చిన్నప్పుడు నేను ఒక చోట కుదురుగా కూర్చొనేదాన్ని కాదు. ఎప్పుడూ కాళ్ళు కాలిన పిల్లిలా అటూ-ఇటూ తిరుగుతూనే ఉండేదాన్ని. ఎవరూ చూడకుండా ఎన్నో వస్తువులు బయటకు పీకి వాటిని పరిశీలించే దాన్ని.

ఆ యేడాది వేసవిలో విపరీతంగా వేడి. బయట చాలా ఎండగా ఉండేది-అందుకని మేము మధ్యాహ్నం పూట దొడ్లో మామిడిచెట్టు కింద మడతమంచాలు వేసుకొని విశ్రాంతిగా పడుకునేవాళ్లం, ఆడుకునేవాళ్లం.

ఒకరోజు మధ్యాహ్నం అట్లా నేను మామిడి చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉండగా మా అమ్మమ్మ ఆ నాడే ఎండబెట్టిన బియ్యప్పిండి నా కంటపడింది.

నిజంగా చెప్పాలంటే నాకు ఆ బియ్యప్పిండి ఏమంత నచ్చలేదుగానీ, పిండి ఉన్న ఆ జల్లెడ మటుకు చాలా ఆకర్షణీయంగా ఉంది. అందరూ పడుకు-న్నారో లేదో చూసి, నేను పాల దగ్గరికి వెళ్ళే పిల్లిలాగా ఆ జల్లెడ దగ్గరికి వెళ్ళాను.

జల్లెడ చూడడానికి చాలా వింతగా ఉంది. ఒక ప్లాస్టికు రింగు ఉంది; దానిలో గుండ్రంగా ఉన్న గట్టి వల ఒకటి ఉంది. జల్లెడను కొంచెం పీకామంటే ఆ ప్లాస్టికు రింగు, జాలీ రెండూ ఊడి వచ్చేస్తాయి- భలేగా.

నేను రెండు నిమిషాలు దానికేసి చూసా. ఆ జల్లెడ క్రింద ఒక కాగితం ఉంది. దేన్నైనా ఎండబెట్టినప్పుడు నేలమీద పెట్టకూడదు-ఏదైనా పేపరు వేసి, దానిమీద పెట్టాలి- మట్టి అంటకుండానన్నమాట. నేను మెల్లగా వెళ్ళి జల్లెడను ఎత్తాను- కాగితంతో సహా. రవ్వంత పిండి కూడా కిందపడలేదు!

నాకు చాలా సంతోషం వేసింది. కాయితాన్ని అట్లాగే పట్టుకొని క్రింద అంతా వంగి చూశా. భలే ఉంది. 'ఇప్పుడు ఈ జల్లెడని తిరగ త్రిప్పి చూద్దాం' అనుకున్నా. కాయితాన్ని ఎత్తితే జల్లెడ కూడా దానితోబాటు లేస్తున్నది. జల్లెడ మాత్రమే ఒక్కసారి ఎగిరి తిరగబడితే బాగుండు.

నేను కాయితాన్ని ఒక్కసారిగా ఎత్తి చూశా. జల్లెడ కొంచెం ఎగిరింది. కాయితాన్ని ఇంకా ఇంకా పైకి ఎత్తా. చివరికి ఏమైందో ఏమో, జల్లెడ ఒక్కసారిగా కాయితం మీదినుండి జారి, నా నెత్తి మీద బోర్లా పడింది! నా తలమీద అంతా బియ్యప్పిండి! నా చేతులనిండా బియ్యప్పిండి! నేను నా తలమీదినుండి జల్లెడను తీసి, వెనక్కి తిప్పి, దాన్ని మళ్ళీ నా నెత్తి మీద పెట్టుకుని, తలతోటే జాలీని బయటికి తోశాను. మరికొంత పిండి పడింది, నా మీద. వల నా తలమీద నిలిచిపోయింది, ప్లాస్టికు రింగు మెడలో దండలాగా పడింది! నాకు చాలా సంతోషం వేసింది: 'బియ్యప్పిండి నాకు పూజ చేసి, దండ కూడా వేసింది మరి!'

ఆ సంతోషంలో‌ నేను ఇంకో ఘనకార్యం చేశాను-

'ఎండలు బాగా ఉన్నాయి' అని చెప్పాను కదా, మామిడి చెట్టు క్రింద చల్లగా ఉంది. మా అమ్మ, అమ్మమ్మ, ఇంకా ఇంట్లోవాళ్ళు అందరూ చెట్టు క్రింద మంచాలు వేసుకొని పడుకొని నిద్ర పోతున్నారు హాయిగా. నా సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవాలి కదా, అందుకని నేను క్రిందపడ్డ జాలీని తీసుకెళ్ళి, మా అమ్మ ముఖం మీద పెట్టి ఒత్తి, "ఓయ్...ఓయ్..." అని అరిచా.

ఇంక ఏం చెప్పాలి? మా అమ్మ నా అవతారాన్ని చూసి ఎంత జడుసుకున్నదో చెప్పలేను. "కెవ్వు"మని అరిచింది ఆమె పడుకొనే. మా అమ్మమ్మ కూడా గబుక్కున లేచి కూర్చున్నది. అమె మొఖం చూస్తే 'ఎక్కడ మూర్ఛపోతుందో ' అని టెన్షన్ పుట్టింది!

వాళ్ల అరుపులకు మిగిలిన వాళ్లందరూ లేచారు. అదేంటో మరి- అందరూ ఏ దయ్యాన్నో చూసినట్టు తెల్లబోయారు. కొందరి నోర్లయితే అట్లాగే తెరుచుకుని ఉండిపోయాయి!

'బియ్యప్పిండిని నేలపాలు చేసినందుకు మా అమ్మమ్మ ఏమంటుందో' అని నాలో అలజడి మొదలైంది. అదృష్టవశాత్తూ అమ్మమ్మకి అది నేనని గాని, నామీద ఉన్నది బియ్యప్పిండి అని గాని అర్థం అవ్వలేదు. 'అక్కడున్నది ఏదో దయ్యం' అనే అనుకున్నదట, ఆమె!

కొంచెం సేపటికి మామయ్య బిగ్గరగా నవ్వాడు. అంతలోనే అందరూ తేరుకొని స్పృహలోకి వచ్చినట్లున్నారు; గట్టిగా నవ్వటం మొదలు పెట్టారు.

తరువాత అమ్మమ్మ, అమ్మా కూడా పడీ పడీ‌ నవ్వారు. నవ్వటమే కాదు- మా మామయ్య ఐతే ఆరోజున నావి రెండు-మూడు ఫోటోలు కూడా
తీసుకున్నాడు!

ఆ ఫొటోలు ఇంకా ఉన్నై, నా దగ్గర. వాటిని చూసినప్పుడల్లా ఆ సంఘటన నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది-

చిన్ననాటి జ్ఞాపకాలే గద, నాణ్యమైన జ్ఞాపకాలు!?