అనగనగా ఒక అడవిలో ఒక కాకమ్మ, ఒక గువ్వమ్మ ఉండేవి. కాకమ్మదేమో రాళ్ళ ఇల్లు. గువ్వమ్మదేమో పేడ ఇల్లు.













ఒకనాడు సాయంత్రం పే..ద్ధ గాలివాన వచ్చింది. దాంతో గువ్వమ్మ కట్టుకున్న పేడ ఇల్లు కాస్తా కరిగిపోయింది.









అప్పుడు గువ్వమ్మ కాకమ్మ ఇంటికి వెళ్ళి "కాకమ్మా, కాకమ్మా! కొంచెం తావిస్తావా?” అంది. అంటే, అప్పుడు కాకమ్మ "ఉండమ్మా గువ్వమ్మా! ముందు నా మొగోనికి నీళ్లు పోయాలి" అనింది.










తరువాత కొంచెం సేపటికి మళ్ళీ వెళ్ళి "కాకమ్మా, కాకమ్మా! కొంచెం తావిస్తావా, ఇప్పుడు?” అని అడిగింది గువ్వమ్మ. "ఉండమ్మా, గువ్వమ్మా! ముందు నా మొగునికి బట్టలు వెయ్యాలి" అనింది కాకి.

తరువాత కొంచెం సేపటికి మళ్ళీ వెళ్ళింది గువ్వమ్మ. "కాకమ్మా, కాకమ్మా! కొంచెం తావిస్తావా?” అంటూ.

"ఉండమ్మా, గువ్వమ్మా! ముందు నా బిడ్డను స్కూలుకి విడిచిరావాలి" అని కాకి అనింది.










కొంచెం సేపు తరువాత మళ్ళీ వెళ్ళింది గువ్వమ్మ "కాకమ్మా, కాకమ్మా! కొంచెం తావిస్తావా" అంటూ.
అప్పుడు ఇంక కాకమ్మ అంది- "సరేలే, అదిగో ఆ ఇంట్లో ఉండు" అని ఇల్లు చూపించింది. ఆ ఇంట్లో బిస్కెట్లు, చక్కిలాలు, నిప్పట్లు, లడ్డు, బూంది, మిక్చర్- అన్నీ ఉన్నాయి . గువ్వమ్మ ఆ ఇంట్లో చేరుకొని అవన్నీ తినేసింది .










అంతలో కాకమ్మ బిడ్డ వచ్చి "అమ్మా నాకు మిక్చర్ కావాలి" అన్నది. కాకమ్మ వెళ్ళి చూస్తే గిన్నెలన్నీ‌ ఖాళీ! మిక్చర్, బిస్కెట్లు, చక్కిలాలు ఏమీ లేవు!










"ఓహో గువ్వమ్మ అన్నీ తిని పారిపోయిందే” అని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది కాకమ్మ. కానీ గువ్వమ్మ అసలు ఆ దగ్గర్లో లేనే లేదు!

అంతలో కాకమ్మకు ఒక ఒంటెద్దు ఆయప్ప ఎదురయ్యాడు. "మా గువ్వమ్మను చూస్తివా చిన్నాయప్పా?” ఆని కాకమ్మ అడిగింది ఆయన్ని. "లేదమ్మా! రెండెద్దుల ఆయప్పను అడుగు" అన్నాడు ఒంటెద్దు ఆయప్ప.










రెండెద్దుల ఆయప్పని అడిగింది కాకమ్మ. "అదిగో చూడమ్మా! ఆ గట్టు మీద ఉంది" అని దారి చూపించాడు రెండెద్దులాయప్ప.

అప్పుడు కాకమ్మ అక్కడికి వెళ్ళి గువ్వమ్మను పట్టుకొని, ఇంటికి తీసుకువెళ్ళి, కడ్డీ కాగబెట్టి వాత పీకింది. దాంతో గువ్వమ్మ ఇంక ఎవ్వరికీ కనబడకుండా పారిపోయింది .