అవన్నీ మిగిల్చాను కదా, మరి నాకు కృతజ్ఞతలు చెప్పరా?" అన్నాడు.

మాటకారి మంగయ్య నోట మాట రాలేదు.

ఇతరులకు మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది!