అనగా అనగా ఒక అడవిలో ఒక మేక- మేకపోతుల కుటుంబం ఉండేది. వాటికి రెండు చిట్టి చిట్టి మేక పిల్లలు ఉండేవి. మేకకు, మేకపోతుకు తమ పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడేగాని వాటిని ఒంటరిగా వదిలి ఎక్కడికీ పోయేవి కావు.
అయితే మేకపోతుకు అడవిలో ఒక తోడేలుతో స్నేహం కుదిరింది. కండలు తిరిగిన శరీరంతో, బలంగా ఉండే మేకపోతుకు తోడేలంటే ఏమాత్రం భయం ఉందేది కాదు. కానీ తల్లి మేక మటుకు దాన్ని చూస్తే చాలా భయపడేది.
"నీకెందుకు, దాంతోటి స్నేహం?! అది తోడేలు, మనది మేక జాతి. మనకు, దానికి పొసగదు" అనేది అది.
"ఈ తోడేలు అని తోడేళ్లలాంటిది కాదు- చాలా మంచిది. అయినా అది నన్నేం చేస్తుంది, గట్టిగా ఒక్క కుమ్ము కుమ్మానంటే చచ్చి ఊరుకుంటుంది" అనేది తప్పిస్తే, మేకపోతు దానితో స్నేహం మాత్రం మానేది కాదు.
ఒకసారి మేక మేతకి వెళ్తూ అనుమానం కొద్దీ పిల్లలతో "చూడండి! నేను మేతకి వెళ్తున్నాను. నేను, మీ నాన్న కాక ఎవరొచ్చినా మీరు మాత్రం బయటికి రాకండి" అని చెప్పింది.
అది అటు వెళ్లగానే మేకపోతు తోడేలుతో కలిసి బయటికి వెళ్ళింది. కొంత సేపటి తర్వాత అవి దాగుడు మూతలు ఆడుకున్నాయి. ఆటలో భాగంగా ఎక్కడో దాక్కున్నది తోడేలు. ఆ తర్వాత ఎంత వెతికినా అది మేకపోతుకు కనబడనేలేదు.
నిజానికి జరిగిందేంటంటే, దాక్కున్నట్లు దాక్కుని, తోడేలు మేక పిల్లల దగ్గరికి వచ్చింది. మేకపోతు లాగా "నేనొచ్చేశా" అనేసరికి, మేకపిల్లలు రెండూ బయటికి వచ్చాయి! తోడేలు వాటిని చంపి తినేసింది!
తోడేలుకోసం వెతికీ వెతికీ వేసారిన మేకపోతు ఇంటికి వచ్చి చూస్తే ఏముంది?! పిల్లలు రెండూ లేవు! "అది తోడేలు పనే"నని గ్రహించిన మేక-మేకపోతు వెళ్ళి తోడేలును నిలదీసాయి. "మిత్రుడిలా నటించి, ఇలా చేస్తావా?!" అన్నది మేకపోతు, కళ్ల నీళ్ళు పెట్టుకొని.
"నేను నీ స్నేహితుడిని ఎందుకవుతాను? నేను తోడేలును, నీది మేక జాతి. నీకూ నాకూ ఎట్లా పొసగుతుంది?! నేను ఊరికే అట్లా నటించానంతే!" అన్నది తోడేలు, కోరలు చాపుతూ.
'మోసకారి స్నేహితుడిని నమ్మి, కన్న బిడ్డలను చంపుకున్నానే' అని చాలా బాధ పడింది మేకపోతు.