ఆఫ్రికాలోని జాంబియాదేశపు రాజధాని లుసాకా. అక్కడి అతి పేద బస్తీల్లో ఒక దానిలో పెరిగింది తండివే. 1999 లో అక్కడే ఒక స్కూల్లో చదువుకుంటూ ఉండేది. ఇంతలో ఉన్నట్లుండి ఆ స్కూలును మూసేశారు! "ఎందుకు?" అని అడిగితే "సరిపడా టీచర్లు లేరు" అన్నారు. తండివే కి అది ఏమాత్రం నచ్చలేదు. కానీ వేరే బళ్ళ వాళ్ళెవరూ ఆ పిల్లల్ని చేర్చుకోటానికి ఇష్టపడలేదు. అప్పుడు హక్కుల కోసం పోరాడడం ఎందుకో అర్థమైంది, తండివేకి. దానితో తనతో పాటు మరో అరవై మంది పిల్లలని వెంటేసుకుని, ఇంకో స్కూలు కోసం వెదుక్కుంటూ నడక సాగించింది. ఈ

నడక మీద స్థానికంగా పెద్ద చర్చే జరిగింది. దానితో, మరో స్కూలు వాళ్ళు ముందుకొచ్చి, వీళ్ళందరినీ చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు!

అలా మొదలైంది, తండివే ప్రస్థానం. పిల్లలందరూ ఎండలో కాక, చక్కగా భవనాల లోపల చదువుకోవాలని చెప్పి, స్థానిక ప్రభుత్వ అధికారి వద్దకు వెళ్లి, స్కూలులో కొత్త భవనాల నిర్మాణం కోసం ధన సహాయం అడిగింది తండివే. స్కూలులో విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ, అధికారులతో మాట్లాడి కొత్త క్లాసులకోసం స్థలం కూడా సాంక్షన్ చేయించింది! 'పిల్లలకు అందరికీ చదువుకునేందుకు హక్కు ఉన్నది...అయితే అందరికీ దాన్ని గురించి తెలియదు'- తండివే ఇక పిల్ల హక్కుల గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టింది; సమస్యలు కనబడ్డ చోట వాటి నిర్మూలనకు పోరాటం చేయడం కొనసాగించింది.

ఆఫ్రికా దేశంలో పెద్దల్లోను, పిల్లల్లో కూడాను- ఎయిడ్స్ వ్యాధి ప్రబలంగా ఉంది. పిల్లల్లో ఎయిడ్స్ గురించిన అవగాహనను పెంచేందుకు కృషి చేసింది తండివే. చిన్నతనంలోనే ఎయిడ్స్ బారిన పడ్డ పిల్లల తరపున వకాల్తా పుచ్చుకుని, వాళ్ళకోసం మిగతా వారు ఏం చేయచ్చో చెబుతూ ప్రచారం చేసిందామె. దగ్గరలో ఉన్న ఓ హాస్పిటల్లో చికిత్స కోసం చేరిన పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళ చేత పళ్ళు వగైరా ఇప్పించింది. పిల్లల్ని, పెద్దల్ని హెచ్.ఐ.వీ. పరీక్షలు చేసుకొమ్మని ప్రోత్సహించడమే కాక, కొంతమందిని స్వయంగా వెంటబెట్టుకుని వెళ్లి పరీక్షలు చేయించింది కూడా. పిల్లలకి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించడం కోసం తన స్నేహితురాలితో కలిసి "ది చికెన్ విద్ ఎయిడ్స్" అన్న పుస్తకం కూడా రాసింది. ఇలాంటి అంశాలను ఆట్టే చర్చించని చర్చిలాంటి సంస్థల్లో కూడా ధైర్యంగా ఎయిడ్స్ బారిన పడ్డ పిల్లల గురించి ప్రసంగించింది. పిల్లల హక్కుల గురించి "ఫర్ మై సేక్" అన్న ఒక పాటను కూడా మరొకరితో కలిసి రచించింది! ఆ పాట వివిధ ఆఫ్రికా దేశాల్లో ప్రచారం పొందింది కూడా.

జాంబియా ప్రభుత్వం వారు తండివే కృషిని గుర్తించి, ఏటేటా పిల్లలకి ఇచ్చే అవార్డును ఆమెకు ఇచ్చి సత్కరించారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర అధికారుల సమక్షంలో ఆమెని ప్రసంగించమని ఆహ్వానించారు. ఆమె ప్రసంగం తరువాత, 'దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించిన చర్చల్లో పిల్లలు పాల్గొనేట్లు ఎలా చేయచ్చు?' అని వారు ప్రణాళికలు వేశారంటే, ఆమె ఎంత చక్కగా మాట్లాడిందో ఊహించవచ్చు. అటుపైన ఆమెకు అంతర్జాతీయ శాంతి బహుమతి వచ్చినప్పుడూ, తరువాత నార్వే దేశంలో జరిగిన "గ్లోబల్ యూత్ పీస్ బిల్డింగ్ ఇనీషియేటివ్"లోను- ఇలా ఎన్నో చోట్ల ప్రసంగించింది తండివే. పిల్లల శాంతి బహుమతి సందర్భంగా-తనకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు- ఆమె చేసిన ప్రసంగం నచ్చి, ఒక సంస్థ వారు ఆమెకి వాళ్ళ స్కూల్లో లైబ్రరీ నిర్మాణానికి చేయూతను అందించారు! అలా, స్థానిక సమస్యల గురించి, పిల్లల హక్కుల గురించీ ఇంకా కృషి చేస్తూనే ఉంది తండివే.

"పిల్లలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అన్న ఎరుక అవసరం. మా స్కూల్లో నా హక్కుల గురించి నేను తెలుసుకున్నాను. అప్పుడే 'వాటికోసం నేను పోరాడాలి' అని కూడా నిర్ణయించుకున్నాను. పిల్లలకి అవకాశం ఇస్తే, వాళ్ళు ఎన్నో పనులు చేసి, ప్రపంచానికి మేలు చేస్తారని నా నమ్మకం" అనే తండివే చామా, ఇలాగే మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. అలాగే, ఆ స్ఫూర్తితో మన పరిధిలో మనం ఏం చేయగలమో కూడా ఆలోచిద్దాం!