ప్రతాపపుర రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన మంత్రి విజయేంద్రుడు. మంత్రి గారి సహాయంతో రాజేంద్రవర్మ ప్రతాపపుర రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు.

రాజుగారి కొడుకు వీరసేనుడు, మంత్రి కుమారుడు చక్రసేనుడు, ఇద్దరూ చిన్నప్పటి-నుండీ కలిసి పెరిగారు. ఇద్దరికీ ఐదేళ్ళు రాగానే రాజుగారు, మంత్రిగారు వాళ్లని ఒక మంచి గురువుగారి దగ్గర చేర్చారు.

గురుకులంలో ఇద్దరూ విలువిద్య, ఖడ్గవిద్యలతో సహా అనేక విద్యల్లో ప్రవీణులయ్యారు. గురువుగారు వాళ్లనిద్దరినీ పరీక్షించి, మెచ్చుకొని, దీవించి పంపారు.

సంతోషంగా ఇంటికి వచ్చిన వీరసేనునితో రాజేంద్రవర్మ "కుమారా! విద్యా బుద్ధులు నేర్పిన గురువుగారికి గురుదక్షిణగా విలువైన వస్తువులు, సంపదలు అనేకం ఇచ్చాం. బాగుంది. అయితే జన్మనిచ్చి, సరైన గురువు వద్దకు పంపి చదివించిన నాకు కూడా నువ్వు ఏదైనా మంచి బహుమానం ఇవ్వవలసి ఉన్నది. కొంత కాలం పాటు దేశాటన చేసి, నాకు నచ్చే బహుమతినొకదాన్ని దేన్నైనా తీసుకురా" అన్నాడు.

"సరే" అని వీరసేనుడు గుర్రంమీద దేశాటనకు బయలుదేరాడు. చక్రసేనుడు కూడా మిత్రుడి వెంట బయలుదేరాడు. మిత్రులిద్దరూ చాలా దూరం వెళ్ళాక వాళ్లకొక నది ఎదురైంది. నది ఒడ్డునే చక్కని పండ్లతో అలరారే మామిడి చెట్టు కూడా ఒకటి కనిపించింది. అలసిన గుర్రాలకు నీళ్ళు త్రాగించి, గడ్డి మేసేందుకు వదిలి, మిత్రులిద్దరూ విశ్రాంతిగా చెట్టు క్రిందికి చేరారు.

అంతలో అక్కడికొక సాధువు వచ్చాడు. మిత్రులిద్దరినీ చూసి, "రాజకుమారా! మంత్రి కుమారా! ఇంత దూరం, ఈ అడవి మార్గాన వచ్చారెందుకు?" అని ప్రశ్నించాడు.

స్నేహితులిద్దరూ కొంచెం ఆశ్చర్యపోయారు- ఎందుకంటే వాళ్ళిద్దరూ మారు వేషాల్లో ఉన్నారు మరి! "ఇతనెలా గుర్తు పట్టాడు?" అనుకున్నారు.

అంతలోనే ఆ సాధువు వాళ్లతో "నాయనలారా! మీరిప్పుడు ఉత్తరదిశగా రెండు రోజుల పాటు ప్రయాణించండి.

అక్కడ మీకు పాడుబడిన శివాలయం ఒకటి కనబడుతుంది. ఆ శివాలయంలో శివలింగానికి ఎదురుగా ఉన్న నందిని పట్టుకొని బలంగా త్రిప్పితే, ఒక సొరంగ మార్గానికి దారి వెలువడుతుంది. మీరు ఆ సొరంగంలో ప్రవేశించి దక్షిణ దిశగా ముందుకు వెళ్తే ఒక కీలుగుర్రం, విక్రమార్కుడు ఉపయోగించిన ఖడ్గం దొరుకుతాయి. వాటికి కావలిగా సర్పాలు అనేకం ఉంటాయి; జాగ్రత్త.

మీరు ఆ రెండింటినీ‌తీసుకొని, మరింత ముందుకు రావాలి. మరొక ఆరు గంటలు ప్రయాణించాక మీకు మళ్ళీ మెట్లు, ఈసారి పైకి వచ్చేవి, కనబడతాయి. అవి మిమ్మల్ని సరిగ్గా ఈ ఊరి చివరనున్న కాళికాలయంలోకి తీసుకొస్తాయి. నేను మిమ్మల్ని మళ్ళీ‌ అక్కడ కలుస్తాను. లోక కల్యాణం కోసం మీరిద్దరూ ఈ సాహసాన్ని చేయండి!" అని ఇద్దరినీ దీవించి వెళ్ళిపోయాడు.

రాజకుమారుడు, మంత్రికుమారుడూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, సాధువు చెప్పిన దిశగా బయలు దేరారు. రెండు రోజులు అలా ప్రయాణించాక సాధువు చెప్పినట్లుగానే వారికి పాడుబడ్డ శివాలయం ఒకటి కనిపించింది.

రాజకుమారుడు శివునికి నమస్కరించి, శివలింగానికి ఎదురుగా ఉన్న నందిని పట్టుకొని బలంగా త్రిప్పాడు. ఆశ్చర్యం! నంది అలవోకగా తిరిగింది! శివునికి వెనుకగా ఉన్న రహస్యపు అర ఒకటి ప్రక్కకు తొలిగి, లోనికి మెట్లు కనిపించాయి!

మిత్రులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, లోనికి ప్రవేశించారు. చక్రసేనుడి సూచనల మేరకు, వీరసేనుడు తన ఖడ్గాన్ని ఒరలోంచి లాగి పట్టుకున్నాడు. మిత్రులిద్దరూ సొరంగం లోనికి ప్రవేశించారో, లేదో ఆయుధాలు ధరించిన పదిమంది వాళ్ళమీదికి దాడి చేసారు! అయితే యుద్ధంలో ఆరితేరిన మిత్రులిద్దరికీ వాళ్లను తుదముట్టించటం ఏమంత కష్టం కాలేదు.

"జాగ్రత్త, మిత్రమా! ఈ సొరంగ మార్గంలో సర్పాలు కాక, వాటిని మించిన నరసర్పాలు అధికంగా ఉన్నట్లున్నాయి" అని చక్రసేనుడు అంటే, వీరసేనుడు అర్థం అయినట్లుగా నవ్వాడు.

మిత్రులిద్దరూ‌ సొరంగ మార్గంలో ముందుకెళ్ళారు. సాధువు చెప్పినట్లుగా దారిలో వాళ్లకొక చెక్క గుర్రం, పాత ఖడ్గం దొరికాయి. మధ్యలో వారికి ఏవో చిన్న చిన్న పాములు తప్ప, మరే విష పురుగులు కూడా ఎదురవ్వలేదు!

మిత్రులిద్దరూ సొరంగపు చివరను చేరుకునేసరికి పైకి వెళ్ళే మెట్లు కనబడ్డాయి. "జాగ్రత్త!" అని ఒకరినొకరు హెచ్చరించుకొని, కత్తులు దూసి మెట్ల పైనున్న తలుపును నెట్టారు. వాళ్ళు అనుకున్నట్లుగానే ఆయుధాలు ధరించిన శత్రువుల గుంపు మరొకటి వాళ్ల మీద విరుచుకు పడ్డది! వీరసేనుడు, చక్రసేనుడు మళ్ళీ తమ కత్తులకు పదును పెట్టారు: వాళ్ళనందరినీ సునాయాసంగా యమపురికి పంపారు.

దేవాలయంలోకి చేరుకోగానే వాళ్లకు ధ్యానంలో ఉన్న సాధువు కనిపించాడు. వీరసేనుడు, చక్రసేనుడు చిరునవ్వుతో ఆయన్ని సమీపించారు. అలికిడి విని కనులు తెరచిన సాధువుకు వాళ్ళు తాము సొరంగంలోంచి తెచ్చిన కీలు గుర్రాన్ని, విక్రమార్కుని ఖడ్గాన్నీ సమర్పించి నమస్కరించారు.

"అలా కాదు, పాదాలకు నమస్కరించాలి ప్రభూ!" అని మంత్రికుమారుడు అనటంతో ముందు వీరసేనుడు, ఆ తర్వాత, అతను లేచి నిలబడ్డాక చక్రసేనుడు, సాధువు పాదాలకు వంగి నమస్కారం చేశారు.

సాధువు ముఖం తెలవెలపోవటం చూసి మిత్రులిద్దరూ నవ్వుకున్నారు. వాళ్ల నవ్వుల్ని చూసిన సాధువు తటాలున తన చేతిలో ఉన్న విక్రమార్కుని ఖడ్గం తీసి మిత్రులిద్దరి మీదా విరుచుకు పడ్డాడు! సిద్ధంగా ఉన్న మిత్రులిద్దరూ అతన్ని ఎదుర్కొన్నారు.

చూడగా సాధువు గొప్ప పోరాట పటిమగల యోధుడే! వీరసేనుడు, చక్రసేనుడు ఇద్దరూ కలిసి, అతి కష్టం మీద అతన్ని యమపురికి పంపారు! అతను మరణించాక, పెట్టుడు మీసాలూ, గడ్డమూ, తొలగించి చూస్తే అతను మరెవరో కాదు- ప్రతాపపురపు సేనాని!

ప్రతాపపుర సేనాని రాజును, యువరాజును ఇద్దరినీ చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కొంతకాలంగా పన్నాగాలు పన్నుతున్నాడు.

యువరాజు దేశాటనకు బయలుదేరటం చూసి అతను సాధువు వేషంలో మోసం చేయజూశాడు. అయితే అతను చేసిన తప్పులు- శివాలయంలో నంది సునాయాసంగా ప్రక్కకు తొలగటం, మిగతా ఆలయం అపరిశుభ్రంగా ఉన్నా నంది శుభ్రంగా ఉండటం, శివుని వెనకనున్న తలుపు శబ్దం లేకుండా‌ తెరచుకోవటం, లోపల ఉన్న మనుషులు సైనికుల మాదిరి ప్రవర్తించటం- ఇవన్నీ- అతన్ని పట్టించాయి!

ఒకసారి సేనాని మరణించగానే, అతని పన్నాగంలో పాలుపంచుకున్న దుర్మార్గు-లందరూ చిక్కారు. రాజుగారు వాళ్లకు తగిన శిక్షలు విధించటంతో పాటు, తనకు అంత విలువైన బహుమతిని తెచ్చిన వీరసేనుడికి రాజ్యాభిషేకం చేశారు. చక్రసేనుడు మంత్రి అయినాడు.

త్వరలోనే వీరసేనుడు ధైర్యసాహసాలు గల మంచి రాజుగాను, చక్రసేనుడు తెలివైన మంత్రిగాను పేరు తెచ్చుకున్నారు!