గాంధీజీ ఓసారి బొంబాయిలో ఒక సమావేశానికి వెళ్ళారు.

సభలో ఏది మాట్లాడాలన్నా ముందుగా నోట్సు రాసుకొని ఉండాలి- ఊరికే నోటికొచ్చింది మాట్లాడేందుకు లేదు: అదీ గాంధీగారి నియమం.

ఇంకా కొద్ది సేపట్లో‌ సభ ప్రారంభం అవుతుంది. కానీ గాంధీగారి నోట్సు ఇంకా తయారు కాలేదు. "నోట్సు తయారు చేసుకొని కలుస్తాను" అని గదిలోకి వెళ్ళాడాయన.

ఓ పావు గంట గడిచింది. తయారీ ఎంతవరకు వచ్చిందో చూద్దామని గదిలోకి వెళ్ళాడు ఆయన కార్యదర్శి కాకా సాహెబ్ కలేల్కర్. అక్కడ గాంధీ హడావిడిగా ఏదో వెతుకుతూ కనబడ్డాడు.

"ఏమైంది? ఏం పోయింది ఇప్పుడు?" అడిగాడు కాకా సాహెబ్.

"పెన్సిలు! నా పెన్సిలు కనబడటం లేదు. ఇంత పొడవుంది: ఎరుపు-నలుపు రంగుల్లో ఉంటుంది- నువ్వూ వెతుకు కాస్త. అది చాలా అవసరం" వెతుకుతూనే చెప్పాడు గాంధీ.

కలేల్కర్ జేబులోంచి తన పెన్సిలు తీసి ఇవ్వబోయాడు-"ఇదిగో, దీంతో రాయండి. మీటింగుకు సమయం అవుతున్నది. మీ పెన్సిలు కోసం మళ్ళీ వెతకొచ్చు".

"ఉహుఁ వద్దు. కొంచెం నువ్వూ‌ వెతికి పెట్టు. నా పెన్సిలు ఇక్కడే ఉంటుంది ఎక్కడో. ఎక్కడికీ పోదు- ఇందాకే గదా, వేరే ఏదో రాశాను? అది లేకుండా పని కాదు!"

కలేల్కర్ ఇంకా ఏదో చెప్పబోయి, "ఎట్లాగూ వినడులే" అని ఆగిపోయాడు. తనూ వెతికాడు.

ఐదు నిముషాల్లో దొరికింది-పుస్తకాల మధ్యనే ఉన్నదది- చిన్న పెన్సిలు ముక్క! వేలెడంత పొడవుంది, అంతే. దాన్ని చూడగానే గాంధీ కళ్ళు మెరిసాయి-

"దొరికింది! అబ్బ! పోయిందనే అనుకున్నాను. చిన్నది కదా, కనబడకుండా దాక్కుంది కొంచెం సేపు!" అన్నాడు దాన్ని పట్టుకొని మురిసిపోతూ.

ఇంత చిన్న ముక్క కోసం అంత కంగారు పెట్టాలా? నా పెన్సిలు ఇస్తానన్నాగా, దాంతో రాస్తే ఏం పోయేది?" గొణిగాడు కాకా సాహెబ్.

"ఉహుఁ నీకు తెలీదు, దీని విలువ. ఆ మధ్య, మద్రాసులో, నటేశన్ వాళ్ల చిన్నకొడుకు లేడూ- వాడిని అడిగాను- 'నాకేమన్నా ఇస్తావా?' అని. వాడు చాలా మామూలుగా తను రాసుకుంటున్న పెన్సిలు తీసి నాకిచ్చేశాడు. 'పూర్తిగా ఐపోయేంత వరకూ జాగ్రత్తగా వాడాలి, సరేనా?' అన్నాడు. నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు అంత మంచి పెన్సిలు పోయిందంటే ఎలాగ?! పిల్లలకు ఓసారి మాట ఇచ్చిన తర్వాత నిలుపుకోవాలి-అంతే!" అన్నాడు గాంధీ స్థిరంగా, ఆ పెన్సిలుతోటే ఆనాటి ఉపన్యాసం రాసుకుంటూ.

మనం వాడే వస్తువులు చిన్నవి కావొచ్చు, పెద్దవి కావొచ్చు; ఖరీదైనవి కావొచ్చు, చవకవి కావొచ్చు- కానీ ఏ వస్తువూ దానంతట అది రాదు. ప్రతి వస్తువు వెనకా ఒక మనిషి శ్రమ ఉన్నది. ఆ మనిషిని, ఆ శ్రమని తలుచుకుంటే ప్రతి వస్తువూ ఒక కథ చెబుతుంది. వస్తువులని జాగ్రత్తగా వాడుకోవాల్సింది అందుకే- వాటి వెనక ఉన్న కధలు వినబడేందుకు; వాటి పట్ల మనం మర్యాద తోటీ, గౌరవంతోటీ వ్యవహరించేందుకు. అట్లా వస్తువులు చెప్పే కథలు వినగలిగిన వాళ్ళకు పర్యావరణం పట్ల అవగాహన, తోటి మనుషుల పట్ల ప్రేమ సహజంగానే వస్తాయనిపిస్తుంది. ఏమంటారు?

అందరికీ అక్టోబరు రెండు శుభాకాంక్షలు!

కొత్తపల్లి బృందం.