అనగా అనగా కరభం అనే చిన్న గాడిద ఒకటి ఉండేది. అన్ని గాడిదల్లాగే అదీ చాలా మొండిది. ఇంకా ఏంటంటే, పాపం దానికి తెలివితేటలు కాస్త తక్కువ, కోపం‌ ఎక్కువ. దాంతో దానికెప్పుడూ ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉండేది.

ఒకసారి అది మిగిలిన గాడిదలతో పాటు రోడ్డు దాటుతుంటే ప్రక్కగా పోతున్న గాడిద ఒకటి దాని కాలును తొక్కింది. దాంతో కరభానికి ఎంత కోపం వచ్చిందంటే, అది అక్కడికక్కడే రాయి లాగా నిల్చుండి పోయింది. వెనుక వస్తున్న గాడిదలు దాన్ని చాలా నెట్టాయి - కానీ ఏం ప్రయోజనం, పట్టుదలకొద్దీ నిల్చున్న కరభాన్ని కదల్చటం ఎవరికి సాధ్యం? కరభం‌ ఒక్క సెంటీమీటరు కూడా ముందుకి జరగలేదు.

ఆ సరికే రోడ్డు మీద వాహనాలన్నీ చాలా నిలబడిపోయి, "బయ్"....మని హారన్లు మ్రోగించటం మొదలుపెట్టాయి. ఆ డ్త్రెవర్లలో ఉత్సాహవంతుడైన వాడొకడు జీపుతో కరభాన్ని ప్రక్కకు నెట్టటం కూడా మొదలు పెట్టాడు. కానీ కోపం వచ్చిన కరభం మరింత గట్టిగా నేలకు కాళ్లు తాటించి నిలబడ్డది.

అది చూసి డ్త్రెవరుకు మరింత నవ్వూ, ఉత్సాహమూ వచ్చాయి. అతను దాన్ని ఎగతాళి చేస్తూ, పాటలు పాడుతూ, జీపుతో మరింత పట్టుగా నెట్టాడు. చుట్టూతా చేరిన జనాలు కూడా ఈలలు వేస్తూ, చప్పట్లు చరుస్తూ అతన్ని ఉత్సాహ పరచటం మొదలుపెట్టారు.

చివరికి కరభం పాపం‌ దబ్బుమని నేల మీద పడిపోయింది. రెండు చక్రాల వాహనాలకు దారి లభించటం, ఒక్కటొక్కటిగా అన్ని వాహనాలూ కరభాన్ని రోడ్డు మీదే వదిలి ప్రక్క నుండి తప్పుకొని వెళ్లిపోవడటం జరిగాయి.

ఒక నిముషం తర్వాత రోడ్డంతా ఖాళీ - ఒక్క కరభం తప్ప!

కోపంతో ఎర్రబారిన కరభం కొంచెం తేరుకొని అటూఇటూ చూసే సరికి దాన్నే చూసి నవ్వుతున్న కుందేలు ఒకటి కనబడ్డది. దానికి కరభానికి ఆ క్షణంలో కుందేళ్లన్నిటి మీదా చెప్పలేనంత కోపం వచ్చింది.

"బ్రేయ్....." మని అది ఎన్నిసార్లు ఓండ్రపెట్టినా కుందేలు అక్కడే పొదలో నిలబడి వెర్రినవ్వు నవ్వుతోంది తప్పిస్తే అక్కడి నుండి అస్సలు కదలనే లేదు. కరభం ఒక్క ఉదుటన లేచి దాన్ని వెనక కాళ్లతో తన్నుదామ నుకున్నది గానీ, రోడ్డు మీద తగిలిన దెబ్బ నుండి అదింకా కోలుకోలేదు కదా, కాళ్లు బాగా సహకరించలేదు. అది పొదను చేరే సరికల్లా కుందేలు అక్కడి నుండి మాయం!

ఇప్పుడు కరభానికి కుందేలు మీదే కాక, తన కాళ్ల మీద కూడా చాలా కోపం వచ్చింది. కాళ్లు సహకరించక పోవటం వల్లనే కద, కుందేలు తప్పించుకున్నది?! "నా కాళ్లకి ఎలాగైనా బుద్ధి చెబుతాను" అనుకొని అది మెల్లగా కుంటుకుంటూనే ఇంటి వేపు నడక సాగించింది.

మధ్య దారిలో ఎదురైన గాడిదలన్నీ "గడ్డి మేద్దాం,రా" అని పిలిచాయి దాన్ని. అయినా అది వాటి మాటని పట్టించుకోక, మూతి ముడుచుకొని ముందుకే పోయింది. దాని సంగతి తెలుసు గనక, గాడిదలన్నీ దాని మానాన్ని దాన్ని వదిలేసి తమపని తాము చూసుకున్నాయి.

కరభం ఇంటి దగ్గరికి చేరుకునే లోగానే దానికి ఎదురొచ్చింది ఒక నక్క. కరభం కాళ్లు బాగా‌ లేకపోవటం చూసి దానికి చాలా సంతోషం వేసింది.

"ఏమైంది కరభా! నిన్ను నీ కాళ్ళేదో మోసం చేసినట్లున్నాయే!" అన్నదది, ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగా నిలబడి. సంగతిని అంత సూటిగా కనుక్కున్న నక్క అంటే కరభానికి గొప్ప నమ్మకం ఏర్పడి పోయింది. అది దానికి ఆ రోజు జరిగినదంతా చెప్పి, 'ఈ వెనక కాళ్లకు తగిన శిక్ష ఏదో వెయ్యాలి మామా!' అన్నది.

"ఓ, దానిదేముంది?! నా మిత్రుడు చిరుతకు వెనక కాళ్లతో ఆడుకోవటమంటే బలే సరదా, నేను వాడిని రమ్మంటాను ఆగు, వాడు ఈ కాళ్లకు ఒక్క క్షణంలో బుద్ధి చెబుతాడు," అని నక్క గట్టిగా ఊళవేసింది. మరునిముషంలో ఎక్కడి నుండి ఊడి పడిందో - ఒక చిరుతపులి కరభం ముందు ప్రత్యక్షం అయ్యింది. "ఎంత అదృష్టం! నీ వెనక కాళ్లే నిన్ను మోసం చేస్తున్నాయంటే, ఇంక నా అదృష్టం ఏమని చెప్పను?! నాకూ నక్కకీ నాలుగు రోజుల పాటు పండగే పండగ!" అన్నదది, నాలుకతో పంజాను శుభ్రం చేసుకుంటూ.

ఆ సరికి కరభానికి చిరుత పులి ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. కాళ్లతో బాటు అది తననే తినెయ్యమన్నదని దానికి తెలిసిపోయింది. తన బలహీనతను తనే స్వయంగా శత్రువుకు చెప్పుకున్నందుకు ఆ క్షణాన్నే దానికి చెప్పలేనంత విచారం కలిగింది. అయితే ఇప్పుడేం చెయ్యాలో మటుకు, ఎంత ఆలోచించినా దాని బుర్రకు తట్టనేలేదు.

"ఈ కాళ్లేగా, పని చేయనివి?" అని చిరుతపులి పెదిమలు తడుపుకుంటూ కరభం వెనక్కి వచ్చి చేరుకొని దాని నడుం మీద పంజా వేసే సరికి, గాడిదపిల్ల ముందుకాళ్లు నేలకు అతుక్కుపోయినట్లయినై.

అయితే ఆ భయంలో ఏమైందో గానీ, దానికి తెలీకుండానే దాని నడుం పైకి లేచింది: వెనుక కాళ్లు రెండూ కలుక్కు మంటూనే వాటంతట అవే పైకి లేచాయి: "ఫడేల్...!" మని చిరుతపులి ముఖానికి మెరుపులాగా వచ్చి తగిలినై!

ఒక్క దెబ్బకే చిరుతపులి "కుయ్యో" మంటూ పారిపోయింది. కాళ్లు బాగున్నా బాగాలేనట్లు నటించిన కరభం అంటే దానికి ఇప్పుడు అంతులేని భయంవేసింది. చిరుతపులి వెనకనే నక్క మామ, పరుగో పరుగు!

ఇప్పుడు కరభకు తన కాళ్లంటే మళ్లీ యిష్టం ఏర్పడ్డది. వణికే కాళ్లతో అది వెనక్కి తిరిగి, మిగిలిన గాడిదలన్నిటితో బాటు పచ్చగడ్డి మేసేందుకు బయలు దేరింది.

చిరుతపులి దెబ్బకు దాని మొండితనం‌ పూర్తిగా వదల్లేదు గానీ, గాడిదలు తమ వెనకాళ్లను తాము అస్సలు ద్వేషించ కూడదు!" అని మటుకు బాగా అర్థం అయ్యింది!