నరేషూ, సురేషూ, లక్ష్మి, కళ, సుధ, మహేశ్, కార్తీక్, పండు, జ్యోత్స్న- అందరూ కలిసారు ఓ ఎండ పొద్దున.

"ఒరేయ్, అందరం ఇవాళ్ళ ఏదైనా సాహస కార్యం చేద్దాంరా!" అన్నాడు కార్తీక్.

"సాహస కార్యాలు చెయ్యాలంటే గుహలు, పాడుబడ్డ కోటలు, దొంగలు, దయ్యాలు- ఇవన్నీ ఉండాలిరా, మన ఊళ్ళో ఏమున్నై?" విచారంగా అన్నది సుధ.

"అవి లేకపోయినా సాహసాలు చెయ్యచ్చు. ఉదాహరణకు, మన ఊరవతల మామిడి తోట ఉంది కదా, దానిలోంచి తలా నాలుగు మామిడి కాయలు కొట్టేసుకు రావటం-.." అన్నాడు సురేష్.

"ఆ తోటవాళ్ళు చాలా జాగ్రత్త పరులు. మనలాంటి వీరపిల్లలు మామిడి కాయలు కొట్టేయకుండా ఓ ముసలాయనను కట్టెతో సహా కాపలా పెట్టారు. మనం ఆయన కంట పడ్డామంటే అంతే సంగతులు" అంది లక్ష్మి.

"అందుకే, అది సాహస కార్యం అని నేనన్నది. మనం కాయలు కొట్టేయాలి; ఆ తాతకి కనబడాలి, తప్పించుకోవాలి- వీరులైన మనలాంటివాళ్ళకు తగిన పని అది!" అన్నాడు సురేష్, ఆలోచిస్తూ.

"అవును! అవును!" అన్నారు అందరూ.

"మరయితే వెంటనే బయలు దేరదాం. పిల్లలు, స్త్రీలు ఇంట్లోనే ఉండండి. ఇలాంటి సాహస కార్యాలు మగ పిల్లలకే పరిమితం!" అన్నాడు మహేశ్, ఉత్సాహంగా లేచి నిలబడి.

"నేనూ వస్తాను!" అని నిలబడ్డది జ్యోత్స్న. జ్యోత్స్నకి ఆరేళ్ళు. అక్కడ చేరిన పిల్లలందరిలోకీ చిన్నది జ్యోత్స్నే.

"ఆడపిల్లలూ సాహసాలు చెయ్యగలరు. ఝాన్సీ లక్ష్మీ బాయి గురించి మీకెవ్వరికీ తెలీదేమో. మా సార్ చెప్పారు మాకు!" అన్నది లక్ష్మి.

"నేనూ వస్తాను. నాకు మామిడికాయలు కావాలి" అంది జ్యోత్స్న.

"మేరీ కోం తెలుసుగా, ఒక్క దెబ్బ కొట్టిందంటే అంతే సంగతులు. వెళ్తే అందరం వెళ్తాం అంతే. ఆడ-మగా అని తేడాలు లేవు-అందరూ సాహస వీరులే, జాగ్రత్త" బెదిరించింది సుధ.

"నేనూ వస్తాను! నేనూ వస్తాను!" అంది జ్యోత్స్న మళ్ళీ.

"జోషీ, నువ్వొద్దులేవే, మరీ చిన్నదానివి. సరిగ్గా పరుగెత్తటం కూడా రాదు నీకు" అన్నాడు మహేశ్.

జోత్స్న ఏడుపు మొదలెట్టింది.

"ఇదిగో, మీకు ఏది కావాలంటే అది చేయండి. దాన్ని మటుకు ఏడిపించకండి!" అన్నది జ్యోత్స్న వాళ్లమ్మ, ఇంట్లోంచి బయటికి వచ్చి. వాళ్ళంతా చేరింది జ్యోత్స్న వాళ్ళింట్లోనే, మరి.

కొద్ది సేపటికి అందరూ తోట దగ్గరికి చేరుకున్నారు. "అదిగో కాయలు! అదిగో కాయలు!" అరవటం మొదలు పెట్టింది జ్యోత్స్న.

"ఉష్.. చప్పుడు చేయకండి. ముందుగా మనందరం తోట లోపలికి దూరాలి. రెండు జట్లుగా విడిపోయి, రెండు వైపులనుండీ చెట్ల మీదికి ఒకేసారి దాడి చేయాలి. కాపలా తాత ఒకవైపుకు పరుగు పెడతాడు. అప్పుడు అటువైపు వాళ్ళు పారిపోవాలి. రెండోవైపువాళ్ళు అందరికీ సరిపడ కాయలు కొట్టుకొని వచ్చేస్తారు!" పధకం వివరించాడు సురేష్.

"పుల్ల పుల్లని కాయలు- " పాట మొదలెట్టింది జ్యోత్స్న. వెంటనే ఆ పాప నోరు మూసింది లక్ష్మి. పిల్లలంతా తోటలోపలికి దూరారు. అంతలోనే "ఎవరదీ?!.." అంటూ కట్టెను తడుతూ వచ్చాడు కాపలా తాత.

పిల్లలంతా తలొక దిక్కుకూ పరుగు పెట్టారు. ఎవరికివాళ్ళు చేతికందిన రాళ్లనల్లా చెట్ల మీదికి విసిరేసారు. కొన్ని కొన్ని కాయలు రాలాయి అక్కడక్కడా.

తాత అరవటం మొదలెట్టాడు- "దొంగ పిల్లల్లారా! మీ పని అయిపోయింది కాసుకోండి- మిమ్మల్ని ఇక్కడే చెట్లకి కట్టేస్తాను" అని ముందుకి దూకాడు. మరుక్షణం తాత చేతికి చిక్కిపోయాడు, కాయలు ఏరుకుంటున్న సురేష్. దొరికీ దొరకగానే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు తోటంతా వినబడేట్లు.

తాత వాడి చేతిని దొరక పుచ్చుకొని- ఇదిగో- పిల్లలంతా మర్యాదగా ఇక్కడికి వచ్చేస్తారా, లేకపోతే వీడిని పట్టుకెళ్ళి పోలీసులకు అప్పజెప్పేదా?" అని అరిచాడు ఉత్సాహంగా.

పిల్లలందరూ ఎక్కడివాళ్లు అక్కడ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇలా జరగొచ్చనిఎవ్వరూ ఊహించలేదు మరి. సురేష్ ఏడుపు పెద్దదైంది-ముసలాయన బెదిరింపులు కూడా. తర్వాతి ఐదు నిముషాల్లో పిల్లలంతా ఒక్కరొక్కరుగా బయటికి వచ్చి తాతముందు నిలబడ్డారు తలలు వంచుకొని.

"అందరూ‌వచ్చేశారా, ఇంకా ఎవరన్నా దొంగలు మిగిలిపోయారా?" అరిచాడు తాత, పెద్ద పోలీసు లాగా.

"లక్ష్మి-జ్యోత్స్న ఏరి?" పిల్లలు ఒకళ్ల ముఖాలొకళ్ళు చూసుకున్నారు. అంతలో జ్యోత్స్న గొంతు వినబడింది-

"తాతా! మరే, నాకు పది మామిడి కాయలు ఇస్తావా? వీళ్లందరికంటే ఎక్కువ?" అడిగింది జ్యోత్స్న, చెట్ల మరుగునుండి వచ్చీ రాగానే.

ఆ పాపని చూడగానే తాత పద్ధతి మారిపోయింది.

"ఓఁ..ఇస్తా పాపా! వీళ్లకి ఎన్నెన్ని ఇమ్మంటావు?" అడిగాడు తాత.

"రెండు రెండు ఇవ్వు!" రాణీలాగా చెప్పింది జ్యోత్స్న.

తాత పిల్లలందరికీ తలా నాలుగు మామిడి కాయలూ ఇచ్చాడు- "ఇంకా కాయలు కావాలంటే ఇంటికి పంపిస్తానులెండయ్యా. అరిచానని ఏమీ అనుకోబాకండి." చెప్పాడు, జ్యోత్స్నను ఎత్తుకొని వాళ్ల వెంటే బయలుదేరుతూ.

తాత తమను కట్టేసి పోలీసులకు అప్పజెబుతాడని వణికిపోతున్న పిల్లలంతా నిర్ఘాంత పోయారు. అయినా ఇల్లు చేరాక గానీ వాళ్లకు అర్థం కాలేదు- వాళ్ళు వెళ్ళిన ఆ తోట జ్యోత్స్న వాళ్లదేనని!

అయినా పిల్లలందరికీ ఆనాటి సాహసకార్యం చాలా నచ్చింది. ఆ తృప్తిలో సెలవలన్నీ మా గొప్పగా గడిచిపోయాయి!

సెలవల్లో మనం చేసే సాహసకార్యాలన్నీ ఇలాంటి అల్లరిపనులే కానక్కర్లేదు. అయితే ఎవరికి వాళ్లం, మనకు గుర్తుండిపోయే పనులేవైనా చేస్తే బాగుంటుంది. అట్లాంటి పని ఒక్కటి చేసినా చాలు- మన సెలవులు అద్భుతంగా గడినట్లు లెక్క.

మరి మీరంతా సెలవల్ని అద్భుతంగా గడుపుతారనీ, ఆ ముచ్చట్లు మాకు రాసి పంపుతారనీ ఆశిస్తూ-

కొత్తపల్లి బృందం.