చాలా రోజుల క్రితం అవంతీ రాజ్యాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రముడి ఆస్థానంలో ఆపనీ-ఈపనీ చేస్తుంటాడు శివుడు. శివుడి బుర్రనిండా చాలా తెలివితేటలు ఉండేవి. కఠిన సమస్యలు అనేకాన్ని పరిష్కరించి అతను గతంలో రాజుగారి ఆదరణకు పాత్రుడయ్యాడు కూడా.
విక్రముడు ఋషులనీ, మునులనీ బాగా ఆదరించేవాడు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక మహాముని వచ్చాడు. విక్రముడు ఆయనకు అనేక సేవలు చేశాడు. దానికి సంతోషించిన ఆ ముని విక్రముడికి ఒక వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు: ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇచ్చే శక్తి ఉంది, ఆ వజ్రానికి. అందుకు అవసరమైన మంత్రాన్ని కూడా ముని రాజుగారికి ఉపదేశించాడు.
రాజు ఆ వజ్రాన్ని తీసుకున్నారు. ఎంతో జాగ్రత్తగా ఒక గదిలో పెట్టారు దాన్ని. తన దగ్గరున్న అసంఖ్యాకులైన సైనికుల్లో ఎవరో ఒక ఐదుగురు- అనుక్షణం ఆ వజ్రాన్ని కాపలా కాసే ఏర్పాటు చేశారు. అవసరం అనిపించినప్పు-డల్లా రాజుగారు ఆ వజ్రం దగ్గరకు వెళ్ళి దాన్ని ప్రార్ధించేవారు. కావలసినంత డబ్బుని ఇస్తూండేది ఆ వజ్రం. అలా ఆ రాజ్యంలో ధనానికి కరువు ఉండేది కాదు.
ఒకరోజున రాజుగారు వజ్రం ముందు నిలబడి ముని చెప్పిన మంత్రం చదివారు. అది ఏమీ చేయలేదు! రాజుగారు దాన్ని రకరకాలుగా అడిగి చూశారు.
అది ఏమీ ఇవ్వలేదు. చివరికి రాజుగారు దాన్ని పరీక్షగా చూశారు: అది అసలు వజ్రం కాదు- అక్కడున్నది కేవలం ఒక గాజుముక్క! ఎవరో దాన్ని చాలా చక్కగా, ఈ వజ్రం మాదిరే తయారు చేసి పెట్టారు!
రాజుగారు కంగారు పడ్డారు. వజ్రం ఆధారంగానే తను ఇన్నాళ్ళూ మంచిపనులు అనేకం చేసి ఉన్నాడు- ఇకమీద అవన్నీ వీలవ్వవు. అదీగాక, తను ఈ వజ్రం మహత్తును ఎవ్వరికీ చెప్పి ఉండలేదు- ఇప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలిపితే, ముందుగా పోయేది తన పరువు! అలా అని, దొంగలు ఈ వజ్రాన్ని దుర్వినియోగం చేయలేరు: వజ్రాన్ని ఎలా ప్రార్థించాలో ఎవరికీ తెలీదు గద!
ఇక, తను పెద్ద ఎత్తున ప్రయత్నం చేయకపోతే దొంగ ఎవరో తెలిసే అవకాశం లేదు. సైన్యంలో కాపలాదారులుగా వచ్చిన వాళ్ళే ఎవరో ఈ పని చేసి ఉండాలి. అయితే పెద్దగా, అందరికీ తెలిసిపోయేటట్లు ప్రయత్నించటం మంచిది- కాదు: దొంగలు వజ్రాన్ని నాశనం చేయవచ్చు; వేరే ఏ దేశంలోనో వచ్చిన ధరకు అమ్మేయవచ్చు. మరి ఎలాగ?
రాజుగారి విచారాన్ని గమనించాడు శివుడు. "ప్రభువులవారు ఏదో సమస్య ఎదుర్కొంటున్నట్లున్నారు. నాకు చెబితే, నేను నా వంతుగా ఏదైనా చేస్తాను" అన్నాడు.
రాజుగారు ఒక్క క్షణం ఆలోచించి, శివుడికి సమస్యను వివరించారు.
"మన సైనికులలోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు. దొంగ ఎవరో, ఇక్కడ కనీసం రెండు సార్లు కాపలా పనికి వచ్చి ఉండాలి- మొదటిసారి వచ్చినప్పుడు వజ్రాన్ని గమనించి, మంచి పటం తయారు చేసికొని వెళ్ళి ఉండాలి; రెండోసారి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని, ముందుగా తయారు చేసుకొన్న గాజు ముక్కను అక్కడ పెట్టి ఉండాలి.. అలాంటి అవకాశం ఎంతమందికి ఉన్నదో కనుక్కుంటాను" అన్నాడు శివుడు.
రాజుగారికి శివుడు ఈ సమస్యను పరిష్కరించగలడన్న నమ్మకం కలిగింది. "విషయం బయటికి పొక్కనివ్వకు. వజ్రంలో మార్పును మనం గమనించామని దొంగకు తెలియనివ్వకు" అని హెచ్చరించి, ఆయన అంత:పురానికి వెళ్ళిపోయారు.
'వజ్రాన్ని కాపలా కాసిన సైనికులు ఎంతమంది' అని శోధించాడు శివుడు. వేలమంది ఉన్నారు. వాళ్ళలో కనీసం రెండుసార్లు కాపలా పనికి వచ్చినవాళ్ళు, గత కొన్నాళ్ళుగా పనిలోకి వచ్చినవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు! అంతమందిలో దొంగ ఎవ్వరో గుర్తించటం అంత సులభం కాదు! ఒక పథకం ఆలోచించాడు శివుడు. కాపలా కాసిన వాళ్లందరినీ సమావేశానికి ఆహ్వానిస్తూ రాజుగారి చేత ఒక ప్రకటన జారీ చేయించాడు.
ఆ సమావేశంలో శివుడు లేచి నిలబడి, "మీకందరికీ తెలిసే ఉంటుంది- వజ్రాలలో దోషాలను పసిగట్టటమే కాకుండా, వాటిమీద ఉన్న వేలిముద్రల ప్రకారం వాటి దగ్గరికి దుష్టబుద్ధితో ప్రవేశించిన వాళ్లందరినీ గుర్తుపట్టగల మహానుభావులు, వీరేంద్రసాయి బాబా గారు. వారు వచ్చేవారం మన రాజ్యానికి విచ్చేస్తున్నారు. మహారాజుగారి అనుజ్ఞ అయితే, వారు మీ అందరితోటీ మళ్ళీ ఓసారి సమావేశం అవుతారు. ఆ సమయంలో వారు మన వజ్రాన్ని పరీక్షిస్తారు; అలాగే మీ అందరితోటీ వేరువేరుగా మాట్లాడి, మీ అంతరంగపు లోతులను పరిశీలిస్తారు" అని ప్రకటించాడు. చివరగా మహారాజుగారు మాట్లాడుతూ వీరేంద్రసాయి బాబా గారిని సాదరంగా ఆహ్వానించమన్నారు.
అనుకున్న రోజున వీరేంద్రసాయిబాబా గారు రానే వచ్చారు. పొడవాటి బవిరి గడ్డం, గుబురు మీసాలు, పెద్ద బొట్టు, చురుకైన చూపులతో ఆయన దైవత్వం మూర్తీభవించి-నట్లున్నారు. ఉద్యానవనంలో ఉన్న చిన్న కుటీరాన్ని ఆయనకు బసగా తయారు చేశారు. ఆయన రాగానే రాజుగారు ఆయన్ని విశ్రాంతి తీసుకొమ్మన్నారు- తాను మరునాటి ఉదయం వారిని సందర్శించుకుంటాననీ, మధ్యాహ్నం కాపలాదారులతో సమావేశం ఉంటుందనీ ప్రకటించారు.
వజ్రాన్ని దొంగిలించిన సోమయ్యకు ఇదంతా చాలా కంటగింపుగా తోచింది. సోమయ్య రాజుగారి సైనికుల్లో ఒకడు. తనకు మొదటిసారి కాపలా బాధ్యత వేసినప్పుడు చూశాడతను- కళ్ళు జిగేల్‌మనేట్లు మెరుస్తున్న ఆ వజ్రాన్ని. దాన్ని చూడగానే ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనిపించిందతనికి. 'ఇతర దేశాల్లో దాన్ని అమ్ముకుంటే, జీవితాంతం కులాసాగా బ్రతికేందుకు సరిపడేంత డబ్బు వస్తుంది!' అని అతను ఒక పథకం వేశాడు: సరిగ్గా వజ్రం లాగానే ఉండే గాజుముక్కనొకదాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. మరోసారి తనకు కాపలా బాధ్యత వచ్చినప్పుడు చడీ చప్పుడు లేకుండా వజ్రాన్ని తీసేసుకొని, దాని స్థానంలో గాజుముక్కను అమర్చి పెట్టాడు. అందరూ వజ్రాన్ని భక్తిభావంతో చూస్తారు తప్పిస్తే, 'అది గాజుముక్క అయిఉండవచ్చు' అన్న ఆలోచనే ఎవ్వరికీ రాదు గద! అందుకని తన దొంగపని ఎప్పటికీ బయటపడదనే అనుకున్నాడతను- కానీ ఇప్పుడు అదంతా బయట పడిపోనున్నది. అంతే కాదు; తనూ దొరికిపోనున్నాడు!
సోమయ్యకు వేరే మార్గం ఏదీ తోచలేదు- 'ఆ సన్యాసిని చంపెయ్యటం ఒక్కటే దారి!' అని, వాడు కత్తినొకదాన్ని చేతపట్టుకొని ఆరోజు రాత్రి వీరేంద్రసాయి బాబా బసచేసిన కుటీరం దగ్గరికి చేరుకున్నాడు. మెల్లగా లోపలికి దూరబోతూ అక్కడ ప్రత్యేకంగా నియమించిన రాజుగారి సైనికులకు ఎంచక్కా దొరికిపోయాడు!
శివుడు వాడి ఇంట్లో అంతటా వెతికించి అసలు వజ్రాన్ని పట్టుకున్నాడు. రాజుగారి సమస్య తీరింది-అసలు వజ్రం తిరిగి దొరికింది.
"వీరేంద్రబాబా గారు గొప్ప మహిమ గలవారల్లే ఉన్నారు. వారినే పిలుద్దాం, ఈ వజ్రాన్ని తిరిగి ప్రతిష్ఠించమందాం" అన్నారు రాజుగారు, సంతోషంగా.
"అవసరం లేదు మహారాజా! వీరేంద్రబాబా-గారు మరెవరో కాదు- మన యువరాజావారే!" అన్నాడు శివుడు, బాబాగారి పెట్టుడు మీసాల్నీ గడ్డాల్నీ చూపిస్తూ!
రాజుగారు శివుడి యుక్తిని అర్థం చేసుకొని గట్టిగా నవ్వారు. శివుడికి ఒక వరహాల మూటను బహుమానంగా అందించారు.