అమెరికాలోని చికాగో నగరం. అత్యంత ధనికులు నివసించే ప్రదేశం అది. మిసెస్ డౌన్స్ అనే ముసలావిడ అక్కడే ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆవిడకి ఒక్కతే కూతురు- న్యూయార్కులో ఉద్యోగం చేస్తోంది ఆమె. ప్రతి నెలలోనూ ఒక వారాంతంలో తల్లి దగ్గరకి వస్తుంది.

అట్లా వచ్చినప్పుడే తల్లికి నెలంతా అవసరమయ్యే సామాన్లు కొనివ్వడం, ఇల్లంతా సర్ది ఇవ్వడం చేసి పెడుతుంది.

దాదాపు ఆరు నెలలుగా ఆ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగల ముఠా వాళ్ళు కొందరు, ఎవరింట్లో దొంగతనం చేయబోతున్నారో వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మరీ వస్తున్నారు: సమయం చెప్పి మరీ దోపిడీలు చేస్తున్నారు. ఎవరైనా ఆ సమాచారాన్ని పోలీసులకి అందిస్తే వేరే ఏదో సమయంలో దొంగతనం చేయడమే కాదు- పోలీసులకి చెప్పినందుకు శిక్షగా ఇంట్లోవాళ్లని అందరినీ చంపేస్తున్నారు.

"కోబ్రా, వైపర్, బ్లాక్ స్నేక్, అనకొండ, మాంబా, రాటిల్ స్నేక్.... " ఇట్లా పాముల పేర్లు పెట్టుకుని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు. చెప్పి మరీ దొంగతనాలు చేస్తున్న ఈ ముఠా గురించి అమెరికా అంతా అట్టుడికినట్లు ఉడికిపోతున్నది. వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ రోజు శనివారం. కూరగాయలు తెచ్చుకుందామని మార్కెట్‌కి వెళ్ళడానికి తయారవుతున్నది మిసెస్ డౌన్స్ . అంతలోనే ఫోన్ మోగింది- “హలో.. హలో..-"

“హలో నేను వైపర్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు నాలుగు గంటలకి మీ ఇంటికి వస్తున్నాను" అని అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. “అమ్మో! వచ్చేస్తున్నారు - మా ఇంటికి వచ్చేస్తున్నారు ఆ బందిపోటు దొంగలు!! ఏం చేయాలి?.. పోలీసులకి ఫోన్ చేస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడెలా?... ఇంట్లో ఉన్న ఫోన్‌ని 'టాప్' చేసి ఉంటారు... బయటికి వెళ్ళి పబ్లిక్ ఫోన్ నుండి ముందు అమ్మాయికి ఫోన్ చేస్తే!!?... అమ్మో! వద్దు! మా ప్రాంతంలో ఉన్న ఫోన్లన్నిటినీ గమనిస్తూండి ఉంటారు! అమ్మాయికి ఫోన్ చేస్తే నా ప్రాణంతోపాటు అమ్మాయి ప్రాణం కూడా తీస్తారు..! ఇప్పుడెలా?... దేవుడా! కాపాడు - ...ఒక పని చేస్తే?!.. ఇంట్లో ఉన్న నా నగలు తీసుకెళ్ళి లాకర్ లో పెట్టేస్తే?.. అదే మంచిది... వాళ్ళకి అనుమానం కలగకుండా కొన్ని నగలు, కొంత డబ్బు ఇంట్లో ఉంచి, మిగతావి లాకర్లో పెట్టేస్తే సరి' అనుకుంటూ, వణుకుతున్న శరీరాన్ని కూడ దీసుకొని, సోఫాలోంచి లేవబోయింది మిసెస్ డౌన్స్. అంతలోనే “ట్రింగ్!.. ట్రింగ్..!!” అంటూ ఫోన్ మోగింది మళ్ళీ.

మిసెస్ డౌన్స్ భయం భయంగా ఫోన్ ఎత్తింది-

“మిసెస్ డౌన్స్- ఎక్కడికీ వెళ్ళొద్దు. ఖచ్చితంగా నాలుగు గంటలకి వచ్చేస్తాను" అన్నాడు వైపర్, టప్పున ఫోన్ పెట్టేస్తూ. అతను ఫోను పెట్టేసిన ఆ శబ్దం ఆమె గుండెల్లో బాంబు పేలినట్లు పేలింది. తుఫానులో చిగురాకు లాగా వణికిపోయింది ఆవిడ- "అమ్మో! వాళ్ళు నా ఆలోచనని కూడా కనిపెడుతున్నారు. అంటే మొత్తం ఇల్లంతా ఏవో పరికరాలు పెట్టి ఉంటారు. వెధవ సైన్స్.

ఈ సైన్సు టెక్నాలజీల వల్ల మనుషుల మనుగడే నాశనమయేట్లుగా ఉంది" అనుకుంటూ అలాగే కూలబడిపోయి కూర్చున్నది.

నిమిషాలు.. గంటలు.. గడుస్తున్నాయి. భోజనం చేయడానికి కూడా లేవలేదు ఆవిడ. ఆవిడ సోఫాకు, ఆవిడ చూపులు గడియారానికి అతుక్కుపోయి ఉన్నాయి.

సాయంత్రం మూడు అయ్యింది. కొంచెం తేరుకున్న మిసెస్ డౌన్స్ నిదానంగా లేచి బాత్‌రూమ్‌కి వెళ్ళొచ్చింది. టీ త్రాగాలని-పిస్తోంది; కానీ వంటగదిలోకి వెళ్ళాలంటేనే ఆమెకి భయంగా ఉంది. మళ్ళీ సోఫాలో కూలబడి టైమ్ చూసింది- ఇంకా మూడూ పదే...

మూడున్నర ...... మూడూ యాభై....... మూడూ యాభై ఒకటి... రెండు.... మూడు.... నాలుగు.... ఐదు.......

అంతలోనే “బర్....ర్ ర్ ర్...” అంటూ డోర్ బెల్ మోగింది.

మిసెస్ డౌన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదురుతున్న గుండెతో మెల్లగా లేచింది. ఆవిడ కాళ్ళూ, చేతులూ కంపించి-పోతున్నాయి. తలుపు దగ్గరకి వెళ్ళి నిలబడింది..

నిదానంగా.... చా..లా- నిదా...నంగా, కంపించిపోతున్న చేతితో... లాచ్ ని తిప్పి- తలుపు తీసింది- ఎదురుగ్గా అతను ......

అతని చేతిలో బూజు దులిపే కర్ర, టాయిలెట్ శుభ్రం చేసే బ్రష్ లూ....

“సారీ మిసెస్ డౌన్స్! సారీ ఐ యామ్ ఫైవ్ మినిట్స్ ఎర్లీ. ఐ యాం వైపర్ " అన్నాడతను.

ఆంగ్లంలో 'వైపింగ్' అంటే శుభ్రం చేయటం. అలా చూస్తే ఇళ్ళు శుభ్రం చేసే ఇతను 'వైపర్' అవుతాడు! 'దొంగ దొంగ' అని తను ఊరికే భయపడిందన్నమాట ఇంతసేపూ! ఎవరో దొంగ అనుకున్నది ఇతన్నేనా!!

మిసెస్ డౌన్స్ ఊపిరి పీల్చుకున్నది. తడబడుతూ "కమిన్" అంది-

ఆమె గొంతులో నిండా సంతోషం.