రామాపురంలో రాజయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. అతను ఒట్టి సోమరిపోతు. ఏ పని చేయాలన్నా అతనికి బద్ధకం అడ్డు వచ్చేది.
మిగతా రైతులందరూ కష్టపడి పని చేస్తుంటే రాజయ్య మాత్రం ఒళ్ళు కదలకుండా కూర్చొని "ఒరేయ్! ఎందుకురా అంత కష్టపడతారు? నన్ను చూడండిరా! రాజాలా ఎలా ఉన్నానో! మీరేంటిరా ఇలాగ?! అస్సలు సుఖపడటం తెలీదురా, మీకు" అని వాళ్ళని ఎగతాళి చేసేవాడు. వాళ్లెవ్వరూ ఇతని మాటల్ని పట్టించుకునేవాళ్ళు కాదు.
రాజయ్య రెండు పనులు మటుకు క్రమం తప్పకుండా చేసేవాడు: నిద్రపోవటం, తిండి తినటం. రాజయ్యకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు లెక్కలేనంత నిద్ర, చెప్పలేనంత ఆకలి ఇచ్చాడు. నిద్ర, ఆకలి తీరాక, గుర్తొచ్చినప్పుడల్లా రాజయ్య దేవుడిని ప్రార్థించేవాడు: "దేవుడా! ఇంత పని చేసుకోలేక కష్టపడుతున్నాను- నాకొక్క సేవకుడిని పంపించరాదా?!" అని.
ఒకసారి దేవుడనుకున్నాడు- 'వీడికి గుణపాఠం నేర్పించాలి' అని. వెంటనే రాజయ్యముందు ఒక సేవకుడు వచ్చి నిలబడ్డాడు. "అయ్యా! నన్ను దేవుడు పంపించాడు. మీరు నా శక్తికి తగిన పని ఏది చెబితే అది చేయమన్నాడు. నాకు భోజనం, వసతి మీరే ఇస్తారని చెప్పాడు" అన్నాడు.
"ఓహో అట్లా చెప్పాడా! సరే, మంచిది. మరయితే నాకు రెండెకరాల పొలం, బావి ఉన్నాయి. వాటిలో నీకు తోచిన పంటలు వెయ్యి! లాభంగా వ్యవసాయం చెయ్యాలి సుమా!" అని సంతోషంగా అతనికి పని అప్పగించేశాడు రాజయ్య.
అయితే ఆ సేవకుడు పొలంలో ఏ పంటా వెయ్యలేదు. పైపెచ్చు రాజయ్య గట్టిగా ఏదైనా పని చెబితే "ఇది నా శక్తికి మించిన పనండి! దేవుడు నా శక్తికి తగిన పని చెబితే చేయమన్నాడు తప్ప, శ్రమపడమని చెప్పలేదు" అనటం మొదలెట్టాడు.
వాడికి వంట చేసి పెట్టటమూ, వాడి అవసరాలు తీర్చటమూ, వాడిచేత పని చేయించటం తోటే రాజయ్యకు తల ప్రాణం తోకకు రాసాగింది.
ఒకనాడు "ఇదిగో! ఈ ఎద్దుల జతను తీసుకెళ్ళి పొలం దున్ను!" అని సేవకుడికి చెప్పి ఇంటికొచ్చేశాడు రాజయ్య.
సేవకుడు పొలం దున్నుతుంటే అతనికి రెండు లంకె బిందెలు దొరికాయట! కానీ అతను వాటిని రాజయ్యకు ఇవ్వకుండా తనే దాచేసుకున్నాడు. అయితే ప్రక్క పొలంలో దున్నుతున్న రైతు ఈ సంగతిని గమనించి చెబితే, రాజయ్య సేవకుడిని నిలదీశాడు: "అవును! దొరికాయి! అయితే ఏంటట?" అన్నాడు వాడు దురుసుగా.
"నా పొలంలో దొరికితే అవి నావి!" అన్నాడు రాజయ్య.
"నాకు ఆ సంగతి తెలీదు. నాకు దొరికినవన్నీ నావే- అసలు పని చేస్తున్నది నేను-కూర్చొని తినేది మీరు! ఇది ఎలా కుదురుతుందండీ!అయినా ముందు నాకు ఆకలేస్తున్నది. ఊరికే తగవులాడటం మాని అన్నం పెట్టండి!" అన్నాడు సేవకుడు.
"మర్యాదగా నా బిందెలు నాకు ఇవ్వకపోతే కొత్వాలు దగ్గర ఫిర్యాదు చేస్తాను, జాగ్రత్త" అని బెదిరించాడు రాజయ్య.
"అవి మా లోకంలో నడవవండి! అయినా ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, భూమిలో దొరికినవి రాజుకు చెందుతాయని చెప్పి వాటిని రాజుగారికి అప్పజెబుతాను" అన్నాడు సేవకుడు.
"దేవుడా!నాకు ఇట్లాంటి సేవకుడిని పంపావేమి?! వీడిని తీసుకెళ్ళిపో!" అని మొత్తుకున్నాడు రాజయ్య.
దేవుడు ప్రత్యక్షమై, "మరి నువ్వేగా, 'సేవకుడు కావాలి' అని ఒకటే వేధించింది?!" అన్నాడు.
"ఇట్లాంటివాడినా, నాకిచ్చేది?" అన్నాడు రాజయ్య.
"చూడు రాజయ్యా! మనుషులన్నాక ఎవరి ప్రవృత్తులు వాళ్లకు ఉంటాయి. పనిచేసే వాళ్ళే గొప్పవాళ్ళు- మిగిలినవాళ్ళు వాళ్లతో సర్దుకుపోతుండాలి, అంతే. నీకు అక్కర్లేకపోతే నువ్వు సేవకుడిని పెట్టుకోకు!" అన్నాడు దేవుడు.
"నాకు అక్కర్లేదు!" అని రాజయ్య అనగానే సేవకుడు కాస్తా మాయం అయిపోయాడు. లంకెబిందెలూ అతనితోబాటే మాయం! రాజయ్య మళ్ళీ మొత్తుకున్నాడు.
దేవుడు నవ్వి "రాజయ్యా! ఇదిగో, ఈ చీమల్ని చూడు- ఎంత కష్టపడి తమ ఆహారాన్ని తాము సంపాదించుకుంటున్నాయో! కష్టపడితేనే ఫలం; లేకుంటే ఏమీ లేదు. అక్కడ చూడు, పిల్లలు ఎంత శ్రమపడి చెట్లమీద పండ్లను కోసుకుంటున్నారో! పళ్ళు వాళ్ల దగ్గరికి వచ్చి రాలి పడాలంటే పడవు మరి! ఊరికే వచ్చిన సేవకులతో పని చేయించుకొని హాయిగా బ్రతకాలనుకోవటం తప్పు. నీ శ్రమకు తగిన పని నువ్వు చేయటమే సరైనది!" అన్నాడు, మాయమైపోతూ.
"బుద్ధి వచ్చింది- ఇకనుండి బాగా పనిచేస్తాను స్వామీ" అని లెంపలేసుకున్నాడు రాజయ్య.
అటు తర్వాత రాజయ్య మిగిలిన రైతుల్లాగా కష్టపడి పనిచేస్తే అందరూ ఆశ్చర్యపోయారు.
అటుపైన ఇక 'సోమరిపోతు రాజయ్య' లేడు- అతనికి ఇప్పుడు 'శ్రమజీవి రాజయ్య ' అని మంచి గుర్తింపే వచ్చింది!