ఏం ఫలం?!
టీచర్: శ్రీను! కొన్ని ఫలాల పేర్లు చెప్పు!
శ్రీను: గ్రహ ఫలం, జాతక ఫలం, రాశిఫలం, వారఫలం, ప్రతిఫలం.

చాక్‌పీసు ప్రేమ!
లెక్కల అయ్యవారు: పిల్లలూ! ఈ అభ్యాసంలో‌ఎన్ని లెక్కలు ఉన్నాయి?
గోపి: చాలా ఉన్నాయి సార్!
లెక్కల అయ్యవారు: మరయితే ఒక్క లెక్క చేస్తువురా, గోపీ
గోపి: ఒక్క లెక్క కాదు సార్, అన్ని లెక్కలూ ఒకేసారి చేస్తా. బోర్డు తక్కువ అయినా పర్లేదు; చాక్‌పీసులు మాత్రం ఎక్కువగా ఇప్పించండి సార్!

తొందర!
రాము: త్వరగా ఇంగ్లీషు నేర్చుకునేందుకు పుస్తకం ఏదైనా ఉందా?
గోపి: ఉందిరా! 30 రోజుల్లో‌ ఆంగ్లం‌ నేర్చుకోండి అని ఒక పుస్తకం‌ ఒకటి చూశాను దుకాణంలో.
రాము: అయితే అట్లాంటివి మూడు పుస్తకాలు పట్టుకొస్తావా, ప్లీజ్?!
గోపి: అన్ని పుస్తకాలు ఎందుకురా?
రాము: మూడు పుస్తకాలుంటే పదిరోజుల్లో నేర్చుకోవచ్చు గదరా, పరీక్షలు పదిరోజుల్లో‌ వస్తున్నాయి మరి!

అతనికంటే ఘనుడు!
రాము: నా మిత్రుడు శ్యామును భోజనానికి పిలిచాను; ఇవాళ్ల వస్తాడు. ఆ వెండి గ్లాసు, పళ్ళెం జాగ్రత్త- వాడి కంట పడనివ్వకు!
భార్య: ఏమి, అతనిది అంత దొంగ బుద్ధా?
రాము: కాదు. వాడు వాడి వస్తువులను గుర్తుపడితే కష్టం కదా, అందుకని!

బడి వేడి!
టీచరు: ఏమర్రా పిల్లలూ, వేసవి సెలవులు ఎలా గడిచాయి?
పిల్లలు: ఉస్ స్ స్...చాలా వేడిగా గడిచాయి టీచర్!!!

స్కీము!
సుబ్బారావు: అలా కాదు డాక్టరుగారూ! నా సమస్యకు ఆపరేషన్ నిజంగా అవసరమేనంటారా?
డాక్టరుగారు: మీ ఇష్టం సార్! ఇప్పుడైతే ఓ స్కీం ఉంది- తర్వాత ఎప్పుడో అంటే అది ఉండచ్చు; లేకపోవచ్చు.
సుబ్బారావు: ఏంటండీ ఆ స్కీం?
డాక్టరుగారు: ఆపరేషను ఫెయిలయితే పూలదండ ఫ్రీ!

నూరేళ్ళ పంట! చింటూ: అమ్మా! వరి పంట అరు నెలల్లో ఇంటికొస్తుందన్నావు కదా.
అమ్మ: అవునురా! కొన్ని రకాలైతే మూడు నెలల్లోనే కోతకు వస్తున్నాయి.
చింటూ: మరి వందేళ్ళు పట్టే పంట ఏముంటుందమ్మా?!
అమ్మ: వందేళ్ళా?! అట్లాంటిదేమీ ఉండదురా, నాయనా!
చింటూ: మరి పక్కింటి ఆంటీ ఏంటి, పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటోంది?!

గణిత క్విజ్
1. ఘాంతాంకము అనే భావనని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ( డయోఫాంటస్ )
2. లీలావతి గణితం రచించినదెవరు? ( భాస్కరాచార్యుడు )

పొడుపు కథలు

ఇంటిముందు బీగాలు
వేసేవారేగాని తీసేవారు లేరు!
ఎవరది?
(జవాబు: ముగ్గు!)

తెల్లని గుడి-
లోనికి వెళ్ళే దారి లేదు!
ఏమా కథ?
(జవాబు: గ్రుడ్డు!)

రెండు స్తంభాల మీద తొట్టి
తొట్టి మీద గుండ్రాయి
గుండ్రాయి మీద గడ్డి
గడ్డిమీద రోడ్డు!
ఏంటి ఇది?
(జవాబు మనిషి!)

జీడివారి కోడలు
వేడి వారి మరదలు
వైశాఖమాసంలో ఇంటికి తిరిగి వస్తుంది.
ఏంటది?
(జవాబు: మామిడి పండు!)

చాచుకొని చావిట్లో పడుకుంటుంది;
ముడుచుకొని మూలన నక్కుతుంది-
ఏంటది?
(జవాబు: చాప!)

ముళ్ళలో పుట్టాను
ముళ్ళలో పెరిగాను
రంగూ వాసన నాసొత్తు
ఎవరిని, నేనెవరిని?
(జవాబు: గులాబీ)

భూమాతకు ముద్దుబిడ్డ
ఆకాశం నా జున్ను గడ్డ
రాత్రివేళ రాచరికం
పగలైతే పేదరికం
ఎవరిని , నేనెవరిని? (జవాబు: చందమామ)

అయ్యా అంటే కలవం
అమ్మా అంటే కలుస్తాం
ఎవరిమి, మేమెవరిమి?
(జవాబు: పెదిమలు)

ఆలులేని అడవిలో
జీవంలేని జంతువు
జీవంగల జంతువులతో పోరాడింది
ఏమా కథ? ఎవరిదా కధ?
(జవాబు: తల, దువ్వెన, పేన్లు.)

ఆకాశానికి పోటు
సముద్రానికి మూత
ఎముక ఉన్న నాలుక
తొడిమ ఉన్న గ్రుడ్డు-
వీటన్నిటికీ పోలిక ఏంటి?
(జవాబు: ఇవేవీ ఉండవు!)

మా ఊళ్ళో వెలసింది
ఊరవతల తోట వేసింది
ధర్మవరం పోయినా వాసన వస్తుంది ఏంటది?
(జవాబు: మొగలి రేకు)

ఆరుకాళ్ళ చిన్నవాడు
ఎంత దట్టమైన అడవినైనా నరికేస్తాడు!
ఎవరది?
(జవాబు: పేను!)

కవితలు-కాకరకాయలు!

కూరగాయల పాట!
వంకాయ తినడానికి- వంకెందుకు!
బెండకాయ తినడానికి - బెంగెందుకు!

చిక్కుడు కాయ తినడానికి - చిరాకెందుకు!
దోసకాయ తినడానికి దోబూచులెందుకు!

కాకరకాయచేదైనా అది కడుపుకుమందేరా!

గుమ్మడికాయ తినడానికి- గోలెందుకు!
క్యాబేజీతినడానికి- కేకెందుకు!

బీట్ రూట్ తినడానికి - భీతెందుకు!
ముల్లంగి తినడానికి - మూర్ఛెందుకు!

దుంపలు తినడానికి- దూకుడెందుకు!
అమ్మ చెప్పిన మాట- వినవెందుకు!
చాక్లెట్ ఇస్తే- తీసుకుంటావెందుకు!

రచన: టి.సునీల, 8వ తరగతి, ZPHS, గుండువారిపల్లి.

గుండ్రం! గుండ్రం!
గిర గిర తిరిగే
చక్రం గుండ్రం
సూర్యుడు గుండ్రం
చంద్రుడు గుండ్రం
రాత్రిపగలు
గుండ్రం! గుండ్రం!
నయనం గుండ్రం
ముఖమూ గుండ్రం
నడిచే వాహన చక్రం గుండ్రం!
ఆపిల్ గుండ్రం
గాజులు గుండ్రం
చదవకపోతే మార్కులు గుండ్రం!
భూమి గుండ్రం
బూరెలుగుండ్రం
ఎక్కువ తింటే పొట్ట గుండ్రం!

ఉగాది కవిత!

వసంతం తెచ్చింది ఉగాది।
కావాలి నూతన విజయాలకిది పునాది॥

శ్రీ జయనామ సంవత్సరమిది।
నవశకానికి కావాలి నాంది॥

విజయకాంక్ష నింపుకోవాలి ప్రతీ మది।
ఇక గెలుపు మీదికాక మరెవరిది॥
(రచన:ఎం. అశ్వర్థనారాయణ, గణిత సహాయకులు, ZPHS, గుండువారి పల్లి.)