అనగనగా ఒక ఊరిలో ఒక బడి. ఆ బడిలో చంద్రం అనే అబ్బాయి ఉండేవాడు. చంద్రం చాలా మంచబ్బాయి, బాగా చదివి స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక రోజు, చంద్రం వాళ్ళ మాష్టారు చంద్రానికి ఒక లైబ్రరీ పుస్తకం ఇచ్చారు-చదివి ఇమ్మని. ఇస్తూ ఇస్తూ "చూడు చంద్రం, ఇది చాలా విలువైన పుస్తకం. జాగ్రత్తగా చూసుకోవాలి- సరేనా?!" అని చెప్పారు. "అలాగేనండీ" అని దాన్ని తీసుకుని ఇంటికెళ్ళాడు చంద్రం.

ఆ రోజు ఇంట్లో ఆ పుస్తకాన్ని రాత్రి చాలా పొద్దు పోయేవరకూ చదువుకున్నాడు అతను. "మళ్ళీ తరువాత చదువుదాంలే, ఇంక చాలా రాత్రయింది" అని అనుకొని, పుస్తకాన్ని తన అరలో పెట్టుకొని పడుకున్నాడు. కానీ ఆ అలమార తలుపు మూయటం మర్చిపోయిన సంగతి చూసుకోనేలేదు. ఇక తెల్లవారాక దాని గురించి మర్చేపోయాడు! హడావిడిగా తయారై స్కూలుకి వెళ్ళిపోయాడు.

చంద్రం ఇంట్లో లేనప్పుడు చంద్రం వాళ్ల చిన్ని చెల్లి మెల్లగా ఆ అలమార దగ్గరికి వచ్చింది. రాగానే దాని కళ్ళు ఈ కొత్తపుస్తకం మీదే పడ్డాయి: "హాయ్! ఈ పుస్తకం భలే బాగుందే!" అని ఆ పుస్తకాన్ని అంతా చూస్తూ చూస్తూ నలిపేసిందా పాప- పాపం చిన్నది కదా, దానికి ఏమీ తెలీదు- అందుకని.

బడి నుండి తిరిగి వచ్చిన చంద్రం ఆ పుస్తకాన్ని చూసీ చూడగానే , అది పాడయినందుకు చాలా కంగారు పడ్డాడు. "దాన్ని రేపు మాష్టారికి ఎలా ఇవ్వను, ఏమని చెప్పను?" అని చాలా బాధపడ్డాడు. వాళ్ల అమ్మా నాన్న వాడిని సముదాయిస్తూ "బాబూ! మరేం ఫర్వాలేదులే, నీ చెల్లి చిన్నది కదా, పాపం తనకి ఆ పుస్తకం విలువ ఏంటో తెలియదు కదా! నువ్వు మాత్రం మాస్టారుగారితో నిజమే చెప్పు, సరేనా?" అన్నారు.

చంద్రం సరేనని బడికి వెళ్ళాడు.

మాష్టారి గారి చేతిలో ఆ పుస్తకాన్ని పెట్టి భోరున ఏడ్చాడు చంద్రం. ఏడుస్తూనే జరిగిందంతా చెప్పి, "ఈ పుస్తకాన్ని మళ్ళీ తెచ్చిపెట్టాలంటే తేలేను. కానీ జరిగిన నష్టానికి మా నాన్న నడిగి డబ్బు ఇచ్చేస్తానండీ" అన్నాడు.

మాష్టారు అంతా విని ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత చిరునవ్వుతో- "చంద్రం! పరవాలేదులే, బాధపడకు. రాత్రి పడుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా తలుపు మూసి ఉండవలసింది. అయినా ఏమీ పరవాలేదులే, కానివ్వు. అయితే ఇవాళ్ల మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది- నువ్వు నిజం చెప్పావు కదా, అందుకని. నీ నిజాయితీకిగాను నీకేదైనా బహుమతి ఇవ్వాలనిపిస్తున్నది. ఇదిగో, ఈ పెన్ను- నీకోసమే, చక్కగా వాడుకో. అయితే గుర్తుంచుకో, ఎప్పుడూ ఇలాగే నిజం చెప్పాలి- ఎవరేమన్నా, ఎంత నష్టం వచ్చినా సరే- సరేనా?!" అన్నారు చిరునవ్వుతో, పెన్ను చేతికిస్తూ.

చంద్రం ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. ఆపైన సంతోషంగా ఆ కలాన్ని పట్టుకొని ఇంటికి పరుగుపెట్టాడు.